Begin typing your search above and press return to search.

ఆ క్రికెట‌ర్.. త‌రానికొక్క‌డు.. జాతి సంప‌ద‌.. మ‌ళ్లీ దొరుకుతాడా?

టి20 ప్ర‌పంచ క‌ప్ ప్రారంభ మ్యాచ్ స‌మ‌యానికి టీమ్ఇండియా షాకింగ్ న్యూస్. పేస్ ఆల్ రౌండ‌ర్ హ‌ర్షిత్ రాణా అనూహ్యంగా గాయ‌ప‌డ‌డంతో హైద‌రాబాదీ పేస‌ర్ మొహ‌మ్మ‌ద్ సిరాజ్ ను హుటాహుటిన జ‌ట్టులో చేర్చారు.

By:  Tupaki Political Desk   |   9 March 2026 4:07 PM IST
ఆ క్రికెట‌ర్.. త‌రానికొక్క‌డు.. జాతి సంప‌ద‌.. మ‌ళ్లీ దొరుకుతాడా?
X

టీమ్ఇండియా ప్ర‌పంచ క‌ప్ విజ‌యం అనంత‌రం ఆట‌గాళ్ల ఒక్కొక్క‌రి ఆట‌తీరును విశ్లేషిస్తే.. ఏ మ్యాచ్ లోనూ లోపం లేకుండా రాణించిన ఒకే ఒక్క క్రికెట‌ర్ ఉన్నాడు..! జ‌ట్టు ఎంత క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్నా గెలుపు బాధ్య‌త‌ను భుజాన వేసుకున్నాడు. ఓట‌మి ఖాయం అనుకున్న స‌మ‌యంలో తానున్నానంటూ ముందుకొచ్చాడు..! ప్ర‌త్య‌ర్థి చెల‌రేగుతుంటే స్పీడ్ బ్రేక‌ర్ లా అడ్డు క‌ట్ట వేశాడు. టోర్నీ మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కు ఒక‌టే జోష్ తో ఆడాడు. భారీ స్కోరు న‌మోదైన ఫైన‌ల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు ఆ పేస్ బౌల‌ర్. ఇదంతా ఎవ‌రి గురించో మీకు తెలిసే ఉండి ఉంటుంది...! అందుక‌నే అత‌డిని త‌రానికి ఒక్క‌డు.. జాతి సంప‌ద అని కొనియాడుతున్నారు ఇప్పుడు.

క‌ల‌వ‌రం రేపి.. కోలుకుని

టి20 ప్ర‌పంచ క‌ప్ ప్రారంభ మ్యాచ్ స‌మ‌యానికి టీమ్ఇండియా షాకింగ్ న్యూస్. పేస్ ఆల్ రౌండ‌ర్ హ‌ర్షిత్ రాణా అనూహ్యంగా గాయ‌ప‌డ‌డంతో హైద‌రాబాదీ పేస‌ర్ మొహ‌మ్మ‌ద్ సిరాజ్ ను హుటాహుటిన జ‌ట్టులో చేర్చారు. దీనికి అత‌డు న్యాయం చేశాడు. అమెరికాతో జ‌రిగిన మ్యాచ్ లో మూడు వికెట్లు తీశాడు. అయితే, ఈ మ్యాచ్ లో అస‌లు సిరాజ్ ఆడ‌డానికి కార‌ణం.. మేటి పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా అనారోగ్య‌మే. ఏమాత్రం భావించ‌ని ప‌రిస్థితి బుమ్రాకు ఎదుర‌వ‌డంతో జ‌ట్టుతో పాటు అభిమానులంతా షాక్ అయ్యారు. అస‌లే గాయాల బాధితుడు. ఇలాంటి స‌మ‌యంలో బుమ్రా కోలుకుని వ‌స్తాడా? ఎప్ప‌టినుంచి మ్యాచ్ లు ఆడ‌తాడు? అని అనుమానాలు క‌లిగాయి. కానీ, రెండో మ్యాచ్ కే బుమ్రా సిద్ధ‌మ‌య్యాడు. ఇక అక్క‌డి నుంచి అత‌డు తిరిగి చూడ‌లేదు.

ప్ర‌తి మ్యాచ్ లో బంతితో మాయాజాలం

4 ఓవ‌ర్లు 15 ప‌రుగులు 4 వికెట్లు.. ఇదీ న్యూజిలాండ్ తో ఫైన‌ల్లో బుమ్రా ప్ర‌ద‌ర్శ‌న‌. ఇదేదో ఫైన‌ల్లో మాత్ర‌మే కాదు.. సూప‌ర్ 8లో భార‌త్ ఓడిపోయిన ద‌క్షిణాఫ్రికాతో మ్యాచ్ లోనూ బుమ్రా అద‌ర‌గొట్టాడు. కేవ‌లం 15 ప‌రుగులే ఇచ్చి కీల‌క మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. సెమీఫైన‌ల్లో ఇంగ్లండ్ మీద మిగ‌తా బౌల‌ర్లంతా తేలిపోతే.. బుమ్రా మాత్రం 33 ప‌రుగులే ఇచ్చి వికెట్ తీశాడు. 16వ ఓవ‌ర్లో 8, 18వ ఓవ‌ర్లో 6 ప‌రుగులే ఇచ్చి జ‌ట్టును ఫైన‌ల్ చేర్చాడు. టోర్నీలో న‌మీబియాతో మొద‌లుపెట్టి.. న్యూజిలాండ్ తో ఫైన‌ల్ వ‌ర‌కు ఏ మ్యాచ్ లోనూ బుమ్రా 36కు మించి ప‌రుగులు ఇవ్వ‌క‌పోవ‌డాన్ని బ‌ట్టే అత‌డి బౌలింగ్ స్థాయి ఏమిటో తెలుస్తోంది.

జాతిర‌త్నం.. కాపాడుకోవాలి

బుమ్రా విలువైన జాతి ర‌త్నం లాంటోడు. బుమ్రా మూడు ఫార్మాట్ల‌లోనూ ఆడుతున్నాడు. మ్యాచ్ విన్న‌ర్ కూడా. కానీ, అత‌డి బౌలింగ్ వైవిధ్యం కార‌ణంగా గాయాల బాధ ఎక్కువ‌. అందుకే బుమ్రాను చాలా జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి. మ్యాచ్ ల విష‌యంలో అత‌డిని ఆచితూచి ఆడించాలి. అవ‌స‌రం లేన‌ప్పుడు విశ్రాంతి ఇవ్వాలి. అత‌డు గ‌నుక వ‌ర్క్ లోడ్ కార‌ణంగా గాయ‌ప‌డితే ఆ ప్ర‌భావం ఎలా ఉంటుందో.. ఊహించుకోవ‌చ్చు. అందుకే, బుమ్రా త‌రానికి ఒక్క‌డు. మ‌రొక్క విష‌యం.. బుమ్రా లాంటి బౌల‌ర్ మ‌ళ్లీ పుడ‌తాడా? అంటే.. మ‌రో క‌పిల్ దేవ్ పుట్టాడా? అనే ప్ర‌శ్న వ‌స్తోంది.