అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ఇచ్చిన కాటేరమ్మ కొడుకు.. ఇక లీగ్ లే
దక్షిణాఫ్రికాకు చెందిన, హార్డ్ హిట్టర్ గా పేరుతెచ్చుకున్న హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగాడు.
By: Tupaki Desk | 2 Jun 2025 4:03 PM ISTఅంతర్జాతీయ క్రికెట్ లో ప్రస్తుతం రిటైర్మెంట్ ల టైమ్ నడుస్తోంది. ఇటీవల టీమ్ ఇండియా సూపర్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టులకు అనూహ్యంగా వీడ్కోలు పలికి అభిమానులను ఆశ్చర్యపరిచారు. తాజాగా ఒకే రోజు మరో ఇద్దరు అంతర్జాతీయ స్టార్లు రిటైర్ అయ్యారు. వీరిద్దరూ భారతీయులకు బాగా దగ్గరైన వారు కావడం గమనార్హం.
వన్డే క్రికెట్ లో డబుల్ సెంచరీ కొట్టిన ఏకైక ఆస్ట్రేలియన్, భారత అల్లుడు అయిన గ్లెన్ మ్యాక్స్ వెల్ ఈ ఉదయం వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చాడు. ఆ వార్త చదువుతుండగానే.. మరో మేటి బ్యాట్స్ మన్ బైబై చెప్పేశాడు. దక్షిణాఫ్రికాకు చెందిన, హార్డ్ హిట్టర్ గా పేరుతెచ్చుకున్న హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగాడు.
వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అయిన 34 ఏళ్ల క్లాసెన్ ను తెలుగువారు కూకట్ పల్లి క్లాసెన్ గా ముద్దుగా పిలుచుకుంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున విధ్వంసక ఇన్నింగ్స్ లతో ’కాటేరమ్మ కొడుకులు’లో ఒకడిగానూ క్లాసెన్ పేరుగాంచాడు.
నాలుగు టెస్టులు, 60 వన్డేలు, 58 టి20ల్లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించిన క్లాసెన్ అవలీలగా భారీ సిక్సర్లు కొట్టడంలో సిద్ధహస్తుడు. టెస్టుల్లో 104, వన్డేల్లో 2,141, టి20ల్లో వెయ్యి పరుగులు చేసిన క్లాసెన్ .. గత ఏడాది టి20 ప్రపంచ కప్ ఫైనల్లో విధ్వంసక ఇన్నింగ్స్ తో భారత్ ను ఓడించినంత పనిచేశాడు.
కాటేరమ్మ కొడుకు..
2018లో రాజస్థాన్ రాయల్స్, 2019లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన క్లాసెన్.. ఆ తర్వాత మూడేళ్లు లీగ్ లో కనిపించలేదు. 2023 నుంచి సన్ రైజర్స్ కు ఆడుతూ దుమ్మురేపుతున్నాడు. 2023, 2024 సీజన్లలో 51 సిక్సులు కొట్టడం విశేషం. దీంతో ప్రస్తుత సీజన్ కు అతడిని రూ.23 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఈసారి కూడా క్లాసెన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో 39 బంతుల్లో 105 పరుగులు చేశాడు. నిరుడు లీగ్ లో సన్ రైజర్స్ భారీ స్కోర్లలో క్లాసెన్ ది కీలక పాత్ర. అందుకే ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మతో పాటు ఇతడిని కాటేరమ్మ కొడుకులు, ’కూకట్ పల్లి క్లాసెన్’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునేవారు.
ఇక లీగ్ లకే పరిమితం..
క్లాసెన్ కు ఇంకా 34 ఏళ్లే. మరో రెండు మూడేళ్లు ఆడగల సత్తా ఉన్నవాడు. కానీ, అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఇక లీగ్ లలో మాత్రమే ఆడతనని ప్రకటించాడు. అంటే సన్ రైజర్స్ తో పాటు సౌత్ ఆఫ్రికా టి20. మేజర్ లీగ్ క్రికెట్ లలో క్లాసెన్ ను చూడొచ్చు. వయసు, ఫామ్ ఉన్నప్పటికీ క్లాసెన్ రిటైర్మెంట్ ఎందుకు..? అంటే.. బహుశా దక్షిణాఫ్రికా బోర్డుతో ఏమైనా ఇబ్బంది ఉందేమో?
