Begin typing your search above and press return to search.

ఈ సాలా కప్ నమదే.. ఐపీఎల్ జట్టు టైటిల్ ఆశలపై 'నీళ్లు'

ప్ర‌స్తుతం బెంగ‌ళూరు నీటి స‌మ‌స్య‌తో స‌త‌మతం అవుతోంది. ఈ ప్రభావం చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణపై పడుతుందనే కథనాలు వ‌స్తున్నాయి.

By:  Tupaki Desk   |   11 March 2024 10:45 AM GMT
ఈ సాలా కప్ నమదే.. ఐపీఎల్ జట్టు టైటిల్ ఆశలపై నీళ్లు
X

16 సీజన్లు గడిచాయి.. ప్రపంచంలోని మేటి బ్యాట్స్ మెన్ ఆ జట్టుకు ఆడారు.. గొప్ప బౌలర్లు సైతం ప్రాతినిధ్యం వహించారు.. ఉత్తమ ఆల్ రౌండర్లూ తమ వంతుగా పాటుపడ్డారు.. కానీ, ఇంతవరకు ఆ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ కొట్టలేకపోయింది. కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ తొలి ప్రయత్నంలోనే విజేతగా నిలిచింది. కానీ, ఇన్నేళ్లలో ఆ జట్టుకు మాత్రం సాధ్యం కాలేదు. మరి ఈసారైనా కప్ కొట్టేద్దాం అనుకుంటుండగా.. నేచర్ పగబట్టింది. సొంతగడ్డపై మ్యాచ్ లు ఆడకుండా చేసేలా ఉంది.

ఫ్యాన్స్ కు నిరాశేనా?

ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత ఐపీఎల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అభిమానులు ఆర్సీబీ అంటూ ముద్దుగా పిలుచుకునే ఆ జట్టుకు కెరీర్ మొదటి నుంచి ఆడుతున్నాడు ప్రపంచ దిగ్గజ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి. 2008లో అతడు 19 ఏళ్ల కుర్రాడిగా లీగ్ లో అడుగుపెట్టాడు. వెనక్కుతిరిగి చూస్తే కోహ్లి ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు. కానీ, ఆర్సీబీ మాత్రం ఐపీఎల్ విన్నర్ కాలేకపోయింది. 17వ సీజన్ లో అయినా ఈ కోరిక తీరుతుందని అభిమానులు ఆశిస్తుంటే నేచర్ మాత్రం సహకరించేలా లేదు. బెంగ‌ళూరులో ఐపీఎల్ మ్యాచ్‌ ల నిర్వ‌హ‌ణ‌పై సందిగ్ధం నెలకొనడమే దీనికి కారణం. ఐపీఎల్ 17వ సీజ‌న్‌ ఈ నెల 22 నుంచి మొదలుకానున్న సంగతి తెలిసిందే. అయితే, సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీసీసీఐ 21 మ్యాచ్‌ ల షెడ్యూల్‌ మాత్ర‌మే విడుద‌ల చేసింది. షెడ్యూల్ ప్ర‌క‌ట‌న అనంత‌రం మిగిలిన మ్యాచ్‌ ల తేదీలు ప్రకటిస్తుంది. అయితే.. ఇప్ప‌డు ఓ చిక్కు వ‌చ్చి ప‌డింది.

"నీటి బెంగ"ళూరు

ఉద్యాన నగరంగా పేరొందిన బెంగళూరు.. భారత సాఫ్ట్ వేర్ రాజధాని. అలాంటిచోట ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌ ల నిర్వ‌హ‌ణ‌ కష్టమే అన్నట్లుంది. ప్ర‌స్తుతం బెంగ‌ళూరు నీటి స‌మ‌స్య‌తో స‌త‌మతం అవుతోంది. ఈ ప్రభావం చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణపై పడుతుందనే కథనాలు వ‌స్తున్నాయి. ఆర్‌సీబీకి చిన్న‌స్వామి సొంత స్టేడియం.ఈ సీజ‌న్‌ లో బెంగ‌ళూరు త‌న మొద‌టి మ్యాచ్‌ ఈ నెల 25న పంజాబ్ కింగ్స్‌తో ఆడ‌నుంది. క్రికెట్ పిచ్‌ లను సిద్ధం చేసేందుకు భారీగా నీటి అవ‌స‌రం ఉంటుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో నీటి ల‌భ్య‌త పై క‌ర్ణాట‌క రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) రంగంలోకి దిగింది. 2 వారాల్లో మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉన్న నేప‌థ్యంలో నీటి ఎద్ద‌డిపై చ‌ర్చించేందుకు సమావేశం అవుతోంది. మ్యాచ్ లు నిర్వహించాలా వద్దా? అని ఓ నిర్ణ‌యం తీసుకోనుంది.

వర్షాభావ పరిస్థితుల కారణంగా బెంగళూరు నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. కొన్ని వారాలుగా ట్యాంకర్ల కు డిమాండ్ బాగా పెరిగింది. ఒక ట్యాంకర్ ధర గతంలో రూ.700-800 ఉండగా ఇప్పుడు రెండింతలు వసూలు చేస్తున్నారు. మరోవైపు జనం నీళ్లు లేక షాపింగ్ మాల్స్ కు వెళ్లి అవసరాలు తీర్చుకుంటున్నారు. సాక్షాత్తు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా తమ ప్రాంతంలో నీటి ఎద్దడి ఉందని చెప్పడం గమనార్హం.