ఫుట్ బాల్ లో ఫెయిల్.. క్రికెట్ ప్రపంచకప్ కు క్వాలిఫై.. ఇటలీ విచిత్రం
ఫుట్ బాల్ లో ఐదుసార్లు ప్రపంచ కప్ గెలిచింది బ్రెజిల్.. ఆ తర్వాత నాలుగుసార్లు టైటిల్ కొట్టింది కేవలం రెండు జట్లే.. వాటిలో ఒకటి జర్మనీ కాగా, మరొకటి ఇటలీ. ప్రపంచ ఫుట్ బాల్ లో అంత మేటి జట్టు ఇటలీ.
By: Tupaki Desk | 12 July 2025 1:00 PM ISTఫుట్ బాల్ లో ఐదుసార్లు ప్రపంచ కప్ గెలిచింది బ్రెజిల్.. ఆ తర్వాత నాలుగుసార్లు టైటిల్ కొట్టింది కేవలం రెండు జట్లే.. వాటిలో ఒకటి జర్మనీ కాగా, మరొకటి ఇటలీ. ప్రపంచ ఫుట్ బాల్ లో అంత మేటి జట్టు ఇటలీ. కానీ, ఇలాంటి జట్టు వరుసగా రెండు ఫుట్ బాల్ ప్రపంచ కప్ లకు అర్హత సాధించలేకపోయింది. 2018లో రష్యాలో, 2022లో ఖతర్ లో జరిగిన ప్రపంచ కప్ లలో ఇటలీ ఆడలేదు. అలాంటి దేశం ఏమాత్రం ఊహించని విధంగా 2026లో జరిగే టి20 క్రికెట్ ప్రపంచ కప్ నకు క్వాలిఫై అయింది. ఈ కప్ జరిగేది ఎక్కడో కాదు.. భారత్, శ్రీలంకలో కావడం గమనార్హం.
గ్లి అజ్జురి (ది బ్లూస్).. ఇటలీ జట్టుకు ప్రపంచ ఫుట్ బాల్ లో ఉన్న పేరు. నీలం రంగు జెర్సీలో కనిపించే ఆ జట్టు ఆటగాళ్లను అజ్జురీస్ గా పిలుస్తారు. అయితే, 2006 ప్రపంచకప్ గెలిచిన అనంతరం ఇటలీ ఫుట్ బాల్ వెనుకబడింది. కానీ, క్రికెట్ లో మాత్రం గత దశాబ్ద కాలంగా మెరుగుపడుతూ వస్తోంది. అది ప్రపంచ కప్ బెర్తు సాధించే వరకు వచ్చింది.
యూరప్ లో ఇంగ్లండ్ తప్ప క్రికెట్ లో మరే జట్టు మేటిగా ఎదగలేదు. దీని సమీపంలో ఉండే ఐర్లాండ్, స్కాట్లాండ్ కాస్త చెప్పుకోదగ్గ జట్లు. నెదర్లాండ్స్ ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. స్కాట్లాండ్ ను ఓడించిన ఇటలీ టి20 ప్రపంచ కప్ లో అడుగుపెట్టనుంది.
యూరప్ టి20 ప్రపంచ కప్ క్వాలిఫయర్ లో గున్ జీ, స్కాట్లాండ్ లపై గెలుపే ఇటలీకి చరిత్రలో తొలిసారి ప్రపంచ కప్ బెర్తు దక్కేలా చేసింది. క్వాలిఫయర్స్ లో 4మ్యాచ్ లలో 5 పాయింట్లు సాధించింది ఇటలీ. జెర్సీ దేశం జట్టు కూడా ఇన్నే పాయింట్లు సాధించినా.. మెరుగైన రన్ రేట్ తో ఇటలీ ప్రపంచ కప్ బెర్తు సాధించింది.
20 జట్లు పోటీ పడే 2026లో టి20 ప్రపంచ కప్ నకు ఇప్పటివరకు ఇటలీ సహా 13 జట్లు క్వాలిఫై అయ్యాయి. దీంతోపాటే నెదర్లాండ్స్ (4 మ్యాచ్ లలో 6 పాయింట్లు) కూడా 14వ జట్టుగా క్వాలిఫై అయింది.
మరి ఇటలీ ఎంతవరకు వెళ్తుంది..? మెన్ ఇన్ బ్లూగా పేరున్న టీమ్ ఇండియాతో తలపడే చాన్స్ దక్కుతుందా? చూడాలి.
