Begin typing your search above and press return to search.

రైట్ కంటే లెఫ్ట్.. టీమిండియా తుది జట్టులో ఆరుగురు.. రికార్డే

అంటే తుది జట్టులో మొత్తం ఆరుగురు లెఫ్ట్ హ్యాండర్లు. కుడిచేతివాటం వారి కంటే ఎక్కువన్నమాట.

By:  Tupaki Desk   |   28 Nov 2023 1:30 AM GMT
రైట్ కంటే లెఫ్ట్.. టీమిండియా తుది జట్టులో ఆరుగురు.. రికార్డే
X

టీమిండియా ప్రపంచ కప్ ఆడుతోంది.. ఓపెనర్లు శుబ్ మన్ గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ, వన్ డౌన్ లో విరాట్ కోహ్లి, తర్వాత శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్.. ఆపై ఏడో నంబరులో రవీంద్ర జడేజా.. ఏంటి..? ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిపోయాం కదా..? ఇప్పుడెందుకు ఇదంతా అని అంటున్నారా? పైన చెప్పుకొన్న ఏడుగురిలో మొదటి ఆరుగురు కుడి చేత వాటం బ్యాట్స్ మన్. ప్రపంచ కప్ ఫైనల్లో మనల్ని ఓడించిన ఆస్ట్రేలియా వంటి జట్టులో ఓపెనర్లు ఇద్దరూ ఎడమచేతివాటం వారే. మిగతా జట్లలో కనీసం ఒక్కరైనా స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ ఎడమచేతివాటం వారు. టీమిండియాలో మాత్రం ఒక్కరూ లేరు. రవీంద్ర జడేజా ఉన్నప్పటికీ ఆల్ రౌండర్.

మరిప్పుడు..?

టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో ఐదు టి20ల సిరీస్ ఆడుతోంది. ఇందులో రెండు మ్యాచ్ లు ముగిశాయి. రెండింటిలోనూ గెలిచి మాంచి ఊపుమీదుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో దూకుడే మంత్రంగా దూసుకెళ్తోంది. కాగా.. ఇప్పుడున్న జట్టును చూస్తే.. ఓపెనర్లు రుతురాజ్, యశస్వి జైశ్వాల్. వన్ డౌన్ లో ఇషాన్ కిషన్, నంబర్ 4లో సూర్య, ఆ తర్వాత హైదరాబాదీ తిలక్ వర్మ, ఫినిషర్ గా ఎదుగుతున్న రింకూ సింగ్. వీరంతా స్పెషలిస్ట్ బ్యాట్స్ మెనే. ఈ జాబితాలో జైశ్వాల్, కిషన్, తిలక్, రింకూ నలుగురూ లెఫ్ట్ హ్యాండర్లే. ఇక బౌలింగ్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్, పేసర్ అర్షదీప్ సింగ్ కూడా ఎడమచేతివాటం వారే. అంటే తుది జట్టులో మొత్తం ఆరుగురు లెఫ్ట్ హ్యాండర్లు. కుడిచేతివాటం వారి కంటే ఎక్కువన్నమాట.

రికార్డే.. ఎందుకంటే..?

భారత జట్టులో కుడిచేతి వాటం ఆటగాళ్లు మొదటినుంచీ ఎక్కువే. అసలు ఎడమచేతి వాడకం అనేదానిని మన పెద్దలు ప్రోత్సహించేవారు కాదు. కానీ, విదేశాల్లో రెండు చేతులూ ఒక్కటేనన్న భావనతో ఉంటారు. అందుకే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లలో గొప్ప ఎడమచేతివాటం బ్యాట్స్ మెన్ పుట్టారు. భారత్ లో సౌరభ్ గంగూలీ తప్ప దిగ్గజ ఎడమచేతివాటం వారు ఎవరూ లేరు. శిఖర్ ధావన్ వంటి వారున్నా.. అతడి స్థాయి తక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియాలో ఆరుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉండడం విశేషమే. వాస్తవానికి దేశంలో ఎడమచేతి వాటం క్రికెటర్ల సంఖ్య పెరుగుతోంది. చాలామంది యువ క్రికెటర్లు జాతీయ జట్టులోకి వచ్చేందుకు పోటీ పడుతున్నారు.

ఒక్కొక్కరిది ఒక్కో శైలి

ప్రస్తుతం టీమిండియా జట్టు సభ్యుల్లో యశస్వి జైశ్వాల్ ది దూకుడైన, టెక్నికల్ గా బలమైన ఆట. అన్ని వైపులా షాట్లు కొట్టగలడు. కిషన్ కూడా మైదానం అంతా షాట్లు కొట్టగలడు. ఇతడిది దూకుడే మంత్రం. తిలక్ మాత్రం పూర్తి స్థాయి సంప్రదాయ బ్యాట్స్ మన్. రింకూ ఆన్ సైడ్ బలంగా ఆడతాడు. అక్షర్ ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయి ఆల్ రౌండర్ గా ఎదుగుతున్నాడు.

కొసమెరుపు: టీమిండియాలో ఏడాది కిందటి వరకు రెగ్యులర్ ఆటగాడు రిషభ్ పంత్. ఎక్స్ ఫ్యాక్టర్ గా అతడిని అందరూ కొనియాడారు. కానీ, డిసెంబరు 30న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జట్టుకు దూరమయ్యాడు. అతడు గనుక కోలుకుంటే గనుక మరో బలమైన ఎడమచేతి వాటం ఆటగాడు అందుబాటులో ఉన్నట్లే.