Begin typing your search above and press return to search.

ఎన్నో మలుపులు మరెన్నో మెరుపులు... ఐపీఎల్ తొలి మ్యాచ్ విశేషాలివే!

ఐపీఎల్ 17వ సీజన్‌ అంగరంగ వైభవంగా మొదలైంది. ఈ సీజన్ లో భాగంగా తొలి మ్యాచ్‌ లో చెన్నై, బెంగళూరు మధ్య రసవత్తరంగా జరిగింది.

By:  Tupaki Desk   |   23 March 2024 4:05 AM GMT
ఎన్నో మలుపులు మరెన్నో మెరుపులు...  ఐపీఎల్  తొలి మ్యాచ్  విశేషాలివే!
X

ఐపీఎల్ 17వ సీజన్‌ అంగరంగ వైభవంగా మొదలైంది. ఈ సీజన్ లో భాగంగా తొలి మ్యాచ్‌ లో చెన్నై, బెంగళూరు మధ్య రసవత్తరంగా జరిగింది. ఈ మ్యాచ్ లో చాలా మంది అంచనాలకు న్యాయం చేస్తూ రుతురాజ్ సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తొలి విక్టరీని నమోదు చేసింది. ఈ క్రమంలో... ఆధ్యాంతం ఎన్నో మలుపులు, మరెన్నో మెరుపులతో సాగిన ఈ మ్యాచ్ ఎలా మొదలై ఎలా ముగిసిందనేది ఇప్పుడు చూద్దాం...!

డూప్లెసిస్ దూకుడు:

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు తొలి నుంచీ దుకుడుగా ఆడింది. ఇందులో భాగంగా ఫోర్లతోనే మొదలుపెట్టిన కెప్టెన్ డుప్లెసిస్‌... 3 ఓవర్లో నాలుగు ఫోర్లు కొట్టి మైదానంలో వేడి పెంచాడు. ఈ క్రమంలో ఐదో ఓవర్ మూడో బంతికి ముస్తాఫిజుర్‌ వేసిన బంతికి రచిన్ రవీంద్ర అద్భుతమైన క్యాచ్ తీసుకోవడంతో దూకుడు మీదున్న డుప్లెసిస్‌ (35) వెనుదిరుగాడు.

ఒక్క పరుగు తేడాలో మూడు వికెట్లు:

ఈ క్రమంలో డూప్లెసిస్ అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన రజిత్ పటిదార్ (0) ముస్తాఫిజూర్ వేసిన అదే ఓవరు ఆఖరు బంతికి ధోనీకి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. దీంతో... బెంగళూరు 5 ఓవర్లు పూర్తయ్యే సరికి 41 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన మ్యాక్స్‌ వెల్ ను దీపక్‌ చాహర్‌ బోల్తా కొట్టించాడు. వికెట్ కీపర్‌ ధోనీకి క్యాచ్‌ ఇచ్చిన మ్యాక్స్ వెల్ గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. దీంతో పవర్‌ ప్లే ముగిసేసరికి బెంగళూరు స్కోరు 42/3 గా మారిపోయింది.

విరాట్ ఫస్ట్ సిక్స్.. రహానే హైలైట్ క్యాచ్:

ఈ పరిస్థితుల్లో కోహ్లీ, కామెరూన్ గ్రీన్‌ లు కాస్త ఆచి తూచి ఆడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో 10 ఓవర్ రెండో బంతికి ఐపీఎల్ 17లో మొదటి సిక్స్ నమోదైంది. మహేష్ తీక్షణ బౌలింగ్ లో పుల్ షాట్ ఆడి సిక్స్ బాదాడు కొహ్లీ. ఈ క్రమంలో 12వ ఓవర్లో ముస్తాఫిజుర్‌ వేసిన రెండో బంతికి కొహ్లీ ఆడిన పుల్ షాట్ లో బంతిని బౌండరీ ముందు అజంక్యా రహానే క్యాచ్ పట్టి అవుట్ చేశాడు. ఈ క్యాచ్ ఈ మ్యాచ్ లోనే హైలెట్ గా నిలిచింది!

