Begin typing your search above and press return to search.

టీమిండియాకు ‘ఆల్ రౌండ్’ దెబ్బ.. భవిష్యత్ కష్టమే..

సరిగ్గా 30 ఏళ్లు అవుతోంది.. భారత దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయి.

By:  Tupaki Desk   |   1 Feb 2024 5:30 PM GMT
టీమిండియాకు ‘ఆల్ రౌండ్’ దెబ్బ.. భవిష్యత్ కష్టమే..
X

సరిగ్గా 30 ఏళ్లు అవుతోంది.. భారత దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయి. అప్పటికి అతడు టెస్టుల్లో టాప్ వికెట్ టేకర్. 5 వేల పైగా పరుగులు సాధించిన అరుదైన ఘనత కూడా సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అయితే చెప్పనవసరమే లేదు. బలహీన జట్టుగా ముద్ర పడిన భారత్ ను ప్రపంచ విజేతగా నిలిపాడు. నేడు భారత్ లో క్రికెట్ ఎవరూ ఊహించని స్థాయికి చేరిందంటే.. అది కపిల్ దేవ్ కారణంగానే అని చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఇదంతా గతం. ఎంత చెప్పుకొన్నా తరగదు. మరి ఈ 30 ఏళ్లలో ఏం జరిగింది?

మళ్లీ ఎపుడు దొరుకుతాడో?

భారత్ లో కపిల్ దేవ్ లాంటి పేస్ ఆల్ రౌండర్ మళ్లీ పుడతాడా? అంటే చెప్పలేని పరిస్థితి. ఇర్ఫాన్ పఠాన్ వంటి వారు ఎన్నో ఆశలు రేపినా వారి కెరీర్ అర్థంతరంగానే ముగిసింది. అయితే, ఒక స్పిన్ ఆల్ రౌండర్ ఆ కొరతను తీర్చాడు. దీంతో పదేళ్లుగా భారత్ టెస్టుల్లో నిలకడగా విజయాలు సాధిస్తోంది. అతడే రవీంద్ర జడేజా. కానీ, కొన్నాళ్లుగా జడ్డూ గాయాల బారిన పడుతున్నాడు. దీంతో పలు సిరీస్ లకు ప్రతిష్ఠాత్మక టోర్నీలకూ దూరం అవుతున్నాడు. మరీ ముఖ్యంగా గత మూడేళ్ల నుంచి జడేజాకు గాయాలే గాయాలు.

దీంతో 3 ఫార్మాట్లలోనూ నిలకడగా ఆడలేని పర్థిసిత వసూతోంది. పైగా జడేజా వయసు 35 ఏళ్లు. ఫిట్ నెస్ కూడా తగ్గుతోంది. గతంలోలా శరీరం సహకరించడం లేదనేది గాయాలను బట్టి స్పష్టం అవుతోంది.

చురుకైన రన్నరే రనౌటైతే..

టీమిండియాలో చురుకైన రన్నర్ ఎవరంటే కోహ్లి, జడేజాలే. వికెట్ల మధ్యనే కాదు.. ఫీల్డింగ్ లోనూ వీరిద్దరూ అద్భుతంగా కదులుతుంటారు. అలాంటి జడేజా హైదరాబాద్ టెస్టులో రనౌట్ అయ్యాడు. అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. ఈ క్రమంలో తొడ కండరాలు పట్టేయడంతో వచ్చే మ్యాచ్ కు దూరమయ్యాడు. వాస్తవానికి చూస్తే మూడేళ్లలో అయిదు సార్లు గాయపడ్డాడు జడేజా. 2021 జనవరిలో బొటనవేలి గాయం మొదలు.. ఎక్కువ శాతం జట్టుకు దూరంగానే ఉంటున్నాడు. 2022 ఆసియా కప్‌లో గాయం వల్ల టీ20 ప్రపంచ కప్‌ ఆడలేదు.. మోకాలి సర్జరీ చేయించుకున్నాడు. 2022 ఆరంభంలో పక్కటెముకల గాయంతో రెండు నెలలు మైదానంలోకి దిగలేదు. 2021-22 ఫిబ్రవరి వరకు చేతి గాయంతో బాధపడ్డాడు.

కొత్తవారిని వెదుక్కోవాల్సిందే..

జడేజా మహా అంటే రెండేళ్లు కొనసాగుతాడేమో..? కాబట్టి అతడికి ప్రత్యామ్నాయం వెదుక్కోవాల్సిందే. మరో స్పిన్ ఆల్ రౌండర్ అశ్విన్ కు ఇప్పటికే 37 ఏళ్లు. వీరిద్దరూ వచ్చే రెండేళ్లలో రిటైర్ అవడం ఖాయం. ఇదే అంశం భవిష్యత్‌ పై సందేహాలు రేకెత్తిస్తోంది. ఐదేళ్లుగా జట్టుతో ఉన్న వాషింగ్టన్‌ సుందర్‌ తన సత్తా నిరూపించుకోవాల్సి ఉంది. జడేజా తరహాలోనే బౌలింగ్, బ్యాటింగ్ చేయగల అక్షర్‌ పటేల్ కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. రెండో టెస్టు కోసం జట్టులోకి వచ్చిన సౌరభ్‌ కుమార్ కు 30 ఏళ్లు. వీటన్నిటిని బట్టి యువ ఆల్ రౌండర్ల పై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.

కొసమెరుపు: టీమిండియాకు ఐదారేళ్ల కిందట హార్దిక్ పాండ్యా రూపంలో మంచి పేస్ ఆల్ రౌండర్ దొరికాడు. కొన్ని టెస్టులు అతడు గెలిపించాడు కూడా. కానీ, వరుస గాయాలతో హార్దిక్ కెరీర్ గాడితప్పింది. టెస్టులు అసలు ఆడడమే లేదు. ఇక వన్డేలు, టి20లకు భవిష్యత్ సారథిగా అతడిని భావించినా.. తాజాగా ప్రపంప చకప్ లో గాయపడి మైదానానికి దూరమయ్యాడు. అతడు తిరిగి ఎప్పుడు బరిలో దిగుతాడో చెప్పలేని పరిస్థితి.