Begin typing your search above and press return to search.

ఐపీఎల్-18 ప్లేఆఫ్స్.. ఎవరు ఎవరితో ఉండొచ్చు?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారయ్యాయి.. నాలుగో బెర్తును ముంబై ఇండియన్స్ కైవసం చేసుకుని.. ఆరోసారి టైటిల్ వేటకు సిద్ధం అంటోంది.

By:  Tupaki Desk   |   22 May 2025 5:32 PM IST
ఐపీఎల్-18 ప్లేఆఫ్స్.. ఎవరు ఎవరితో ఉండొచ్చు?
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారయ్యాయి.. నాలుగో బెర్తును ముంబై ఇండియన్స్ కైవసం చేసుకుని.. ఆరోసారి టైటిల్ వేటకు సిద్ధం అంటోంది. దీనికిముందు పాయింట్ల టేబుల్ ను చూస్తే 12 మ్యాచ్ ల చొప్పున ఆడిన గుజరాత్ టైటాన్స్ (18), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ 17 పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ముంబై 13 మ్యాచ్ లు ఆడి 16 పాయింట్లతో ఉంది. మరి వీటిలో టేబుల్ టాపర్ గా నిలిచేది ఎవరు? ఎవరు ఎవరితో ప్లేఆఫ్స్ లో తలపడే చాన్సుందో గమనిస్తే..

-గుజరాత్ కు లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లు ఉన్నాయి. ఈ రెండూ గెలిస్తే 22 పాయింట్లతో టేబుల్ టాపర్ అవుతుంది. ఒకటి గెలిస్తే 20 పాయింట్లతో నిలుస్తుంది.

-బెంగళూరుకు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నోతో మ్యాచ్ లు ఉన్నాయి. ఈ రెండూ గెలిస్తే 21 పాయింట్లకు చేరుతుంది.

-పంజాబ్ కు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తో రెండు మ్యాచ్ లు ఉన్నాయి. ఈ రెండూ గెలిస్తే 21 పాయింట్లకు వెళ్తుంది.

-ప్లేఆఫ్స్ క్వాలిఫై అయిన ఈ మూడు జట్లలో పంజాబ్ తప్ప మిగతా రెండూ ఆడబోయే రెండు మ్యాచ్ లు ప్లేఆఫ్స్ కు క్వాలిఫై కాని జట్లతోనే కావడం గమనార్హం.

-ఇక ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్ లు ఆడింది. ఈ జట్టుకు మిగిలింది ఒక్కటే మ్యాచ్ (పంజాబ్)తో. దీంట్లో గెలిస్తే 18 పాయింట్లకు చేరుతుంది.

-గుజరాత్, బెంగళూరు తదుపరి మ్యాచ్ లలో గెలిస్తే 22, 21 పాయింట్లతో టాప్2లో ఉంటాయి. ఒకటి మాత్రమే నెగ్గితే 20, 19 పాయింట్లతో నిలుస్తాయి. రెండూ ఓడితే ఇప్పుడున్నట్లు 18, 17 పాయింట్లతోనే ఉంటాయి.

-ఒకవేళ పంజాబ్ గనుక ఢిల్లీ, ముంబైపై గెలిస్తే 21 పాయింట్లకు చేరి టేబుల్ టాపర్ అవుతుంది. రెండూ ఓడితే 17 పాయింట్లతోనే ఉంటుంది. గుజరాత్, బెంగళూరు కూడా రెండూ ఓడిపోతే మూడు జట్లు వరుసగా 18, 17, 17 పాయింట్లతో నిలుస్తాయి. అప్పుడు రన్ రేట్ చూడాల్సి ఉంటుంది. అప్పుడు 2, 3 స్థానాలు పంజాబ్, బెంగళూరు మధ్య మారుతాయి. గుజరాత్, బెంగళూరు రెండూ ఓడి,

పంజాబ్ ఒక్కటి గెలిచినా 19 పాయింట్లతో టాప్ లో ఉంటుంది.

-ఇప్పుడు నాలుగో స్థానంలో ఉన్న ముంబైకి.. ఒక్కటే మ్యాచ్ అదీ పంజాబ్ కింగ్స్ తో ఉంది. దీంట్లో గెలిస్తే 18 పాయింట్లకు వెళ్తుంది. ఓడితే 16 పాయింట్లతోనే నాలుగో స్థానంలో ఉంటుంది.

-గుజరాత్, బెంగళూరు మిగతా రెండు మ్యాచ్ లు నెగ్గితే, పంజాబ్ ఒక్కటి (ఢిల్లీ) గెలిచినా వరుసగా 22, 19, 19 పాయింట్లతో వీటి స్థానాలు టాప్-3లోనే ఉంటాయి. ముంబై.. పంజాబ్ పై గెలిచినా 18 పాయింట్లకే పరిమితం అవుతుంది.

-ఈ విధంగా చూస్తే గుజరాత్-బెంగళూరు మొదటి ప్లేఆఫ్స్ ఆడతాయి. పంజాబ్-ముంబై ఎలిమినేటర్ లో తలపడతాయి. తొలి ప్లేఆఫ్స్ లో నెగ్గిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్తుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ విజేతతో రెండో ప్లేఆఫ్స్ లో ఆడుతుంది.

గమనిక: ఇదంతా ప్రస్తుతం ఆయా జట్ల ఫామ్ ఆధారంగా వేసిన అంచనా. జరగబోయే మ్యాచ్ లు వర్షంతో రద్దయినా, ఫలితాలు మారినా పైన చెప్పిన సమీకరణాలు మారుతాయి.