Begin typing your search above and press return to search.

‘చాంపియన్‌’ అయ్యర్‌ను వద్దని..సాదా అయ్యర్‌ను అట్టిపెట్టుకుని..బోల్తాకొట్టిన జట్టు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో టైటిల్‌ కొట్టడం అంటే మామూలు మాటలు కాదు.

By:  Tupaki Desk   |   3 Jun 2025 5:00 AM IST
‘చాంపియన్‌’ అయ్యర్‌ను వద్దని..సాదా అయ్యర్‌ను అట్టిపెట్టుకుని..బోల్తాకొట్టిన జట్టు
X

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో టైటిల్‌ కొట్టడం అంటే మామూలు మాటలు కాదు. 17 ఏళ్లుగా విశ్వప్రయత్నం చేస్తున్నా.. మూడుసార్లు ఫైనల్లో బోల్తాకొట్టిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును అడిగితే చాంపియన్‌ కావడం ఎంత కష్టమో చెబుతుంది. అలాంటిది ఆ జట్టుకు పదేళ్ల తర్వాత టైటిల్‌ అందించాడు ఓ కెప్టెన్‌. జట్టును సమర్థంగా నడపడమే కాక..తాను స్వయంగా రాణించి విజయాలకు బాటలు వేశాడు. కానీ, ఎక్కడ తేడా వచ్చిందో కానీ.. చాంపియన్‌ కెప్టెన్‌ను వదులుకుంది ఆ ఫ్రాంచైజీ. దీనికి కారణాలు ఉన్నాయని సమర్థించుకున్నా.. ఇదే సమయంలో ఓ సాదాసీదా ఆటగాడిని అత్యధిక ధరకు అట్టిపెట్టుకుంది. తీరా చివరకు చూస్తే జట్టు ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేదు. వదులుకున్న కెప్టెన్‌ ఏమో.. తనను కొనుక్కున్న జట్టుకు చరిత్రలో తొలిసారి టైటిల్‌ అందించేలా కనిపిస్తున్నాడు.

టీమ్‌ ఇండియాకే కెప్టెన్‌ కావాల్సినవాడు శ్రేయస్‌ అయ్యర్‌. బాటమ్‌ హ్యాండ్‌ బ్యాటింగ్‌తో బంతిని బలంగా కొట్టే శ్రేయస్‌.. టైమ్‌ బాగోలేక, గాయాల కారణంగా కెరీర్‌లో కాస్త వెనుకబడ్డాడు. గత ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో శ్రేయస్‌ తన జట్టు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపాడు. 2014 తర్వాత కోల్‌ కతా టైటిల్‌ కొట్టింది నిరుడే. అయితే, ఈ సీజన్‌కు సంబంధించి గత ఏడాది నవంబరులో జరిగిన మెగా వేలంలో శ్రేయస్‌ను కోల్‌కతా రిటైన్‌ చేసుకోలేదు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. శ్రేయస్‌ భారీ మొత్తం అడిగాడని.. అందుకని కోల్‌కతా అతడిని వదులుకుందనే ప్రచారం జరిగింది. ఇక్కడివరకు కోల్‌కతా చేసింది సరిగానే ఉంది. మరోవైపు శ్రేయస్‌ను పంజాబ్‌ కింగ్స్‌ రూ.26.75 కోట్లు పెట్టి కొనుక్కుంది. ఇది వేలంలో రెండో అత్యధిక ధర.

మెగా వేలంలో తమ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌ను రూ.23 కోట్లకు రిటైన్‌ చేసుకుంది కోల్‌కతా. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. వెంకటేశ్‌ అయ్యర్‌ మంచి ఆటగాడే అయినా.. అతడిపై రూ.10 కోట్లలోపు ధర పెడితేనే ఎక్కువ. అలాంటిది బహుశా అతడు కూడా ఊహించని ధరకు అట్టిపెట్టుకుంది కోల్‌కతా. తీరా చూస్తే వెంకటేశ్‌ అయ్యర్‌ ఈ సీజన్లో ఒక్కటే హాఫ్‌ సెంచరీ చేశాడు. అదీ ప్రారంభ మ్యాచ్‌లలోనే. వరుసగా విఫలం అవుతుండడంతో అతడిని గాయం సాకుగా పక్కనపెట్టాల్సి వచ్చింది. లీగ్‌ మధ్య నాటికే వెంకటేశ్‌ గురించి మాట్లాడుకోవడం మానేశారు.

శ్రేయస్‌ అయ్యర్‌ మాత్రం అటు కెప్టెన్‌, ఇటు బ్యాట్స్‌మన్‌ గా సీజన్‌ మొదటినుంచే దుమ్మురేపుతున్నాడు. 2014 తర్వాత పంజాబ్‌ కింగ్స్‌ను ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. ఏకంగా 603 పరుగులు చేశాడు. స్ట్రయిక్‌ రేట్‌ 175.80. అత్యధిక పరుగుల జాబితాలో ఆరోస్థానంలో ఉన్నాడు. స్ట్రయిక్‌ రేట్‌ మాత్రం ముందున్న ఐదుగురి కంటే ఎక్కువ.

అదేంటోకానీ.. కోల్‌కతా శ్రేయస్‌కే రూ.10 కోట్లు ఎక్కువ ఇచ్చి అట్టిపెట్టుకుంటే సరిపోయేది. మూడు సీజన్లుగా రూ.12.25 కోట్ల ధరకే ఆడుతున్న అతడికి మరో 10 కోట్లు ఇస్తే.. రూ.22.25 కోట్లు అయ్యేది.కానీ, అదేమీ వద్దనుకుంది. దీంతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేకపోయింది. అటు రూ.23 కోట్లు పెట్టిన వెంకటేశ్‌ అయ్యర్‌ పూర్తిగా తేలిపోయాడు. 2021లో రూ.20 లక్షల బేస్‌ ధరతో అతడిని కోల్‌కతా తీసుకుంది. ఆ తర్వాత నుంచి రూ.8 కోట్లు ఇచ్చింది. 2025కు మాత్రం రూ.23 కోట్లు పెట్టి గుంతలో పడింది.

కొసమెరుపుః పంజాబ్‌ కింగ్స్‌ చివరగా 2014లో ఐపీఎల్‌ ఫైనల్‌ చేరింది. అప్పుడు కోల్‌కతా చేతిలోనే ఓటమిపాలైంది.