Begin typing your search above and press return to search.

ఐపీఎల్ వర్సెస్ దేశం ఆ దిగ్గజం మళ్లీ కడిగి పారేశాడు

ఇలాంటి విమర్శకుల వరుసలోకే చేరాడు దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్.

By:  Tupaki Desk   |   31 July 2023 10:33 AM GMT
ఐపీఎల్ వర్సెస్ దేశం ఆ దిగ్గజం మళ్లీ కడిగి పారేశాడు
X

పరిమితికి మించిన ప్రయోగాలు చేస్తూ వెస్టిండీస్ తో రెండో వన్డే లో ఓడిపోయింది టీమిండియా. ఆటగాళ్లు అందరికీ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశమే దీనివెనుక కారణమని చెబుతున్నారు. కానీ, ఈ ప్రయోగాల పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి విమర్శకుల వరుసలోకే చేరాడు దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్.

అన్నీ ఆడాలా..? మరి గాయాలవవా??

వన్డేలు, టి20లు, టెస్టులు.. మధ్యలో ఐపీఎల్ ఇదీ టీమిండియా ఆటగాళ్ల షెడ్యూల్. అన్నింట్లోనూ ఆడాలన్న ఆలోచన కొందరిది. దీని వెనుక డబ్బు కూడా ఓ కారణమే అయి ఉండొచ్చు. కానీ, ఇంత రద్దీ షెడ్యూల్ తో గాయాలై జాతీయ జట్టుకు దూరం అవుతారని, దేశ ప్రయోజనాల కు దెబ్బ అని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. ఇలానే సీనియర్ల పై మరోసారి విరుచుకుపడ్డాడు కపిల్‌ దేవ్‌. ఆటగాళ్ల నిబద్ధతను ప్రశ్నించాడు.

ఇప్పటికే పలుసార్లు కపిల్ బౌన్సర్లు వేశాడు. భారత క్రికెటర్లు తమకే అన్నీ తెలుసనుకుంటారనీ.. ఎవరి సలహానూ అడగాల ని అనుకోరనీ ఇటీవల ధ్వజమెత్తాడు. కీలక ఆటగాళ్లు గాయాలబారిన పడుతుండటంతో ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో జట్టు ప్రదర్శన పై ప్రతికూల ప్రభావం పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్ల నిబద్ధతను కపిల్‌ ప్రశ్నించాడు. చిన్నపాటి గాయాలనూ లెక్కచేయకుండా ఐపీఎల్‌ లో ఆడటానికి వారు అభ్యంతరం చెప్పరనీ.. అయితే, జాతీయ జట్టుకు వచ్చేసరికి చిన్న సాకుల తో విశ్రాంతి తీసుకోవడానికే ఇష్టపడతారని కపిల్‌ అభిప్రాయపడ్డాడు.

బుమ్రా ఎలా గాయపడ్డాడు...?

గాయం కారణంగా టీమిండియా కీలక పేసర్ బుమ్రా జట్టుకు దూరమై ఏడాది అవుతోంది. వన్డే ప్రపంచ కప్‌ నాటికి అతడు సిద్ధం కాకపోతే పరిస్థితి ఏమిటని కపిల్ ప్రశ్నించాడు. 'బుమ్రాకు ఏమైంది? ఎంతో నమ్మకంతో ఆడతాడు. అయితే.. ప్రపంచకప్‌ టోర్నీకి అందుబాటు లో లేకపోతే.. అతడి కోసం సమయం వెచ్చించడం వృథానే. ఇక రిషబ్ పంత్‌ గొప్ప క్రికెటర్‌. అతడు ఉండుంటే.. మన టెస్టు క్రికెట్‌ మరింత బాగుండేది' అని పేర్కొన్నాడు.

ఇంతలోనే ఐపీఎల్ గురించి మాట్లాడుతూ 'ఆ లీగ్ గొప్పదే.. అయితే, అదే మిమ్మల్ని దెబ్బతీస్తుంది. చిన్నపాటి గాయాల తో మీరు ఐపీఎల్‌ లో ఆడతారు. టీమిండియా విషయం లో అదే పరిస్థితులు ఎదురైతే విశ్రాంతి తీసుకుంటారు. దీని ని నేను చాలా ఓపెన్‌ గా చెబుతున్నాను' అంటూ సీనియర్ల పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల పనిభారం నిర్వహణపై బీసీసీఐ కూడా సరిగ్గా పనిచేయడం లేదని విమర్శించాడు.