ఫాస్టెస్ట్ సెంచరీ.. మామూలు కొట్టుడు కాదు.. 'రికార్డు బాదుడు'
ప్రపంచ కప్ మరెక్కడ జరిగినా పెద్ద విశేషం కాదు.. కానీ, భారత్ లో జరుగుతుంది అంటేనే సంచలనం.. సహజంగానే బ్యాట్స్ మన్ అనుకూల పిచ్ లు
By: Tupaki Desk | 4 Oct 2023 9:29 AM GMTప్రపంచ కప్ మరెక్కడ జరిగినా పెద్ద విశేషం కాదు.. కానీ, భారత్ లో జరుగుతుంది అంటేనే సంచలనం.. సహజంగానే బ్యాట్స్ మన్ అనుకూల పిచ్ లు. అందులోనూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడిను అనుభవం.. ఇంకేముంది.. విధ్వంసక బ్యాట్స్ మెన్లు చెలరేగిపోవడానికి అవకాశం ఇచ్చినట్లే. అందుకే ఈసారి రికార్డులు బద్దలవుతాయా? అనే ప్రశ్నలు వస్తున్నాయి..
వాళ్లు కొట్టారు.. మరి వీరు..?
వన్డే ప్రపంచ కప్ లో గతంలో రికార్డులు చాన్నాళ్లపాటు నిలిచేవి. ఇప్పుడు టి20 ప్రభావంతో.. అదే తరహాలో వన్డేల్లోనూ ఆడుతుండడంతో వెంటవెంటనే రికార్డులు చెరిగిపోతున్నాయి. కాగా, వన్డే క్రికెట్ లో ముందుగా చెప్పుకోవాల్సింది తక్కువ బంతుల్లో సెంచరీల గురించే. ఈ రికార్డు సాధించినవారిలో ఒక్కరు మినహా మిగతా అందరూ పోటీ క్రికెట్ నుంచి వైదొలగారు.
బాబోయ్ ఓబ్రయన్..
వన్డే ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగవంతంగా సెంచరీ చేసినది ఐర్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ ఓబ్రయన్. అదికూడా భారత్ లోనే కావడం గమనార్హం. 2011 కప్‌లో ఓబ్రయన్ తమ పొరుగు దేశం ఇంగ్లండ్‌పై చెలరేగాడు. 50 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అదికూడా 6వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి చేయడం విశేషం. మ్యాచ్ లో 63 బంతులు ఎదుర్కొన్న కెవిన్ 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 113 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌పై 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. అతడి ఇన్నింగ్స్ నాటి ప్రపంచకప్ కే హైలైట్ అనడంలో సందేహం లేదు.
భారత అల్లుడు బాదేశాడు
భారత అల్లుడు, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ పేరిట ప్రపంచ కప్ లో రెండో అతి తక్కువ బంతుల్లో సెంచరీ రికార్డుంది. శ్రీలంకతో సొంతగడ్డపై 2015 కప్‌లో 51 బంతుల్లోనే మాక్సీ సెంచరీ బాదాడు. మొత్తం 53 బంతులు ఎదుర్కొన్న మాక్సీ 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 102 పరుగులు చేశాడు.
ఎదురులేని ఏబీడీ
దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్ విధ్వంసం గురించి క్రికెట్ అభిమానులకు పరిచయం చేయాల్సిన పని లేదు. ఇలాంటి విన్యాసంతోనే అతడు 2015 కప్‌లో వెస్టిండీస్ పై 52 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మ్యాచ్ లో 66 బంతులు ఆడి.. 17 ఫోర్లు, 8 సిక్స్‌లతో 162 పరుగులు చేయడం విశేషం.
మోర్గాన్.. హెడెన్..
క్రికెట్ పుట్టిల్లుగా చెప్పకొనే ఇంగ్లండ్ కు 2019లో ప్రపంచ కప్ కల నెరవేర్చాడు ఇయాన్ మోర్గాన్. అదే కప్ లో మోర్గాన్ 57 బంతుల్లో సెంచరీ బాదాడు. అఫ్ఘానిస్థాన్ పై ఈ ఘనత సాధించాడు. 71 బంతులు ఆడిన మోర్గాన్ 4 ఫోర్లు, 17 సిక్స్‌లతో 148 పరుగులు చేశాడు. ఇక చివరగా.. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మాథ్యూ హేడన్ 2007 వన్డే ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాపై 66 బంతుల్లో శతకం సాధించాడు. 68 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు.
కొసమెరుపు : ప్రపంచ కప్ లో తక్కువ బంతుల్లో సెంచరీ కొట్టిన బ్యాట్స్ మన్ లో మ్యాక్స్ వెల్ ఒక్కడే ఇప్పటికీ క్రికెట్ ఆడుతున్నాడు. మిగతావారంతా రిటైర్ అయ్యారు. ఇక మోర్గాన్, హేడెన్, డివిలియర్స్, ఓబ్రయన్ రిటైర్ అయ్యారు. మరి.. ఈసారి కప్ లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టేదెవరో?