మళ్లీ ఎప్పుడొస్తావ్ ఐపీఎల్..? ఓ లేలేత కుర్రాడి భావోద్వేగ పిలుపు
పాకిస్థాన్ తో భారత్ యుద్ధం కారణంగా ఏకంగా లీగ్ నిరవధిక వాయిదా పడింది.
By: Tupaki Desk | 10 May 2025 1:00 AM IST9.. ఈ అంకెకు సంఖ్యా శాస్త్రంలో చాలా ప్రాధాన్యం ఉంటుంది... చాలామంది పెద్దలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం 9ని లక్కీ నంబర్ గా భావిస్తుంటారు.. తమ వాహనాలు, ఫోన్ నంబర్లకు 9 కలిసివచ్చేలా పెట్టుకుంటారు.
ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ ఎడిషన్.. 1+8 కూడితే 18.. మరోవైపు ఈ ఏడాది 2025. ఈ అంకెలను విడివిడిగా కూడితే 9. అంటే.. ఐపీఎల్ యవ్వనంలోకి వచ్చిందన్న మాట. దీనికితగ్గట్లే ఈ ఏడాది లీగ్ అద్భుతంగా సాగుతోంది.
17 సీజన్లుగా కప్ కొట్టని రాయల్ చాలెంజర్స్ బె0గళూరు (ఆర్సీబీ), ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ), పంజాబ్ కింగ్స్ వంటి జట్లు పాయింట్ల టేబుల్ లో పైన ఉన్నాయి. గురువారం ధర్మశాలలో మ్యాచ్ గనుక జరిగి.. పంజాబ్ గెలిచి ఉంటే ప్లేఆఫ్స్ చేరేది. ఢిల్లీ గెలిచినా ప్లేఆఫ్స్ కు బాగా దగ్గరయ్యేది. ఇక ఇప్పటికే దాదాపు ప్లేఆఫ్స్ చేరిన ఆర్సీబీ.. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)తో మ్యాచ్ లో నెగ్గితే టేబుల్ టాప్ లోకి వచ్చేది. కానీ, పాకిస్థాన్ తో భారత్ యుద్ధం కారణంగా ఏకంగా లీగ్ నిరవధిక వాయిదా పడింది.
చెన్నై, ముంబై, కోల్ కతా డామినెన్స్ పోవడంతో ఈ ఏడాది లీగ్ చాలా బాగా నడుస్తోంది. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ, పంజాబ్ లతో పాటు ఆర్సీబీ దూకుడు మీద ఉన్నాయి. తొలుత వెనుకబడినా ముంబై పుంజుకోవడంతో రేసు మరింత రసవత్తరం అయింది. అయితే, అనూహ్యంగా యుద్ధం వంటి పరిస్థితుల్లో లీగ్ ను ఆపేయాల్సి వచ్చింది.
ప్రస్తుతం 13-14 ఏళ్ల వయసుకు వచ్చిన కుర్రాళ్లకు ఇప్పుడిప్పుడే ఐపీఎల్ మజా ఏంటో తెలుస్తోంది. ఇలాంటి వాళ్లంతా ఇప్పుడు అయ్యో అంటున్నారు. మళ్లీ ఐపీఎల్ ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు. కాగా, లీగ్ లో ప్లేఆఫ్స్, ఫైనల్స్ సహా ఈ ఏడాది ఇంకా 16 మ్యాచ్ లు నిర్వహించాల్సి ఉంది.
వాయిదా పడిన లీగ్ ను సెప్టెంబరు-అక్టోబరులో నిర్వహించే చాన్సుందని చెబుతున్నారు. ఈ కాలంలో వాస్తవానికి ఆసియా కప్ జరగాల్సి ఉంది. భారత్-పాక్ ఉద్రిక్తతల రీత్యా ఈ కప్ జరగడం కష్టమే. దాని స్థానంలో ఐపీఎల్ మ్యాచ్ లను పెట్టాలని భావిస్తున్నారు. మరి ఈ సమయంలో విదేశీ జట్ల ఆటగాళ్లు అందుబాటులో ఉంటారో లేదో?
మొత్తానికి మెగా లీగ్ నుంచి సంచలనంతో మొదలై.. 14ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, 17 ఏళ్ల ఆయుష్ మాత్రే మెరుపులతో ఓ వెలుగు వెలిగి.. మాంచి మజా అందించిన ఐపీఎల్ 2025 ఇలా అర్ధంతరంగా ఆగిపోవడం ఊహించని షాకే.