ధోనీ నా కెరీర్ నాశనం చేశాడు... స్టార్ ఆల్ రౌండర్ సంచలన ఆరోపణ
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ అత్యంత విజయవంతమైన సారథుల్లో ఒకడు.. దాదాపు పదేళ్లు జట్టు టి20, వన్డే కెప్టెన్ గా వ్యవహరించాడు.
By: Tupaki Desk | 15 Aug 2025 4:52 PM ISTటీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ అత్యంత విజయవంతమైన సారథుల్లో ఒకడు.. దాదాపు పదేళ్లు జట్టు టి20, వన్డే కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ క్రమంలో ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు. టి20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్ లు సాధించిపెట్టాడు. 2013లో చాంపియన్స్ ట్రోఫీనీ గెలిపించాడు. ఇక, ధోనీ హయాంలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి ఎందరో గొప్ప క్రికెటర్లు జట్టులోకి వచ్చారు. దేశం గర్వించదగ్గ రికార్డులను నెలకొల్పారు. అయితే, ధోనీపైన కొన్ని ఆరోపణలున్నాయి. వాటిలో మాజీ డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ ఒకరు. 2011 ప్రపంచ కప్ ఫైనల్లో తన కుమారుడి కంటే ధోనీ ముందుగా బ్యాటింగ్ కు దిగి పేరు కొట్టేశాడనేది ఆయన విమర్శ. ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా కొన్నిసార్లు ధోనీని తప్పుబట్టినట్లే కనిపిస్తాడు. మాజీ కెప్టెన్ గురించి పెద్దగా సానుకూలంగా కనిపించడు.
వారికి జతగా ఇతడు..
ఇప్పుడు ధోనీపై ఆరోపణలు చేసేవారి జాబితాలో మరో మాజీ క్రికెటర్ చేరాడు. అతడే మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. ధోనీ కారణంగానే తన అంతర్జాతీయ కెరీర్ నాశనమైందని చెప్పుకొచ్చాడు. బాగా ఆడినా జట్టు నుంచి తనను తప్పించాడని ఆరోపించాడు. ఎడమచేతివాటం స్వింగ్ పేసర్ అయిన ఇర్ఫాన్ 2003-04 ఆస్ట్రేలియా టూర్ కు తొలిసారి ఎంపికయ్యాడు. నాడు అద్బుత ప్రదర్శన చేసిన ఇర్ఫాన్ కీలక ఆటగాడిగా ఎదిగాడు. అయితే, 2009లో అకస్మాత్తుగా జట్టుకు దూరం కాగా, 2012లో చివరి మ్యాచ్ ఆడాడు.
బాగా ఆడుతున్నా...
అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా కూడా ఇర్ఫాన్ పఠాన్ తనకు అవకాశాలు తక్కువగా వచ్చాయని వ్యాఖ్యానించాడు. ఇప్పడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధోనీనే తనను జట్టులోని తీసుకోలేదని అప్పటి కోచ్ కిర్ స్టెన్ చెప్పాడని తెలిపాడు. అప్పట్లో శ్రీలంక టూర్ లో ఓ మ్యాచ్ ను ఇర్ఫాన్ పఠాన్ అతడి సోదరుడు యూసుఫ్ పఠాన్ మంచి ఇన్నింగ్స్ ఆడి గెలిపించారు. కానీ, ఆ తర్వాత ఏడాది పాటు పక్కన పెట్టారని, న్యూజిలాండ్ టూర్ లోనూ అవకాశం ఇవ్వలేదని ఇర్ఫాన్ వాపోయాడు. దీనికి కారణం ఏమిటని కిర్ స్టెన్ ను అడగ్గా.. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవని, తుది జట్టు ఎంపిక అధికారం కెప్టెన్ దే అని సమాధానం ఇచ్చినట్లు చెప్పాడు. రెండో కారణంగా.. ఏడో స్థానంలో బ్యాటింగ్ ఆల్ రౌండర్ ఉండాలని జట్టు భావిస్తున్నట్లు తెలిపాడు. ఆ ప్లేస్ యూసుఫ్ పఠాన్ కు ఇచ్చారు. అలా టీమ్ ఇండియాకు తాను దూరం అయినట్లు.. ఏది ఏమైనా తుది జట్టు ఎంపిక అధికారం కెప్టెన్ దే అని తాను ఒప్పుకొంటున్నానని చెప్పాడు.
వాస్తవం ఇది...
ఇర్ఫాన్ పఠాన్ ప్రతిభావంతుడే. మంచి స్వింగ్ బౌలర్ కూడా. అయితే, కాలక్రమంలో స్వింగ్ ను కోల్పోయాడు. మరీ ముఖ్యంగా గ్రెగ్ చాపెల్ టీమ్ ఇండియా కోచ్ గా వచ్చాక ఇర్ఫాన్ కెరీర్ తో ఆడుకున్నాడు. బౌలర్ గా కంటే బ్యాట్స్ మన్ గా అతడికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. చివరకు ఏ విధంగానూ జట్టుకు ఉపయోగకారి కాకుండా పోయాడు. చోటు కోల్పోయాడు.
