Begin typing your search above and press return to search.

ఇలాంటి యజమానుల కోసం ఐపీఎల్ కాదు.. లక్నో ఓనర్ సంజీవ్ గోయంకాపై లలిత్ మోడీ ఫైర్..

ఐపీఎల్‌లో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకున్న వేళ మైదానంలో జరిగే ఆటకన్నా బయట జరుగుతున్న పరిణామాలే ఎక్కువ చర్చనీయాంశంగా మారుతున్నాయి.

By:  A.N.Kumar   |   3 April 2026 6:00 PM IST
ఇలాంటి యజమానుల కోసం ఐపీఎల్ కాదు.. లక్నో ఓనర్ సంజీవ్ గోయంకాపై లలిత్ మోడీ ఫైర్..
X

ఐపీఎల్‌లో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకున్న వేళ మైదానంలో జరిగే ఆటకన్నా బయట జరుగుతున్న పరిణామాలే ఎక్కువ చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయంకా ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదానికి మరింత ఊపిరి పోసింది ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ చేసిన సంచలన వ్యాఖ్యలు.





ప్రస్తుతం ఐపీఎల్ పోటీలు ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్నాయి. కొన్ని పిచ్‌లపై బ్యాట్స్‌మెన్ పరుగుల వర్షం కురిపిస్తుంటే మరికొన్ని మైదానాల్లో బౌలర్లు ఆధిపత్యం చాటుతున్నారు. మ్యాచ్ ఫలితం చివరి ఓవర్ల వరకు తెలియని స్థాయిలో పోటీ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి జట్టుకూ గెలుపుపై ఆశలు సహజమే. కానీ ఓటమిని స్వీకరించే తీరు కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

అయితే లక్నో యజమాని సంజీవ్ గోయంకా ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గతంలో జట్టు కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ పై కూడా ఓటమి అనంతరం మైదానంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన గుర్తుండగానే ఉంది. ఆ తరువాత అతడిని పక్కనబెట్టి కొత్తగా రిషబ్ పంత్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.

కానీ పంత్ నేతృత్వంలో జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. గత సీజన్‌లోనే కాదు.. ప్రస్తుత సీజన్‌లో కూడా లక్నో ప్రదర్శన అంతగా ఆకట్టుకోవడం లేదు. ఇటీవల జరిగిన ఓటమి అనంతరం కూడా సంజీవ్ గోయంకా మైదానంలోనే రిషబ్ పంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం పెద్ద చర్చకు దారితీసింది. ఇంకా టోర్నీలో అనేక మ్యాచ్‌లు మిగిలి ఉండగా ఇలాంటి ప్రవర్తన జట్టు మనోబలాన్ని దెబ్బతీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ లలిత్ మోడీ ఘాటుగా స్పందించారు. ఆటగాళ్లు, అభిమానుల కోసం ఐపీఎల్ ఏర్పాటైందని, యజమానులు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవాలని ఆయన సూచించారు. సంజీవ్ గోయంకా ప్రవర్తనను తీవ్రంగా తప్పుబట్టిన మోడీ “ఇలాంటి యజమానుల కోసం ఐపీఎల్‌ను రూపొందించలేదు” అంటూ విమర్శించారు. అంతేకాక తాను ఇంకా చైర్మన్‌గా ఉన్నట్లయితే గోయంకాపై చర్యలు తీసుకునేవాడినని కూడా స్పష్టం చేశారు.

లలిత్ మోడీ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో విస్తృత మద్దతు లభిస్తోంది. అభిమానులు కూడా సంజీవ్ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ వంటి భారీ టోర్నీలో ప్రతి జట్టు గెలవాలని ఆశపడటం సహజమే అయినప్పటికీ విజయం ఒక జట్టుకే దక్కుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.

ఇప్పటికైనా సంజీవ్ గోయంకా తన ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని ఆటగాళ్లపై విశ్వాసం పెంచాలని అభిమానులు కోరుతున్నారు. లేదంటే జట్టు ప్రదర్శనపై దీని ప్రభావం మరింత తీవ్రంగా పడే అవకాశముందని క్రీడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.