రంజీట్రోఫీ చరిత్రలో అతిపెద్ద సంచలనం.. అనామక జట్టే చాంపియన్
91 ఏళ్ల రంజీట్రోఫీ చరిత్రలో 42 సార్లు టైటిల్ కొట్టింది ముంబై..! 1958-59 నుంచి 1972-73 వరకు వరుసగా పదిహేను సంవత్సరాలు విజేతగా నిలిచింది. కానీ, ఈసారి మాత్రం చరిత్ర తిరగబడింది.
By: Tupaki Entertainment Desk | 27 Feb 2026 6:00 PM IST91 ఏళ్ల రంజీట్రోఫీ చరిత్రలో 42 సార్లు టైటిల్ కొట్టింది ముంబై..! 1958-59 నుంచి 1972-73 వరకు వరుసగా పదిహేను సంవత్సరాలు విజేతగా నిలిచింది. కానీ, ఈసారి మాత్రం చరిత్ర తిరగబడింది. కొత్త చరిత్ర నమోదు కానుంది. దేశవాళీల్లో అత్యున్నతమైన రంజీ ట్రోఫీకి నయా చాంపియన్ రానుంది. 2025-26 సీజన్ లో అనామక జట్టే చాంపియన్ కానుంది. బహుశా సమీప భవిష్యత్ లో మరే జట్టుకూ సాధ్యం కాని రికార్డును అందుకోనుంది. రంజీట్రోఫీ భారత దేశ అత్యున్నత దేశవాళీ టోర్నీనే కాదు.. ఇప్పుడు ప్రపంచ స్థాయిలోనూ ప్రమాణాల పరంగా చాలా ముందంజలో ఉంది. 1934-35 సీజన్ లో మొదలైన ఈ ట్రోఫీ.. 91వ సీజన్ ఫైనల్ కర్ణాటక-జమ్మూకశ్మీర్ మధ్య జరుగుతోంది. ఇందులో శుక్రవారం కర్ణాటకపై 291 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఇప్పటికే నాలుగో రోజు ముగిసింది. కశ్మీర్.. రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 180పైగా పరుగులు చేసింది. మొత్తం ఆధిక్యం 472 పరుగులు దాటనుంది. దీంతోనే జమ్ముకశ్మీర్.. ఈ సీజన్ చాంపియన్ కానుంది. ఎందుకంటే, ఫలితం తేలని పరిస్థితుల్లో రంజీ ట్రోఫీ మ్యాచ్ విజేతలను తొలి ఇన్నింగ్స్ ఆధారంగానే ప్రకటిస్తారు.
అద్భుతంగా ఆడి.. సొంతగడ్డపై తడబడి..
ఈ ఏడాది రంజీ సీజన్ లో కర్ణాటక అద్భుతంగా ఆడింది. టీమ్ఇండియా టెస్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ అందుబాటులోకి రావడంతో పాటు కెప్టెన్ దేవదత్ పడిక్కల్, మిడిలార్డర్ బ్యాటర్ రవిచంద్రన్ స్మరణ్ అద్భుత ఫామ్.. కరుణ్ నాయర్ వంటి సీనియర్ తోడుగా దుమ్మరేపింది. కానీ, కీలకమైన ఫైనల్లో తడబడింది. అదికూడా సొంత రాష్ట్రం ఆలూరులో జరుగుతున్న తుది సమరంలో కావడం గమనార్హం.
బౌలర్లు, బ్యాటర్లు ఫెయిల్..
టాస్ గెలిచి ఫైనల్లో జమ్ముకశ్మీర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఏకంగా 584 పరుగుల భారీ స్కోరు చేసింది. శుభమ్ పందిర్ (121) సెంచరీతో పాటు యావెర్ హసన్ (88) రాణించారు. ప్రసిద్ధ్ క్రిష్ణ వంటి టీమ్ఇండియా పేస్ బౌలర్ కూడా అడ్డుకట్ట వేయలేకపోయాడు. ప్రతిగా... 293 పరుగులకే ఆలౌటైంది. మాజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (160) భారీ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. కశ్మీర్ బౌలర్లలో అకిబ్ నబీ (5/45) అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో 180 పైగా పరుగులు చేసింది. శనివారం మ్యాచ్ కు చివరి రోజు. దీంతోనే జమ్ము కశ్మీర్ రంజీట్రోఫీ చరిత్రలో తొలిసారి చాంపియన్ గా రికార్డులకు ఎక్కనుంది.
కొసమెరుపుః రంజీట్రోఫీని ముంబై తర్వాత అత్యధిక సార్లు గెలిచిన జట్టు కర్ణాటక (8). ఇప్పుడు ఆ జట్టుపైనే జమ్ము కశ్మీర్ ఫైనల్లో విజయం సాధించింది.