మరోసారి ముస్తాఫిజుర్ డబుల్ స్ట్రోక్:

ఇదే క్రమంలో 12 ఓవర్ 4వ బంతికి ముస్తాఫిజుర్ వేసిన స్లో డెలివరీకి కామెరాన్ గ్రీన్ 18 పరుగులకు క్లీన్ బౌల్డ్ అయ్యి వెనుదిరిగాడు. దీంతో... మరోసారి ఒకే ఓవర్ లో ముస్తాఫిజుర్ రెండు వికెట్లు తీసినట్లయ్యింది. ఈ పరిస్థితుల్లో 13 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు 79 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది.

చివరి ఐదు ఓవర్లలో గేరు మార్చిన బెంగళూరు:

15 ఓవర్లకు 102 పరుగులకు 5 వికెట్లుగా ఉన్న దశలో దినేశ్ కార్తిక్, అనూజ్ రావత్ లు దూకుడు పెంచారు. తాడో పేడో అన్నట్లుగా బ్యాట్ ఝులిపించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో 16వ ఓవర్లో తొలి బంతికి ఫోరు, చివరి బంతికి సిక్స్ బాదగా... 18 వ ఓవర్ లోనూ ఒక సిక్స్ బాదాడు. క్రమంలో 18వ ఓవర్లో అనూజ్ రావత్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. 19 ఓవర్ లోనూ ఒక సిక్స్, ఒక ఫోర్ సాధించారు.

గౌరవం కాపాడిన దినేశ్ కార్తిక్‌, అనుజ్‌ రావత్!:

12వ ఓవర్లో 78 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన బెంగళూరును దినేశ్ కార్తీక్, అనూజ్ రావత్ అద్భుతంగా ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్ కు 50 బంతుల్లో 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిలో దినేష్ కార్తీక్ 38 (26 బంతుల్లో 3*4 - 2*6), అనూజ్ రావత్ 48 (25 బంతుల్లో 4*4 - 3*6) పరుగులు చేశారు. దీంతో... బెంగళూరు గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.

174 పరుగుల లక్ష్యం... నిలకడగా స్టార్ట్ అయిన చెన్నై ఇన్నింగ్స్‌!

174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఇన్నింగ్స్ ని రుతురాజ్‌ గైక్వాడ్‌, రచిన్‌ రవీంద్ర మొదలుపెట్టారు. ఈ క్రమంలో తొలి బంతికే గైక్వాడ్‌ ఫోర్‌ కొట్టడంతో పాటు ఐదో బంతికీ ఫోర్ కొట్టాడు. ఇలా 3 ఓవర్లకు స్కోరు 28 గా సాగింది. ఆ సమయానికి దూకుడు కెప్టెన్ గైక్వాడ్ 10, రచిన్‌ రవీంద్ర 22 పరుగులతో ఉన్నాడు.

తొలి వికెట్ గా సీఎస్కే కెప్టెన్:

సీఎస్కే బ్యాటింగ్ నిలకడగా సాగుతున్న నేపథ్యంలో... నాలుగో ఓవర్‌ లో చివరి బంతికి కామెరూన్‌ గ్రీన్‌ కు చిక్కాడు సీఎస్కే కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్! 4 ఓవర్లకు స్కోరు 38/1 గా ఉండగా... అప్పటికే దూకుడు మీదున్న రచిన్ రవీంద్ర 22 పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు. మరోపక్క అజింకా రహానే బ్యాటింగ్ కి దిగాడు!

దుమ్ములేపుతున్న రచిన్ రవీంద్ర ఔట్!

