కాటేరమ్మ కొడుక్కు పునర్జన్మ..సెంచరీతో టీమ్ ఇండియాలోకి రీఎంట్రీ
వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అతికొద్ది మంది బ్యాటర్లలో అతడు ఒకడు..! టెస్టుల్లోనూ మంచి ఇన్నింగ్స్ లు ఆడాడు..! రెండేళ్ల కిందటి వన్డే ప్రపంచ కప్ జట్టులోనూ ఉన్నాడు..!
By: Tupaki Desk | 20 Dec 2025 3:14 PM ISTవన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అతికొద్ది మంది బ్యాటర్లలో అతడు ఒకడు..! టెస్టుల్లోనూ మంచి ఇన్నింగ్స్ లు ఆడాడు..! రెండేళ్ల కిందటి వన్డే ప్రపంచ కప్ జట్టులోనూ ఉన్నాడు..! కానీ, ఆ తర్వాతి నుంచే అతడి జాతకం తారుమారైంది..! వన్డే ప్రపంచ కప్ లో మ్యాచ్ లు ఆడించలేదని అలిగాడు..! ఆ తర్వాత దక్షిణాఫ్రికా వెళ్లిన జట్టు నుంచి మానసిక సమస్యలు కారణంగా చెబుతూ వెనక్కు వచ్చేశాడు..! బీసీసీఐ చెప్పినట్లుగా దేశవాళీ టోర్నీలు ఆడకుండా.. ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ (ఎంఐ) ప్రాక్టీస్ సెషన్ లో కనిపించాడు..! దీంతో బీసీసీఐ ఆగ్రహానికి గురై టీమ్ ఇండియాలో చోటు గల్లంతైంది. ఆ తర్వాత రంజీలు, దేశవాళీ వన్డే, టి20 ట్రోఫీలలో రాణించినా సెలక్టర్ల కరుణ దక్కలేదు. ఈలోగా నమ్ముకున్న ఐపీఎల్ జట్టు కూడా వద్దనుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) అతడిని రూ.11.25 కోట్ల ధర పెట్టి వేలంలో తీసుకుని అక్కున చేర్చుకుంది. వాస్తవానికి ఇది అతడి పాత ధర (రూ.15 కోట్లు) కంటే తక్కువే. అయితే, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఆ బ్యాటర్ ఈ ఏడాది ఐపీఎల్ తొలి మ్యాచ్ లోనే సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత కొన్ని మంచి ఇన్నింగ్స్ లు కూడా ఆడాడు. తాజాగా ముగిసిన దేశవాళీ టి20 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో దుమ్మురేపాడు. ఫైనల్లో మరింత చెలరేగి 45 బంతుల్లోనే సెంచరీ చేశాడు. కెప్టెన్ గా తమ రాష్ట్రం జట్టుకు తొలిసారి ముస్తాక్ అలీ ట్రోఫీ అందించాడు. ఇప్పుడు రెండేళ్ల పైగా విరామం తర్వాత టీమ్ ఇండియాలో రీ ఎంట్రీ ఇచ్చాడు.
ఆ సెంచరీతో.. పుష్ప స్టయిల్ సెలబ్రేషన్ తో..
ఇషాన్ కిషన్.. భారత క్రికెట్ లో పదేళ్లుగా తెలిసిన పేరు. టీమ్ ఇండియాకు మూడు ఫార్మాట్లలోనూ ఆడిన ప్లేయర్. వికెట్ కీపర్ బ్యాటర్ గా మహేంద్రసింగ్ ధోనీ వంటి దిగ్గజం స్థానాన్ని భర్తీ చేస్తాడని భావించారు. దీనికితగ్గట్టే మూడేళ్ల కిందట శ్రీలంకపై వన్డేల్లో డబుల్ సెంచరీ కూడా కొట్టాడు. ప్రపంచ కప్ జట్టులోనూ చోటు సంపాదించాడు. కానీ, ఆ తర్వాత కథ మారింది. అదంతా వదిలేస్తే.. తాజాగా ప్రకటించిన టి20 ప్రపంచ కప్ జట్టులో ఇషాన్ కు చోటు లభించింది. ఇటీవలి స్మాట్ ఫైనల్లో హరియాణాపై కిషన్ చెలరేగాడు. సెంచరీ అనంతరం పుష్ప స్టయిల్ లో సెలబ్రేషన్ జరుపుకొని సెలక్టర్లూ చూస్తున్నారా? అన్నట్లు సంకేతాలు పంపాడు. ఇప్పుడు టీమ్ ఇండియాలోకి కూడా వచ్చేశాడు.
బెస్ట్ ఫ్రెండ్ స్థానంలో.. అప్పుడు, ఇప్పుడు
టీమ్ ఇండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్ మన్ గిల్ ను టి20 ప్రపంచ కప్ జట్టునుంచి తప్పించి ఆ స్థానంలో కిషన్ కు చోటిచ్చారు. అయితే, గిల్-ఇషాన్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కావడం విశేషం. మూడేళ్ల కిందట వన్డేల్లో డబుల్ సెంచరీ చేసినా గిల్ అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగివచ్చాక కిషన్ కు టీమ్ ఇండియా తుదిజట్టులో చోటు దక్కలేదు. ఇప్పుడు అదే గిల్ వైఫల్యంతో అతడికి టి20ల్లో పిలుపు దక్కింది. విధి అంటే ఇదే కదూ..!
తుది జట్టులో ఖాయమా?
ఇషాన్ కిషన్ వంటి డాషింగ్ బ్యాటర్ ను తుది జట్టులోకి తీసుకోకుండా ఉండడం కష్టమే. అతడు మంచి వికెట్ కీపర్ కూడా. అయితే, సంజూ శాంసన్ వంటి బ్యాటర్-వికెట్ కీపర్ ఉండడంతోనే సందేహం కలుగుతోంది. ఒకవేళ ఈ ఇద్దరినీ ఆడించాలని చూస్తే కూర్పు ఇబ్బందే. అప్పుడు సంజూను పక్కనపెట్టి ఇషాన్ ను ఆడిస్తారేమో చూడాలి. మొత్తానికి ఈ ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరఫున అరంగేట్రం చేసి కాటేరమ్మ కొడుకు అనిపించుకున్న ఇషాన్ కిషన్ టీమ్ ఇండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు.
