రహస్యం చెప్పేశానని కోహ్లికి కోపం.. నాతో మాట్లాడలేదు..: డివిలియర్స్
డివిలియర్స్ ఆర్సీబీకి ఆడిన కాలంలో టీమ్ ఇండియా స్టార్ విరాట్ కోహ్లితో అతడికి మంచి స్నేహం ఏర్పడింది.
By: Tupaki Desk | 17 Jun 2025 12:00 AM ISTదక్షిణాఫ్రికాకు చెందిన 360 డిగ్రీల బ్యాట్స్ మన్ డివిలియర్స్ గురించి భారతీయులకు కొత్తగా చెప్పాల్సినదేమీ ఉండదు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 2011 నుంచి 11 సీజన్ల పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కు ఆడాడు ఏబీ. దీనికిముందు 2008 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. అతడు ఆడిన రోజుల్లో ఆర్సీబీ కప్ కొడుతుందని చాలామంది భావించారు. కానీ, 2011, 2016లలో ఫైనల్ కు వచ్చి మరీ పరాజయం పాలైంది. ఇక డివిలియర్స్ 2021లో ఐపీఎల్ నుంచి కూడా తప్పుకొన్నాడు.
డివిలియర్స్ ఆర్సీబీకి ఆడిన కాలంలో టీమ్ ఇండియా స్టార్ విరాట్ కోహ్లితో అతడికి మంచి స్నేహం ఏర్పడింది. ఏబీ రిటైర్ అయినాక కూడా అది కొనసాగుతోంది. చాలా ఇంటర్వ్యూల్లోనూ కోహ్లి తనకు ఏబీతో ఉన్న స్నేహం గురించి చెప్పాడు. డివిలియర్స్ కూడా తనకు ఉన్న మంచి ఫ్రెండ్ కోహ్లి అని స్పష్టం చేశాడు.
అయితే వీరిద్దరి మధ్య కొన్నాళ్లు మాటల్లేని సంగతి ప్రస్తుతం బయటపడింది. దేశాలు వేరైనా.. తమ నేపథ్యాలు వేరైనా.. ఎంతో అన్యోన్యంగా ఉండే ఏబీడీ-కోహ్లి మధ్య ఏం జరిగింది..? అంటే.. గత ఏడాది ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఆ సమయంలో కోహ్లి అనూహ్యంగా టెస్టు సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. అది ఐదు టెస్టుల సిరీస్. పైగా స్వదేశంలో.. అంతకుమించి కోహ్లి ఇష్టపడే ఫార్మాట్. హైదరాబాద్, విశాఖపట్నంలో కూడా మ్యాచ్ లు జరిగిన ఈ సిరీస్ లో కోహ్లి అసలు పాల్గొనలేదు. తొలి మ్యాచ్ హైదరాబాద్ లో జరగ్గా.. కోహ్లి వ్యక్తిగత కారణాలతో తప్పుకొన్నట్లు కథనాలు వచ్చాయి. రెండో మ్యాచ్ నుంచి ఆడతాడని భావిస్తే అదీ జరగలేదు. దీంతో ఏం జరిగిందా? అని అభిమానులు తెగ ఆందోళన చెందారు. అప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మతో విభేదాలు ఉన్నట్లు కథనాలు రావడం అనుమానాలను బలపరిచింది.
అయితే, కోహ్లి ఇంగ్లండ్ తో సిరీస్ కు దూరం కావడం వెనుక కారణం కాస్త ఆలస్యం బయటకు వచ్చింది. అతడి భార్య అనుష్కశర్మ రెండో బిడ్డకు జన్మనిస్తున్న నేపథ్యంలోనే కోహ్లి మొత్తం సిరీస్ కు దూరమైనట్లు స్పష్టమైంది. కానీ, అనుష్క రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతిని.. అందుకే కోహ్లి జట్టుకు దూరమైన విషయాన్ని ముందుగా ఏబీ డివిలియర్స్ బయటపెట్టాడు. ఆ తర్వాత డివిలియర్స్ మాట మార్చినా... చివరకు అతడు చెప్పిందే నిజమైంది. కోహ్లి-అనుష్క జంటకు రెండో బిడ్డ (కుమారుడు అకాయ్) పుట్టాడు.
అయితే, తన వ్యక్తిగత విషయాన్ని, రహస్యంగా ఉంచాల్సిన సమయంలో డివిలియర్స్ బటయపెట్టడం కోహ్లికి ఆగ్రహం తెప్పించిందట. దీంతో అతడు ఏబీడీతో కొంతకాలం మాట్లాడలేదట. ఈ విషయాన్ని డివిలియర్స్ స్వయంగా తెలిపాడు. కాగా, కొన్ని రోజుల తర్వాత విరాట్ ఆగ్రహం చల్లారిందని, మునుపటిలా తనతో స్నేహం కొనసాగించాడని డివిలియర్స్ వివరించాడు. ఇక ఇటీవల ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కు ఏబీడీ కూడా వచ్చాడు. కప్ గెలిచాక మైదానంలోకి వచ్చి కోహ్లితో సంతోషాన్ని పంచుకున్నాడు. అలా.. వీరిద్దరి మధ్య వచ్చిన విభేదం టీ కప్పులో తుఫానులా సమసిపోయింది.
