ఒక మ్యాచ్.. వరుస ఓవర్లు.. 2 హ్యాట్రిక్ లు.. ఎవరా డెడ్లీ బౌలర్?
అరుదైన రికార్డుల్ని క్రియేట్ చేసేందుకు వయసు ఏ మాత్రం అడ్డురాదన్న విషయం తాజా ఉదంతంలో మరోసారి రుజువైందని చెప్పాలి.
By: Tupaki Desk | 11 July 2025 9:55 AM ISTఅవును.. అరుదైన రికార్డు నమోదైంది. క్రికెట్ క్రీడలో బౌలర్ సత్తాకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది హ్యాట్రిక్ వికెట్ల పతనం. ఒకే ఓవర్లో వరుస బంతుల్లో ముగ్గురిని ఔట్ చేయటమన్న సంగతి తెలిసిందే. ఈ ఫీట్ అంత ఈజీ కాదు. ప్రతి బౌలర్తమ కెరీర్ లో ఒక్క హ్యాట్రిక్ అయినా నమోదు చేయాలని తపిస్తారు. అలాంటిది ఒకే మ్యాచ్ లో వరుస ఓవర్లలో రెండు హ్యాట్రిక్ లను సాధించిన అద్భుతం తాజాగా నమోదైంది, ఈ అరుదైన రికార్డు క్రికెట్ క్రీడలో తొలిసారిగా నమోదైనట్లు చెబుతున్నారు, ఇంతకూ సదరు బౌలర్ వయసు ఎంతో తెలుసా? అక్షరాల 37 ఏళ్లు. అరుదైన రికార్డుల్ని క్రియేట్ చేసేందుకు వయసు ఏ మాత్రం అడ్డురాదన్న విషయం తాజా ఉదంతంలో మరోసారి రుజువైందని చెప్పాలి.
ఇంతకూ ఈ అద్భుతమైన రికార్డును సాధించిన బౌలర్ ఎవరు? ఏ మ్యాచ్ లో ఇదంతా జరిగింది? అన్న వివరాల్లోకి వెళితే.. వరుస ఓవర్లలో రెండు హ్యాట్రిక్ లు సాధించిన అద్భుత బౌలర్ పేరు కిశోర్ కుమార్ సాధక్. ఇంగ్లండ్ కు చెందిన అతను.. సఫోల్క్ కౌంటికి చెందిన స్పిన్నర్. యూకేలోని టూ కౌంటీస్ చాంఫియన్ షిప్ లో భాగంగా కెస్ గ్రేవ్ తో జరిగిన డివిజన్ మ్యాచ్ లో ఈ అరుదైన రికార్డు నమోదైంది.
ఇప్స్విచ్ అండ్ కోల్బెస్టర్ క్రికెట్ క్లబ్ తరఫున బరిలోకి దిగిన సాధక్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వరుస రెండు ఓవర్లలో రెండు హ్యాట్రిక్ ను సాధించాడు.మొత్తం ఈ మ్యాచ్ లో 20 పరుగులు ఇచ్చిన అతను ఏకంగా ఆరు వికెట్లు తీయగా.. అందులో రెండూ.. హ్యాట్రిక్ లు కావటం గమనార్హం. దీంతో అతడి సంబరానికి అంతు లేకుండా పోయింది. తాను గాల్లో తేలిపోతున్నట్లుగా అతను వ్యాఖ్యానించారు. మొత్తం ఆరు ఓవర్లు వేసిన సాధక్ ఐదుగురిని క్లీన్ బౌల్డ్ చేయటం ఒక ఎత్తు అయితే.. ఐదుగురు బ్యాటర్లు డకౌట్ కావటం గమనార్హం.
ఈ తరహాలో ఒకే మ్యాచ్ లో రెండు హ్యాట్రిక్ లు సాధించినోళ్లు లేకపోలేదు. కాకుంటే.. వరుస ఓవర్లలో కాకపోవటం.. ఒకే ఇన్నింగ్స్ లో కాకపోవటం గమనార్హం. 2017లో న్యూ సౌత వేల్స్ తో జరిగిన మ్యాచ్ లో వెస్ట్రర్న్ ఆస్టేలియా తరఫున బరిలోకి దిగిన స్టార్క్ ఒకే మ్యాచ్ లో రెండుసార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసుకున్నప్పటికి.. వేర్వేరు ఇన్నింగ్స్ లో కావటం గమనార్హం. అంతేకాదు.. 113 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన జిమ్మీ మాథ్యూస్ అనే బౌలర్ కూడా ఒకే మ్యాచ్ లో రెండు హ్యాట్రిక్ లు సాధించారు. కాకుంటే.. రెండు ఇన్నింగ్స్ లో. ఏమైనా ఒక అరుదైన రికార్డు క్రియేట్ అయ్యిందని చెప్పాలి. దీన్ని మరెప్పటికి బ్రేక్ చేస్తారో చూడాలి.
