Begin typing your search above and press return to search.

దుబాయ్ కెళ్తే బీసీసీఐ కన్నెర్రే.. యువ క్రికెటర్ కు షాక్

ఇషాన్ కిషన్.. ఈ నెల 11 నుంచి జరిగే అఫ్ఘానిస్థాన్ టి20 సిరీస్ కు అందుబాటులో ఉంటానని చెప్పినా బీసీసీఐ పట్టించుకోలేదట

By:  Tupaki Desk   |   10 Jan 2024 2:30 PM GMT
దుబాయ్ కెళ్తే బీసీసీఐ కన్నెర్రే.. యువ క్రికెటర్ కు షాక్
X

ప్రపంచంలో మరే దేశానికి వెళ్లినా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ( బీసీసీఐ)కు కోపం రాదేమో..? మ్యాచ్ లు ఆడనుపోమని చెప్పినా బోర్డుకు ఆగ్రహం కలగదేమో..? వ్యక్తిగత కారణాలు చెప్పి టూర్ మధ్య నుంచి వైదొలగినా క్షమిస్తుందేమో..? కానీ, ఆటగాళ్లు అక్కడకు వెళ్తే మాత్రం సహించదు.. ఎందుకంటే.. ఆ ప్రఖ్యాత ప్రదేశం అంత వివాదాస్పదం అయినది కాబట్టి?

జట్టులో ఉన్నా.. మానసిక ఆందోళన అంటూ..

టీమిండియాలో చోటు దక్కడం ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే. కోట్ల మంది కుర్రాళ్లు ఆడే దేశంలో కేవలం 15 మందికే జాతీయ జట్టుకు ఎంపికయ్యే అవకాశం దక్కుతుంది. అందులోనూ 11 మందికే మైదానంలో దిగే వీలుంటుంది. అయితే, జట్టుకు ఎంపికై తుది జట్టులో లేకున్నా అదో రకం ఇబ్బందే. ఈ కారణంగానే యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ తీవ్ర మానసిక సంఘర్షణకు గురయ్యాడనే కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్ లో రెండు మ్యాచ్ లు ఆడిన అతడిని ఆ తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ లకు ఎంపిక చేసినా తుది జట్టులో ఆడించలేదు. దీంతో ఇబ్బందిపడిన అతడు దక్షిణాఫ్రికా సిరీస్ మధ్య నుంచి ఇంటికి వచ్చేశాడు. దీనికి కుటుంబానికి దూరంగా ఉండడంతో ఎదురైన మానసిక అలసటను కారణంగా పేర్కొన్నాడు.

వస్తానన్నా.. తీసుకోలేదు..

ఇషాన్ కిషన్.. ఈ నెల 11 నుంచి జరిగే అఫ్ఘానిస్థాన్ టి20 సిరీస్ కు అందుబాటులో ఉంటానని చెప్పినా బీసీసీఐ పట్టించుకోలేదట. అయితే. 'మానసిక అలసట' కారణం చెప్పిన ఇషాన్‌.. దుబాయ్‌ లో పార్టీలకు వెళ్లాడట. ఇది బీసీసీఐకి మంట పుట్టించింది. దీంతోనే అఫ్గాన్‌ సిరీస్‌ కు ఎంపిక చేయలేదని తెలుస్తోంది. వాస్తవానికి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ కు దూరంగా ఉండాలని ఇషాన్ కిషన్ భావించినా బీసీసీఐ, సెలక్టర్లు అంగీకరించలేదట. దక్షిణాఫ్రికాతోనూ పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌ ఆడకూడదని అనుకున్నా.. దానికీ ఆమోదం దక్కలేదు. టెస్టు సిరీస్‌ కు మాత్రం అందుబాటులో ఉండనని.. కుటుంబంతో గడుపుతానని భారత్ కు తిరిగొచ్చాడు. అలాగని దుబాయ్ లో పార్టీలకు వెళ్లడంతో బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు.

దుబాయ్ అంటే..

దుబాయ్ మ్యాచ్ ఫిక్సర్లకు కేంద్రం. 2000 సంవత్సరంలో వెలుగుచూసిన ఫిక్సింగ్ మూలాలు అక్కడే ఉన్నాయి. అందుకే ఒకప్పుడు భారీ ఆదరణ పొందిన షార్జా కప్ లోనూ భారత్ పాల్గొనడం లేదు. అనంతరం మొత్తానికే దుబాయ్ లో సిరీస్ లకు దూరంగా ఉంది. ఫిక్సర్లు, బుకీలు ఆటగాళ్లను ప్రలోభపెట్టి ఫిక్సింగ్ కు పాల్పడేలా చేస్తున్నారని భావించడమే దీనికి కారణం. అలాంటిచోటకు టీమిండియా ఫ్రంట్ లైన్ ఆటగాడు చెప్పా పెట్టకుండా వెళ్తే బోర్డు ఎందుకు సహిస్తుంది. అయితే, ఈ విషయం తెలియని కొందరు ''బ్రేక్‌ తీసుకున్న ఆటగాడు ఎక్కడికి వెళ్తే ఏమి? ఆ మాత్రం స్వేచ్ఛ అతడికి లేదా? ఇషాన్‌ కిషన్ సోదరుడి పుట్టిన రోజు వేడుకల కోసం దుబాయ్‌ వెళ్లాడు. అందుకోసమే పక్కనపెడతారా?'' అని ప్రశ్నిస్తున్నారు.