స్కూటీపై నుంచి పడి..టీమ్ ఇండియాలో చోటు కోల్పోయిన స్టార్ క్రికెటర్
అవకాశం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు.. అది వచ్చినప్పుడు అందిపుచ్చుకోవడమే మనం చేయాల్సింది.
By: Tupaki Desk | 26 July 2025 9:30 AM ISTఅవకాశం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు.. అది వచ్చినప్పుడు అందిపుచ్చుకోవడమే మనం చేయాల్సింది. ఇక టీమ్ ఇండియాలో చోటు అంటే ఎవరూ ఊహించని పెద్ద అవకాశం. అదికూడా పోటీ తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో కెరీర్‌లో వెనుకబడిన క్రికెటర్‌కు మళ్లీ టీమ్‌ఇండియాలోకి పిలుపు రావడం అంటే చాలా గొప్ప. కానీ, ఆ చాన్స్‌ను క్రికెటర్ కాలదన్నుకున్నాడు.
టీమ్‌ఇండియా క్రికెటర్లలో వన్డేల్లో డబుల్ సెంచరీ చేసినవారు సచిన్‌టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ప్రస్తుత టెస్టు కెప్టెన్ శుభమన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మాత్రమే. గిల్‌తో పాటు దిగ్గజాల సరసన చోటు దక్కించుకున్న ఇషాన్ జాతీయ జట్టులో కుదరుకున్నట్లే కనిపించాడు. దూకుడు, టెక్నిక్ రెండూ ఉన్న అతడు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున మెరుపులు మెరిపించాడు. వన్డే ప్రపంచ కప్ (2023) జట్టులోనూ ఉన్నాడు. నాడు గిల్‌కు జ్వరం రావడంతో కిషన్‌ను తుది జట్టులో ఆడించారు. అతడు విఫలం కావడం, గిల్ కోలుకోవడంతో తుది జట్టులో చోటు దక్కలేదు. ఇది ఏ ఆటగాడికైనా సహజం. కానీ, దీనిని కిషన్ నెగిటివ్‌గా తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. జట్టులో అతడి ప్రవర్తన తేడాగా ఉందని కథనాలు వచ్చాయి. అయితే, ప్రపంచకప్ ముగిశాక బీసీసీఐ దేశవాళీలు ఆడాలని సూచించింది. కానీ, కిషన్ దానిని ఎగ్గొట్టాడు. దుబాయ్‌లో పార్టీలో హాజరయ్యాడు. ముంబై ఇండియన్స్ నెట్స్‌లో కనిపించాడు. ఇది బీసీసీఐకి మరింత కోపం తెప్పించింది. అతడిని దాదాపు పక్కనపెట్టింది. సెంట్రల్ కాంట్రాక్టు కూడా ఇవ్వలేదు. కిషన్‌తో పాటే ప్రపంచకప్ ఆడి అతడిలాగానే క్రమశిక్షణ ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొన్న శ్రేయస్ అయ్యర్‌ను బోర్డు క్షమించింది. కాంట్రాక్టు ఇచ్చింది. కిషన్‌ను మాత్రం పట్టించుకోలేదు. అయితే, ఈ ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తరఫున ఐపీఎల్‌లో, దేశవాళీలు, భారత ఏ జట్టు తరఫున మంచి ప్రదర్శనలు చేయడంతో అతడిపై బోర్డు దృక్పథం మారింది.
తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయపడడంతో ఇషాన్‌కు సెలక్టర్లు కాల్ చేశారని సమాచారం. కానీ, అతడు ఇటీవల స్కూటీ నుంచి కిందపడడంతో చీలమండ గాయానికి గురయ్యాడట. దాదాపు పది కుట్లు పడినట్లు సమాచారం. దీంతో టీమ్ ఇండియాతో కలవలేనని సమాధానం ఇచ్చాడట. అలా అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని అతడు కాలదన్నుకున్నాడు.
