’డియర్ క్రికెట్’... ’ఒక్క చాన్స్’ అయిపోయింది.. ఆ బ్యాటర్ ఇక బెంచ్ కే
ఇంగ్లడ్ తో ఐదు టెస్టుల సిరీస్ కు ముందు సీనియర్లు రోహిత్ శర్మ, విరాటో కోహ్లి రిటైర్ కావడంతో కరుణ్ నాయర్ కు కలిసి వచ్చింది.
By: Tupaki Desk | 19 July 2025 2:00 AM ISTదేశవాళీ క్రికెట్ లో వేల పరుగులు.. జాతీయ జట్టులోకి ఎనిమిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. ప్రాక్టీస్ మ్యాచ్ లో ఏకంగా డబుల్ సెంచరీ.. కానీ, ఏం లాభం..? అసలు మ్యాచ్ కు వచ్చేసరికి వరుస ఫ్లాప్ లు.. జట్టు కష్టాల్లో ఉన్నా.. మెరుగైన స్థితిలో ఉన్నా.. శుభారంభాలు దక్కినా.. ఏవీ అతడి ఫేట్ ను మ్యాచ్ ను మార్చలేకపోతున్నాయి. ‘డియర్ క్రికెట్’ ఒక్క చాన్స్ ఇవ్వు అంటూ కొన్నేళ్ల కిందట వేడుకున్న అతడికి ఇప్పుడు ఆ ఒక్క చాన్స్ కూడా అయిపోయినట్లే అనిపిస్తోంది.
’టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాట్స్ మన్..’ వినడానికి ఈ ట్యాగ్ లైన్ ఎంత బావుందో..? కానీ, మిడిలార్డర్ బ్యాట్స్ మన్ కరుణ్ నాయర్ ఆ ట్రిపుల్ సెంచరీ తర్వాత మళ్లీ కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. అసలు 8 ఏళ్ల పాటు టీమ్ ఇండియాలోనే లేడు. ఎట్టకేలకు సెంచరీల మీద సెంచరీలు కొట్టి తిరిగి జాతీయ జట్టులోకి వచ్చినా విఫలమవుతున్నాడు.
ఇంగ్లడ్ తో ఐదు టెస్టుల సిరీస్ కు ముందు సీనియర్లు రోహిత్ శర్మ, విరాటో కోహ్లి రిటైర్ కావడంతో కరుణ్ నాయర్ కు కలిసి వచ్చింది. దేశవాళీల్లో మంచి అనుభవం ఉన్న అతడికి నేరుగా తుది జట్టులో చోటు దక్కింది. తొలి టెస్టులో యువ ఆటగాడు సాయి సుదర్శన్ వైఫల్యంతో పరిస్థితులు మరింత అనుకూలంగా మారాయి. కానీ, కరుణ్ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. తొలి టెస్టులో ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగి మొదటి ఇన్నింగ్స్ లో డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో 20 పరుగులు చేశాడు. తర్వాత సాయిని పక్కనపెట్టి కరుణ్ ను వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దింపారు. 22, 26, 40, 14.. ఇవీ గత నాలుగు ఇన్నింగ్స్ లో అతడి స్కోర్లు. రెండో టెస్టులో మిగతా బ్యాట్స్ మెన్ సెంచరీలు కొడుతుంటే, కరుణ్ మాత్రం విఫలమయ్యాడు. లార్డ్స్ లో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ ను మెరుగ్గానే ప్రారంభించి రూట్ అద్భుత క్యాచ్ కు ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో కనీస ఫుట్ వర్క్ లేకుండా వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు.
మెరుగైన టెక్నిక్ ఉన్న సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్ ను కాదని కరుణ్ కు అవకాశాలు ఇస్తున్నా అతడు నిరాశపరుస్తున్నాడు. మరోవైపు సాయి, అభిమన్యు ఓపెనర్లు కావడం, కరుణ్ మిడిలార్డర్ బ్యాటర్ కావడం కూడా కొంత ప్లస్ అవుతోంది. అయితే, ఇప్పుడు నాయర్ ను పక్కన పెట్టి సాయికి చాన్స్ ఇవ్వాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఓల్డ్ ట్రాఫోర్డ్ లో ఈ నెల 23 నుంచి జరిగే నాలుగో టెస్టులో టీమ్ మేనేజ్ మెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో...?
