Begin typing your search above and press return to search.

ఐపీఎల్ వల్లే నా కెరీర్ నాశనమైంది.. కెవిన్ పీటర్సన్ సంచలన కామెంట్స్

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఐపీఎల్‌పై తన ఆసక్తి కారణంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో తలెత్తిన విభేదాలే తన కెరీర్‌ను ముందుగానే ముగించాయని ఆవేదన వ్యక్తం చేశారు.

By:  A.N.Kumar   |   7 April 2026 6:00 PM IST
ఐపీఎల్ వల్లే నా కెరీర్ నాశనమైంది.. కెవిన్ పీటర్సన్ సంచలన కామెంట్స్
X

ఐపీఎల్ కారణంగానే తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ దెబ్బతిందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఐపీఎల్‌పై తన ఆసక్తి కారణంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో తలెత్తిన విభేదాలే తన కెరీర్‌ను ముందుగానే ముగించాయని ఆవేదన వ్యక్తం చేశారు.

2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన సమయంలోనే ఈసీబీ తమ కాంట్రాక్ట్ ప్లేయర్లను ఐపీఎల్‌లో పాల్గొననివ్వలేదని పీటర్సన్ గుర్తుచేశారు. ఆ తర్వాత కూడా 2009లో కొన్ని కఠినమైన షరతులు విధించారని తెలిపారు. అయితే ఆ పరిస్థితుల్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడేందుకు తాను తీసుకున్న నిర్ణయం తన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పారు. అదే నిర్ణయం తన అంతర్జాతీయ ప్రయాణాన్ని కుదించింది అని ఆయన స్పష్టం చేశారు.

తాను కనీసం 150 నుంచి 160 టెస్టు మ్యాచ్‌లు ఆడే సామర్థ్యం ఉన్న ఆటగాడినని, కానీ వివాదాలు, ఒత్తిళ్లు, బోర్డు చర్యల కారణంగా కేవలం 104 టెస్టులతోనే ఆగిపోవాల్సి వచ్చిందని పీటర్సన్ బాధ వ్యక్తం చేశారు. తన కెరీర్ 33 ఏళ్లకే ముగిసిపోవడం వెనుక ప్రధాన కారణం ఐపీఎల్‌తో అనుబంధం.. ఈసీబీతో ఏర్పడిన విభేదాలేనని ఆయన పేర్కొన్నారు.

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మాత్రమే కాకుండా మీడియా కూడా తనపై లక్ష్యంగా దాడులు జరిపిందని పీటర్సన్ ఆరోపించారు. ముఖ్యంగా ‘ది టెలిగ్రాఫ్’ వంటి పత్రికల ద్వారా తనపై విచ్ హంట్ నడిపించారని అన్నారు. ఆ సమయంలో తాను ఎన్నో మానసిక ఒత్తిడులను ఎదుర్కొన్నానని తెలిపారు.

అయితే తాను చేసిన త్యాగాల వల్లే నేటి తరం ఇంగ్లండ్ క్రికెటర్లు ఐపీఎల్‌లో స్వేచ్ఛగా పాల్గొంటూ భారీ ఆదాయం సంపాదిస్తున్నారని పీటర్సన్ గుర్తుచేశారు. తన పోరాటం వల్లే ఇప్పుడు పరిస్థితులు మారాయని.. ప్రస్తుత ఆటగాళ్లు అందుకు లాభపడుతున్నారని పేర్కొన్నారు. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ కూడా ఇదే విషయాన్ని తనతో చెప్పినట్టు ఆయన వెల్లడించారు.

తన టెస్టు కెరీర్‌లో పీటర్సన్ 104 మ్యాచ్‌లు ఆడి 8,181 పరుగులు చేశారు. ఇందులో 23 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. తనకు ఇంకా ఎక్కువ అవకాశాలు లభించి ఉంటే 12,000 పరుగుల మార్క్‌ను కూడా అందుకునేవాడినని ఆయన భావించారు.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఐపీఎల్ ప్రభావం, బోర్డుల విధానాలపై మరోసారి చర్చకు దారితీశాయి. ఒక ఆటగాడి కెరీర్‌పై లీగ్ క్రికెట్ ఎంతటి ప్రభావం చూపగలదో పీటర్సన్ ఉదాహరణగా నిలుస్తున్నారు.