పవర్‌ ప్లే ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 62 పరుగులతో పటిష్టంగా కనిపించింది చెన్నై. పైగా... రచిన్ రవీంద్ర దుమ్ములేపుతున్నాడు. ఈ క్రమంలో 7 ఓవర్ చివరి బంతికి కర్న్ శర్మ బౌలింగ్ లో పుల్ షాట్ కి ప్రయత్నించిన రచిన్... రజిత్ పతిదార్ కి బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చి దొరికి పోయాడు. ఉన్నంత సేపు 247 స్ట్రైక్ రేట్ తో బెంగళూరు బౌలర్లపై ఆధిపత్యం చూపించిన రచిన్ రవీంద్ర 37 (15 బంతుల్లో 3*4 - 3*6) చేశాడు.

ఈ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 7 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 71 పరుగులు గా ఉంది. ఈ సమయంలో దూకుడు కొనసాగిస్తున్న రహానే 17 పరుగులతో క్రీజ్ లో ఉండగా మరోవైపు మిచెల్ ఉన్నాడు.

డారిల్ మిచెల్ మెరుపులు:

రచిన్ రవీంద్ర అవుట్ అనంతరం క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్... వచ్చీ రావడంతో సిక్స్‌ లు బాదడం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా కర్ణ్‌ శర్మ వేసిన తొమ్మిదో ఓవర్లో వరుసగా రెండు సార్లు నిల్చుని సిక్స్ లు కొట్టాడు. దీంతో 10 ఓవర్లలో చెన్నై స్కోరు 2 వికెట్లు కోల్పోయి 92 పరుగులు గా ఉంది. మిచెల్ (17), రహానే (21) పోటా పోటీగా బాదుతున్నారు!

మూడో వికెట్ గా రహానే:

ఫుల్ ఫాం లో ఉన్నట్లు కనిపించి, నిలకడగా ఆడిన అజింక్యా రహానే ఔటయ్యాడు. గ్రీన్ వేసిన 11 వ ఓవర్లో తొలి బంతికే సిక్స్ బాది, తర్వాత బంతికి మ్యాక్స్ వెల్ కి చిక్కాడు. ఈ క్రమంలో 19 బంతులు ఆడిన రహానే.. 2 సిక్స్ ల సాయంతో 27 పరుగులు సాధించాడు. అప్పటికి చెన్నై స్కోరు 3 వికెట్లు కోల్పోయి 99 పరుగులుగా ఉంది.

డారిల్ మిచెల్ ఔట్:

కామెరూన్‌ గ్రీన్ వేసిన 13 ఓవర్‌ లో మూడో బంతికి డారిల్ మిచెల్ (22) పటిదార్‌ కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన మిచెల్ ను బౌన్సర్లతో కంట్రోల్ చేసింది బెంగళూరు టీం. ఈ క్రమంలో పెరిగిన ఒత్తిడితో భారీ షాట్ కు ప్రయత్నించిన మిచెల్ 22 (18 బంతుల్లో 2*6) పరుగుల వద్ద ఈజీ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ క్రమంలో 13 ఓవర్లకు చెన్నై స్కోర్ 4 వికెట్లకు 114!

15 ఓవర్లకు చెన్నైకి ఒక క్లారిటీ!:

నిలకడగా ఆడుతున్న బ్యాటర్ల పుణ్యమాని చెన్నై 15 ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్లు నష్టపోయి 128 పరుగులు చేసింది. ఈ క్రమంలో చెన్నై విజయానికి 30 బంతుల్లో 46 పరుగులు అవసరమైన పరిస్థితుల్లో మ్యాచ్ ఉంది. ఈ సమయంలో అజయ్ జడేజా, శివం దుబేలు నిలకడాగా ఆడారు.

బోణీ కొట్టిన డిపెండింగ్ ఛాంపియన్!:

174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎల్లో స్క్వాడ్... 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు సాధించింది. చెన్నై బ్యాటర్స్ లో రవిచంద్రన్ అశ్చిన్ (37), శివం దుబే (34*), అజింక్యా రహానే (27), జడేజా (25*) టాప్ స్కోరర్స్ గా నిలిచారు.