Begin typing your search above and press return to search.

ప్రముఖ క్రికెటర్‌ నన్ను రిటైరవమన్నాడు..కరుణ్‌ నాయర్‌ సంచలన వ్యాఖ్యలు

మరొక్క నాలుగు రోజుల్లో ప్రతిష్ఠాత్మక ఙంగ్లండ్‌ పర్యటనలో తొలి టెస్టు ప్రారంభం కాఆనుండగా.. టీమ్‌ ఇండియా బ్యాట్స్‌మన్‌ కరుణ్‌ నాయర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

By:  Tupaki Desk   |   17 Jun 2025 6:00 AM IST
ప్రముఖ క్రికెటర్‌ నన్ను రిటైరవమన్నాడు..కరుణ్‌ నాయర్‌ సంచలన వ్యాఖ్యలు
X

మరొక్క నాలుగు రోజుల్లో ప్రతిష్ఠాత్మక ఙంగ్లండ్‌ పర్యటనలో తొలి టెస్టు ప్రారంభం కాఆనుండగా.. టీమ్‌ ఇండియా బ్యాట్స్‌మన్‌ కరుణ్‌ నాయర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎంతో గొప్పగా ఆడి జాతీయ జట్టులోకి పునరాగమనం చేసిన అతడు... అవసరమైతే ఓపెనర్‌గా, లేదంటే మిడిలార్డర్‌ బా‍్యట్స్‌మన్‌గా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లి స్థానాలను భర్తీ చేసేవాడిగా కనిపిస్తున్నాడు. కరుణ్‌... శుక్రవారం నుంచి మొదలయ్యే తొలి టెస్టులో తుది జట్టులో ఉండడం ఖాయం. అలాంటి సమయంలో తనకు రెండేళ్ల కిందట ఎదురైన అనుభవాన్ని అతడు బయటపెట్టాడు.

భారత్‌ తరఫున టెస్టుల్లో ట్రిపుల్‌ సెంచరీ చేసిన ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లలో ఒకడైన కరుణ... 2017 మార్చిలో చివరగా టెస్టు మ్యాచ్‌ ఆడాడు. అంటే.. 8 ఏళ్ల కిందట అన్నమాట. మళ్లీ ఇన్నాళ్లకు జట్టులోకి వచ్చాడు. దీనికోసం అతడు ఎంతో కష్టపడ్డాడు. ఓ దశలో ‘‘మిస్టర్‌ క్రికెట్‌.. నాకో చాన్స్‌ ఇవ్వు’’ అని కూడా ప్రాథేయపడ్డాడు. మూడేళ్లగా దేశవాళీల్లో నిలకడగా ఆడుతున్నా అవకాశాలు రాకపోవడంతో విసుగు చెందాడు. అయితే, కష్టానికి ఎప్పుడూ ప్రతిఫలం ఉంటుందని నిరూపిస్తూ టీమ్‌ ఇండియా సెలక్టర్లు అతడికి పిలుపునిచ్చారు. రోహిత్‌, కోహ్లి రిటైర్‌ కావడం కూడా 33 ఏళ్ల కరుణ్‌కు రాచబాట వేసింది.

కర్ణాటకకు చెందిన నాయర్‌ రంజీ ట్రోఫీలో విదర్భకు ఆడుతున్నడు. గత సీజన్‌లో నాలుగు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలతో 16 ఇన్నింగ్స్‌లలో 863 పరుగులు చేశాడు. దేశవాళీ వన్డే ఫార్మాట్‌ అయిన విజయ్‌ హజారే ట్రోఫీలో ఎనిమిది ఇన్నింగ్స్‌లో 779, దేశవాళీ టి20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో 6 ఇన్నింగ్స్‌ల్లో 255 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్‌లోనూ కరుణ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ తీసుకుంది. ఒకటీ రెండు మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు కూడా.

అయితే, రెండేళ్ల క్రితం మాత్రం తనకు చేదు అనుభవం ఎదురైందని కరుణ్‌ తాజాగా చెప్పాడు. ఓ ప్రముఖ క్రికెటర్‌ తనకు ఫోన్‌ చేసి అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ కావాలని సూచించాడని తెలిపాడు. ఫ్రాంఛైజీ క్రికెట్‌ ఆడుకోవాలని.. తద్వారా డబ‍్బు బాగా వస్తుందని సూచించినట్లు పేర్కొన్నాడు. అతడు చెప్పినట్లు చేయడం సులువే అయినా.. టీమ్‌ ఇండియాకు ఆడాలన్న తపనే తనను మళ్లీ పైకి లేచేలా చేసిందని నాయర్‌ తెలిపాడు.

కరుణ్‌ నాయర్‌ను ఇంగ‍్లండ్‌తో సిరీస్‌లో యశస్వి జైశ్వాల్‌కు తోడుగా ఓపెనర్‌గా పంపించే అవకాశం కూడా ఉంది. లేదంటే కోహ్లి స్థానం నాలుగో నంబరులో ఆడించే వీలుంది. మంచి ఫామ్‌లో ఉండడంతో పాటు ఇంగ్లండ్‌ లయన్స్‌ (ఇంగ్లండ్‌ ఎ జట్టు)తో తలపడిన ఇండియా ఎ అనధికారిక టెస్టులో కరుణ్‌ అద్భుత బ్యాటింగ్‌తో డబుల్‌ సెంచరీ చేశాడు. దీనికితోడు ఇంగ్లండ్‌ దేశవాళీలు కౌంటీ క్రికెట్‌లోనూ ఆడిన అనుభవం కరుణ్‌ సొంతం. 2023, 2024 కౌంటీ సీజన్లలో నార్తాంప్టన్‌షైర్‌కు ఆడిన కరుణ్‌.. 10 మ్యాచ్‌లలో 736 పరుగులు చేశాడు. ఓ డబుల్ సెంచరీ కూడా కొట్టాడు. టీమ్‌ ఇండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ మద్దతు దండిగా ఉన్న నాయర్‌.. మరో మూడేళ్లు జట్టుకు సేవలందిస్తే ఈ సంధి దశలో ఎంతో మేలు చేసినవాడు అవుతాడు.

ఇంతకూ కరుణ్‌ను రిటైర్‌కమ్మన్న ఆ క్రికెట్‌ ఎవరబ్బా...? అతడు టీమ్‌ ఇండియా సభ్యుడా? లేక మాజీ ఆటగాడా? కరుణ్‌ సొంత రాష్ట్రం కర్ణాటకకు చెందినవాడా? ఇది కరుణ్‌ చెబితేనే తెలిసే రహస్యం.