ఐపీఎల్-18.. వచ్చాడు.. మహా దంచుడు దంచాడు.. ఇక టీమ్ ఇండియాలోకే
90 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీలు సాధించినది ఇద్దరే ఇద్దరు.
By: Tupaki Desk | 14 April 2025 9:51 AM IST90 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీలు సాధించినది ఇద్దరే ఇద్దరు. ఒకరు మెరుపు వీరుడు వీరేంద్ర సెహ్వాగ్. సహజంగా మిడిలార్డర్ బ్యాట్స్ మన్ అయినప్పటికీ ఓపెనింగ్ కు పంపడంతో సెహ్వాగ్ రాత మారిపోయింది. పాకిస్థాన్ లో పాకిస్థాన్ పై, భారత్ లో ఇంగ్లండ్ పై ట్రిపుల్ సెంచరీలు కొట్టి భారత క్రికెట్ లో మొనగాడుగా నిలిచాడు.
అయితే, మిడిలార్డర్ లో దిగి ట్రిపుల్ సెంచరీ కొట్టిన మరో క్రికెటర్ కూడా ఉన్నాడు. అయితే, అతడి కెరీర్ ఏమంత గొప్పగా సాగలేదు. ట్రిపుల్ తర్వాత వైఫల్యాలు ఎదురవడంతో టీమ్ ఇండియా తలుపులు మూసుకున్నాయి. ఆరు టెస్టులు ఆడిన అతడు 374 పరుగులు చేస్తే అందులో 303 పరుగులు ట్రిపుల్ సెంచరీ చేసినప్పటివే. ఇదంతా కర్ణాటక బ్యాట్స్ మన్ కరుణ్ నాయర్ గురించి.
2016 నవంబరులో మొదలైన అతడి అంతర్జాతీయ కెరీర్ 2017తో ముగిసింది. 2016లోనే ఇండియాకు రెండు వన్డేలు ఆడాడు. ఇక టెస్టులకు దూరమైన సమయానికి అతడికి 25 ఏళ్లే. మళ్లీ దేశానికి ఆడలేదు. ఇక కెరీర్ కనుమరుగు అయిపోయింది అనుకుంటుండగా.. 2024-25 దేశవాళీ సీజన్ లో కరుణ్ తన సత్తా ఏమిటో చూపాడు. సొంత రాష్ట్రం కర్ణాటకను వదలి విదర్భకు ఆడడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. సెంచరీల మీద సెంచరీలు కొట్టాడు.
రంజీల్లో ఏకంగా 9 సెంచరీలు, విజయ్ హజారే ట్రోఫీలో ఐదు సెంచరీలు బాదాడు. ఇంత ఆడినా టీమ్ ఇండియాలోకి అతడిని తీసుకోలేదు. చాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపిక చేయలేదు. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. విసిగిపోయాడో ఏమో.. ’’మిస్టర్ క్రికెట్ నాకో చాన్స్ ఇవ్వు’’ అంటూ ట్వీట్ చేశాడు.
ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఐపీఎల్ 18లో ఢిల్లీ క్యాపిటల్స్ కరుణ్ ను తీసుకుంది. అయితే, అతడి రేటెంతో తెలుసా? కేవలం రూ.50 లక్షలు. మరోవైపు సీజన్ లో నాలుగు మ్యాచ్ లు ముగిసినా కరుణ్ కు మాత్రం ఢిల్లీ అవకాశం ఇవ్వలేదు. ఆదివారం ముంబైతో మ్యాచ్ లో మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలో దింపింది.
ఎన్నాళ్లుగానో కసి పెంచుకున్నాడో ఏమో..? ఐపీఎల్ 18లో బరిలో దిగుతూనే కరుణ్ కుమ్మేశాడు. మేటి పేసర్ బుమ్రాను సైతం బాదేశాడు. అతడి ఓవర్ లో 22 పరుగులు కొట్టాడు. ఇక 40 బంతుల్లే 5 సిక్స్ లు, 12 ఫోర్లతో 89 పరుగులు చేశాడు. సెంచరీ ఖాయం.. ఢిల్లీని గెలిపించడం ఖాయం అనుకుంటుండగా శాంట్నర్ వేసిన అద్భుత బంతికి ఔటయ్యాడు.
ఈ మ్యాచ్ లో కరుణ్ సూపర్ బ్యాటింగ్ ను చూశాక అందరూ అన్న మాట ఒక్కటే. ఇంత అద్భుతంగా, అలవకోగా ఆడుతున్న అతడిని టీమ్ ఇండియాకు ఎంపిక చేయాలని. కామెంటేటర్లు కూడా ఇదే మాట అన్నారు. వచ్చే ఇంగ్లండ్ టూర్ కు కరుణ్ ను తీసుకెళ్లాలని.