Begin typing your search above and press return to search.

టెస్ట్ రిటైర్ ఎందుకయ్యావంటే.. కోహ్లీ స్పందన ఇదీ

తన ఎనిమిదేళ్ల కూతురు హినాయ స్వయంగా కోహ్లీని తన రిటైర్మెంట్ గురించి ప్రశ్నించిందని, దానికి కోహ్లీ ఇచ్చిన సమాధానం అందరినీ కదిలించిందని ఆయన తెలిపారు.

By:  Tupaki Desk   |   30 May 2025 12:00 AM IST
టెస్ట్ రిటైర్ ఎందుకయ్యావంటే.. కోహ్లీ స్పందన ఇదీ
X

టీమ్ ఇండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నిర్ణయంపై అనేక మంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా, భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన ఎనిమిదేళ్ల కూతురు హినాయ స్వయంగా కోహ్లీని తన రిటైర్మెంట్ గురించి ప్రశ్నించిందని, దానికి కోహ్లీ ఇచ్చిన సమాధానం అందరినీ కదిలించిందని ఆయన తెలిపారు.

-"దిస్ ఈజ్ హినాయ... వై డిడ్ యు రిటైర్?"

హర్భజన్ సింగ్ చెప్పిన వివరాల ప్రకారం.., కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటన చూసిన హినాయ తీవ్ర నిరాశకు గురైంది. దీంతో ఆమె తన సెల్‌ఫోన్ ద్వారా కోహ్లీకి మెసేజ్ పంపి, "దిస్ ఈజ్ హినాయ... విరాట్, వై డిడ్ యు రిటైర్?" అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు కోహ్లీ ఎంతో మృదువుగా, "బేటా, ఇట్స్ టైం..." అని రిప్లై ఇచ్చాడు. ఈ చిన్న సందేశంలోనే కోహ్లీ తన నిర్ణయాన్ని ఎంత పరిణతితో తీసుకున్నాడో స్పష్టమవుతోంది. దీనిపై హర్భజన్ స్పందిస్తూ "కోహ్లీకి ఏది ఉత్తమమో ఆయనకు బాగా తెలుసు" అని అన్నారు.

-శుభ్‌మన్‌ గిల్ పై నమ్మకం

కోహ్లీ, రోహిత్ శర్మల రిటైర్మెంట్ తర్వాత భారత టెస్ట్ జట్టు సారథ్య బాధ్యతలను యువ క్రికెటర్ శుభ్‌మన్‌ గిల్కి అప్పగించడాన్ని హర్భజన్ సరైన నిర్ణయంగా అభివర్ణించారు. "గిల్ లాంటి యువకుడికి ఇది గొప్ప అవకాశం. ఇంగ్లండ్ పర్యటన సవాళ్లతో నిండినదే అయినా, గిల్ నాయకత్వంలో రిషభ్ పంత్ , ఇతర యువ ఆటగాళ్లు బాగా ఆడతారని నమ్మకం ఉంది" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అలాగే సిరీస్ ప్రారంభమయ్యే ముందుగానే నిర్ణయాలకు రావడం అర్థం లేదని, ఓడిపోయినా దానిని ఒక అభ్యాసంగా తీసుకోవాలని హర్భజన్ సూచించారు. "ఈ సిరీస్ యువ జట్టుకు నేర్చుకునే గొప్ప అవకాశం" అని ఆయన తెలిపారు.

విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ వార్త ఒక యుగాంతం లాంటిది. కానీ యువ క్రికెటర్లకు ఇది ఒక నూతన అధ్యాయం. హినాయ లాంటి చిన్నారుల ప్రశ్నలు ఈ నిర్ణయం వెనకున్న భావోద్వేగాలను ప్రతిబింబిస్తున్నాయి. కోహ్లీ ఆటగాడిగా రంగం విడిచినా, ఆయన ప్రభావం తరతరాల క్రికెటర్లపై కొనసాగుతూనే ఉంటుంది. ఈ నిర్ణయం భారత క్రికెట్‌లో ఒక కొత్త శకానికి నాంది పలకనుంది.