Begin typing your search above and press return to search.

జూన్‌ 25.. ఎమర్జెన్సీతోనే కాదు.. మరో విధంగానూ చరిత్రలో మరువలేనిది

-ప్రభుత్వపరంగా భారత్‌లో ఎమర్జెన్సీ ఎలాంటి మచ్చగా మిగిలిందో.. క్రికెట్‌లో 1983 జూన్‌ 25 కూడా అంతే చిరస్థాయిగా మిగిలింది.

By:  Tupaki Desk   |   25 Jun 2025 9:23 AM IST
జూన్‌ 25.. ఎమర్జెన్సీతోనే కాదు.. మరో విధంగానూ చరిత్రలో మరువలేనిది
X

1975 జూన్‌ 25.. సరిగ్గా 50 ఏళ్ల కిందట భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత సంచలనం.. ఎవరూ ఊహించని విధంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఇలా జరుగుతుందని ఎవరూ కలలో కూడా అనుకుని ఉండరు. అలా నాడు విధించిన ఎమర్జెన్సీ ఏడాదిన్నర సాగింది. ఈ సమయంలో ఎందరో ప్రతిపక్ష నాయకులను జైళ్లలో పెట్టారు. మీసా పేరిట దారుణమైన చట్టాన్ని తీసుకువచ్చారు. ప్రశ్నించినవారిని పోలీసులతో అణచివేశారు. మీడియా గొంతు కూడా నొక్కారు. ఇంకా ముందుకెళ్లి పురుషులు, యువకులకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేశారు. అన్ని హక్కులను హరించిన ఎమర్జెన్సీ అలా ఓ చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఇ‍ప్పటికీ జూన్‌ 25 అనగానే ఎమర్జెన్సీ విధించిన రోజుగానే గుర్తొస్తుంది. అయితే, అదే కాదు.. ఈ రోజు భారత చరిత్రలో ఓ మరుపురానిది కూడా కావడం గమనార్హం. చరిత్రను మలుపుతిప్పిన రోజు కావడం విశేషం.

-ప్రభుత్వపరంగా భారత్‌లో ఎమర్జెన్సీ ఎలాంటి మచ్చగా మిగిలిందో.. క్రికెట్‌లో 1983 జూన్‌ 25 కూడా అంతే చిరస్థాయిగా మిగిలింది. కారణం... నాడు వన్డే ప్రపంచ కప్‌ను భారత్‌ తొలిసారిగా నెగ్గడం. కపిల్‌దేవ్‌ సారథ్యంలోని టీమ్‌ ఇండియా 1983లో ఇదే రోజున దిగ్గజ ఆటగాళ్లున్న వెస్టిండీస్‌ను ఓడించి మరీ ప్రపంచ విజేతగా నిలిచింది. తద్వారా కపిల్‌ డెవిల్స్‌గా పేరుగాంచింది. ఇది జరిగి 42 ఏళ్లయింది. నాడు భారత్‌ గెలిచింది 43 పరుగులతో.

-అండర్‌ డాగ్‌గా ఏమాత్రం అంచనాలు లేకుండా 1983 ప్రపంచ కప్‌ ప్రయాణం మొదలుపెట్టింది కపిల్‌ సేన. లీగ్‌ దశలో జింబాబ్వేపై 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ ఆ సమయంలో క్రీజులోకి దిగి ఏకంగా 175 నాటౌట్‌ (138 బంతుల్లో) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడాడు.

-ఇక ఫైనల్లో కపిల్‌ డెవిల్స్‌ మరో అద్భుతమే చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కపిల్‌ టీమ్‌ 183 పరుగులకే పరిమితమైంది. ఈ స్కోరు చూసి వివ్‌ రిచర్డ్స్‌ వంటి అరివీర భయంకర బ్యాటర్లున్న వెస్టిండీస్‌ ఊదిపడేద్దాం అనుకుంది. కానీ, కపిల్‌ డెవిల్స్‌ పట్టుదల ముందు తలొంచింది. మరీ ముఖ్యంగా ఫైనల్లో రిచర్డ్స్‌ కొట్టిన షాట్‌ను కపిల్‌ డీప్‌ మిడ్‌ వికెట్లో వెనక్కు పరిగెడుతూ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతోనే వెస్టిండీస్‌పై భారత్‌ విజయం ఖాయమైంది. చివరకు కరీబియన్లను 140 పరుగులకే ఆలౌట్‌ చేసి ప్రపంచ విజేతగా నిలిచింది.

-ఈ విజయం భారత క్రికెట్‌ గతినే మార్చేసింది. ప్రపంచ క్రికెట్‌ ముఖచిత్రాన్ని కూడా మార్చింది. 1983 ఫైనల్లో భారత్‌ చేతిలో ఓడిన తర్వాత వెస్టిండీస్‌ మళ్లీ వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌ చేరలేదు. కరీబియన్‌ క్రికెట్‌ పతనానికి నాడు పడిన పునాది 2023లో భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించలేని వరకు వచ్చింది.

-1983 ప్రపంచ కప్‌ను పదేళ్ల కుర్రాడిగా చూసిన సచిన్‌ టెండూల్కర్‌ తాను క్రికెటర్‌ను కావాలని కలలు కన్నాడు. ఇక నాటి ప్రపంచ కప్‌ గెలుపు భారత్‌లో క్రికెట్‌ను ఓ మతంగా మార్చేసింది. ఇప్పుడు ఐపీఎల్‌తో ప్రపంచ క్రికెట్‌కు రారాజును చేసింది. అందుకే ఎమర్జెన్సీతోనే కాదు వన్డే ప్రపంచ కప్‌ గెలుపుతోనూ జూన్‌ 25 భారత్‌కు మరువలేనిది.