Begin typing your search above and press return to search.

టీమిండియా మేటి పేసర్ మధ్యలోనే ఇంటికి.. గుడ్ న్యూసే

ఇక వరల్డ్ కప్ ఆడడం ఖాయం అనుకున్నారు. దానికి ముందు సెమీఫైనల్స్ లాంటి ఆసియా కప్ లో రాణిస్తాడని కూడా ఆశలు పెట్టుకున్నారు

By:  Tupaki Desk   |   4 Sep 2023 8:35 AM GMT
టీమిండియా మేటి పేసర్ మధ్యలోనే ఇంటికి.. గుడ్ న్యూసే
X

మరొక్క నెల రోజుల్లో ప్రపంచ కప్.. అతడు జట్టులో ఉంటే కప్ కొట్టడం గ్యారంటీ అన్న అంచనాలు.. గాయంతో ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైనప్పటికీ.. తిరిగిస్తూనే దుమ్మురేపాడు. పూర్తిగా కోలుకున్నట్లు కనిపించాడు. ఇక వరల్డ్ కప్ ఆడడం ఖాయం అనుకున్నారు. దానికి ముందు సెమీఫైనల్స్ లాంటి ఆసియా కప్ లో రాణిస్తాడని కూడా ఆశలు పెట్టుకున్నారు. కానీ, అనూహ్యంగా అతడు ఇంటి బాట పట్టాడు. అందరినీ కాస్త ఆందోళనకు గురిచేశాడు.

మధ్యలోనే ఎందుకిలా..?

వన్డే ప్రపంచ కప్ నకు సోమవారం టీమిండియా 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించనుంది. ఇప్పటికే ఆసియా కప్ కోసం శ్రీలంకలో ఉన్న మన జట్టు.. శనివారం పాకిస్థాన్ తో ఆడింది. కానీ, భారత ఇన్నింగ్స్ ముగిశాక వర్షం పడడంతో పాక్ ఇన్నింగ్స్ సాగలేదు. కాగా, భారత ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆ మ్యాచ్ లో ఎలా బౌలింగ్ చేస్తాడో చూడాలని భావించిన వారికి నిరాశే ఎదురైంది. హైదరాబాదీ సిరాజ్ తో కలిసి బుమ్రా కొత్త బంతిని పంచుకోవాల్సి ఉంది. వాస్తవానికి బుమ్రా ఐర్లాండ్ పర్యటనతోనే పునరాగమనం చేశాడు. కెప్టెన్ గానూ వ్యవహరించాడు. తన వైవిధ్య బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. కానీ, అది పూర్తిగా టి20 సిరీస్. ఆసియా కప్ మాత్రం వన్డే ఫార్మాట్ లో జరుగుతోంది. దీంతోనే బుమ్రాను పూర్తిస్థాయిలో పరీక్షించే అవకాశం ఉండింది. కానీ, ఆదివారం అర్థరాత్రి అతడు అనూహ్యంగా భారత్ కు తిరిగొచ్చాడు.

ఏమైందో అని ఆందోళన..

బుమ్రా ప్రపంచ కప్ లో అత్యంత కీలకం. అందులోనూ భారత్ లో జరుగుతున్నందున అతడికి మన పిచ్ లు కొట్టిన పిండి. తనదైన శైలి యార్కర్లతో బుమ్రా ప్రత్యర్థి బ్యాట్స్ మన్ ను వణికించేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అలాంటి బౌలర్ ఊహించని విధంగా స్వదేశానికి రావడం కాస్త కలకలం రేపింది. గాయం ఏమైనా తిరగబెట్టిందా...? అనే అనుమానాలూ వ్యక్తమయ్యాయి. అదేం కాదని తేలింది.

బుమ్రా కిది ప్రత్యేక సందర్భం

బుమ్రా భార్య సంజనా గణేశన్ సోమవారం తెల్లవారుజామున మగ బిడ్డకు జన్మనిచ్చింది. భార్య డెలివరీ డేట్ ఉన్నందునే బుమ్రా అర్థంతరంగా తిరిగి వచ్చాడని తేలింది. దీంతోపాటు దంపతులిద్దరూ.. బిడ్డ చేతిని తమ చేతిలోకి తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ''మా చిన్న కుటుంబం పెరిగింది. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. ఈ రోజు ఉదయం మా చిన్నారి అంగద్‌ జస్ప్రీత్‌ బుమ్రాను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించాం. ఇప్పుడు మా ఆనందానికి అవధుల్లేవు. తల్లిదండ్రులుగా మా జీవితాల్లో ప్రారంభమైన ఈ కొత్త అధ్యాయాన్ని ప్రతిక్షణం ఆస్వాదించేందుకు ఎదురుచూస్తున్నాం'' అని బుమ్రా ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. టీవీ పర్సనాలిటీ అయిన సంజనా గణేశన్‌ను బుమ్రా 2021 మార్చిలో వివాహం చేసుకున్నాడు. వెన్ను గాయంతో సుదీర్ఘకాలం క్రికెట్‌కు దూరంగా ఉన్న బుమ్రా.. ఇటీవల టీమ్‌ఇండియాలోకి పునరాగమనం చేశాడు.

బుమ్రా చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నాడు. తాతయ్య సైతం పట్టించుకోలేదు. తల్లే సంరక్షణ బాధ్యతలు తీసుకుంది. ప్రతిభ ఉండడంతో బుమ్రా మేటి క్రికెటర్ గా ఎదిగాడు. దీంతోనే అతడికి ప్రస్తుత సందర్భం వ్యక్తిగత జీవితంలో అత్యంత విలువైనది.