రూట్ సెంచరీ.. హెడెన్ నగ్న సవాల్.. కూతురు విన్నపం.. వైరల్
దాదాపు 12 ఏళ్లుగా టెస్టు క్రికెట్‌లో టాప్ స్కోరర్ ఎవరంటే మన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (15,921) గురించే చెప్పుకుంటూ వస్తున్నాం..
By: Tupaki Desk | 13 Sept 2025 9:42 AM ISTదాదాపు 12 ఏళ్లుగా టెస్టు క్రికెట్‌లో టాప్ స్కోరర్ ఎవరంటే మన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (15,921) గురించే చెప్పుకుంటూ వస్తున్నాం.. రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), విరాట్ కోహ్లి (ఇండియా) వంటి స్టార్ బ్యాటర్లు పోటీకి వచ్చినా ఎవరూ అందుకోలేదు. అసలు సచిన్‌తో పోలిక తెస్తేనే అవతలి క్రికెటర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుందనే సెంటిమెంట్ ఉంది. కానీ, ఇప్పుడు సచిన్ రికార్డు పరుగులను దాటేసేలా ఉన్నాడు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్.
మరొక్క మూడేళ్లే...
సచిన్ రికార్డు మహా అంటే మరో రెండేళ్లు కొనసాగుతుందేమో..? ఎందుకంటే.. రూట్ కేవలం 2,400 పరుగుల దూరంలోనే ఉన్నాడు. ఇటీవల అతడు భీకర ఫామ్ లో కనిపిస్తున్నాడు. ఈ లెక్కన ఏడాదికి 800 పరుగులు చేసినా మూడేళ్లలో సచిన్ ను దాటేయడం ఖాయం. రూట్ వయసు 34. ఇంకో మూడేళ్లు ఆడతాడు. కాబట్టి, అతడు టెస్టుల్లో 16 వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మన్ గానూ ఎవరూ అందుకోలేని స్థాయిలో ఉంటాడు.
అదొక్కటే లోటు...
158 టెస్టుల్లో 13,543 పరుగులు చేసిన రూట్ అనేక దేశాల్లో సెంచరీలు కొట్టాడు. అత్యంత కష్టమైన భారత్ లోనూ మూడంకెల స్కోరు అందుకున్నాడు. 2012 డిసెంబరులో 22 ఏళ్ల కుర్రాడిగా భారత్ పై తొలి టెస్టు ఆడాడు రూట్. అంటే దాదాపు 13 ఏళ్ల కెరీర్. కానీ ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో ఒక్క టెస్టు సెంచరీ కూడా చేయలేదట. అందుకని పెర్త్ లో నవంబరు 21 నుంచి మొదలయ్యే ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ ముంగిట అతడికి ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ఓ సవాల్ విసిరాడు. రూట్ ను ఆస్ట్రేలియా బౌలర్లు ఎలా అడ్డుకుంటారో గానీ.. అతడు ఒక్క సెంచరీ చేయకపోతే మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో తాను నగ్నంగా తిరుగుతానని హేడెన్ పోస్ట్ చేశాడు. ఇది వైరల్ గా మారింది.
రూట్ సెంచరీ కొట్టు ప్లీజ్...
హేడెన్ సవాల్ కు అతడి కూతురు, స్పోర్ట్స్ కామెంటేటర్ గ్రేస్ హేడెన్ వరకు వెళ్లింది. దీంతో ఆమె.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్ అయినప్పటికీ రూట్ ను సెంచరీ చేయమని కోరుతోంది. తద్వారా తన తండ్రి సవాల్ ఓడిపోవాలని కోరుకుంది. ఇది.. కామెంటేటర్ కాబట్టి హేడెన్ కూతురు తనకు ఇబ్బందికర పరిస్థితి రాకూడదని కోరుకున్నట్లుంది.
