Begin typing your search above and press return to search.

క్రికెట్ లోకి కోహ్లి ’కొడుకొచ్చాడు..’ రూ.లక్షకు కొన్న ఢిల్లీ

పోటీ క్రికెట్ లోకి టీమ్ ఇండియా దిగ్గజం విరాట్ కోహ్లి కొడుకొచ్చాడు.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లోకి అడుగుపెట్టారు.

By:  Tupaki Desk   |   7 July 2025 11:15 AM IST
క్రికెట్ లోకి కోహ్లి ’కొడుకొచ్చాడు..’ రూ.లక్షకు కొన్న ఢిల్లీ
X

పోటీ క్రికెట్ లోకి టీమ్ ఇండియా దిగ్గజం విరాట్ కోహ్లి కొడుకొచ్చాడు.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లోకి అడుగుపెట్టారు. అదేంటి.. కోహ్లి కుమారుడికి ఇంకా ఏడాదిన్నర కూడా లేదు కదా..? అప్పుడే క్రికెట్ లోకి రావడం ఏమిటి? అనుకుంటున్నారా? మీరు చదివేది నిజం.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్ఫూర్తితో చాలా రాష్ట్రాలు, నగరాలు ప్రీమియర్ లీగ్ లు నిర్వహిస్తున్నాయి. ఇలాంటిదే ఢిల్లీ ప్రీమియర్ లీగ్ కూడా. ఈ ఏడాది ప్రారంభంలో 6 జట్లతో ఈ లీగ్ సాగగా ఇప్పుడు జట్లు 8కి పెరిగాయి. త్వరలో డీపీఎల్ రెండో సీజన్ జరగనుంది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ఈ లీగ్ ను నిర్వహిస్తుంది. ఔటర్ ఢిల్లీ, న్యూఢిల్లీ జట్లు కొత్తగా వచ్చి చేరాయి.

ఈ లీగ్ లోంచి వచ్చినవాడే స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ. ఈ ఏడాది ఐపీఎల్ లో వివాదాస్పద ప్రవర్తనతో క్రమశిక్షణ చర్యలకు గురయ్యాడు. కాగా, ఇదే లీగ్ లో విరాట్ కోహ్లి అన్న కుమారుడు ఆర్యవీర్ కోహ్లి కూడా ఆడనున్నాడు. ఆదివారం జరిగిన వేలంలో అతడిని రూ.లక్షకు సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ జట్టు కొనుక్కుంది.

బాబాయ్ విరాట్ కోహ్లి బీభత్సమైన బ్యాట్స్ మన్ కాగా.. ఆర్యవీర్ మాత్రం లెగ్ స్పిన్నర్. విరాట్ కు చిన్నప్పటి నుంచి ట్రయినింగ్ ఇచ్చిన రాజ్ కుమార్ శర్మనే ఆర్యవీర్ కు కూడా కోచ్ కావడం గమనార్హం. ఇప్పటివరకు ఢిల్లీ తరఫున ఆడని 15 ఏళ్ల ఆర్యవీర్.. డీపీఎల్ తోనే అరంగేట్రం చేయనున్నాడు. ఇతడి జట్టు కెప్టెన్ ఆయుష్ బదోని కావడం గమనార్హం. బదోని గతంలో విరాట్ కోహ్లి ఐపీఎల్ లో ప్రాతినిధ్యం వహించే రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడాడు.

కొసమెరుపు: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో మరో ఆర్యవీర్ కూడా ఆడుతున్నాడు. అతడు టీమ్ ఇండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద కొడకు. ఢిల్లీ అండర్ 19 జట్టు ఓపెనర్ అయిన ఆర్యవీర్ సెహ్వాగ్ ను సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ పోటీపడి మరీ రూ.8 లక్షలకు కొనుక్కుంది. సెహ్వాగ్ చిన్న కొడుకు 14 ఏళ్ల వేదాంత్ ను ఏ జట్టూ కొనుక్కోలేదు.