Begin typing your search above and press return to search.

ఐపీఎల్ - 2024... ఈ కొత్త నిబంధనలు తెలుసా?

క్రికెట్ లో రివ్యూలు కోరడం అనేది అత్యంత కీలకంగా మారుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 March 2024 9:13 AM GMT
ఐపీఎల్ - 2024... ఈ కొత్త నిబంధనలు తెలుసా?
X

గత 16 ఏళ్లుగా క్రికెట్ అభిమానులకు.. ప్రత్యేకంగా క్రికెట్ ను ఒక మతంగా భావిస్తారనే పేరున్న భారత్ లోని క్రికెట్ అభిమానులకు గొప్ప వినోదాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ఐపీఎల్ - 2024 సరికొత్తగా రెడీ అయిపోయింది. ఈ సమయంలో తాజా ఐపీఎల్ లో కొత్తగా కొన్ని నిబంధనలు అమలులోకి వచ్చాయి. సో... ఆ కొత్త నిబంధనలు ఏమిటి.. అవి కొన్ని సందర్భాల్లో ఎంత కీలకంగా మారే అవకాశం ఉందనేది ఇప్పుడు చూద్దా..!

రివ్యూ సిస్టం:

క్రికెట్ లో రివ్యూలు కోరడం అనేది అత్యంత కీలకంగా మారుతున్న సంగతి తెలిసిందే. అంపైర్లు తీసుకునే నిర్ణయాలు మరింత పారదర్శకంగా ఉండటం కోసం ఈ నిబంధనలు తెరపైకి వచ్చాయి. ఈ సమయంలో గత ఏడాది ఐపీఎల్ లో ప్రవేశపెట్టబడిన... వైడ్, నోబాల్స్ కు రివ్యూ కోరే నిబంధనను ఈసారి కూడా కంటిన్యూ చేయనున్నారు. ఇదే సమయంలో... దీనికి తోడు ప్రతీ జట్టుకూ అదనంగా రెండు రివ్యూలు అందుబాటులో ఉంటాయి!

ఓవర్‌ కు రెండు బౌన్సర్లు:

ఫాస్ట్ బౌలర్స్ కి బౌన్సర్లు ఒక మంచి అవకాశంగా చెబుతుంటారు. బ్యాట్స్ మెన్స్ పై ఒత్తిడి కలిగించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయనే చెప్పవచ్చు. ఈ క్రమంలో... సాధారణంగా టీ20 క్రికెట్ లో బౌలర్ లు ఒకే బౌన్సర్ వేసే అవకాశం ఉంటుంది. అయితే... తాజా ఐపీఎల్ లో ఓవర్ కు రెండు బౌన్సర్లు వేయడానికి అనుమతి ఉంది. దీంతో.. కీలక సమయంలో ఈ బౌన్సర్ల నిబంధన ఆయా ఫాస్ట్ బౌలర్లకు బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు.

స్టాప్‌ క్లాక్‌ నిబంధన:

ఓవర్ కి ఓవర్ కి మధ్య 60 సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకోకూడదనే నిబంధన ఇటీవల తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని స్టాప్ క్లాక్ నిబంధన అని అంటారు. అయితే... తాజాగా ఐపీఎల్ లో దీన్ని అమలుచేయడం లేదు. సమయం ఆదా అవుతుందనే ఉద్దేశ్యంతో... ఫీల్డింగ్‌ జట్టు ఒక ఓవర్‌ అయిన 60 సెకన్లలోపే ఓవర్‌ ను మొదలుపెట్టాల్సి ఉంటుందనే నిర్ణయాన్ని ఐసీసీ తీసుకొచ్చింది. కానీ... ఐపీఎల్ - 17లో ఈ రూల్ లేదు!

స్మార్ట్‌ రీప్లే సిస్టం:

అంపైర్‌ తీసుకునే నిర్ణయాలపై మరింత స్పష్టత కోసం స్మార్ట్‌ రీప్లే సిస్టంను అమలుచేయబోతోంది బీసీసీఐ. దీని ప్రకారం... మైదానంలో ఉన్న ఎనిమిది హైస్పీడ్ కెమెరాల నుంచి వచ్చే ఫీడ్ నేరుగా టీవీ అంపైర్ కు చేరుతుంది. ఈ సమయంలో టీవీ అంపైర్, హాక్ ఐ ఆపరేటర్ల మధ్య కాన్వర్జేషన్ ను కూడా వీక్షకులు వినవచ్చు. దీంతో... నిర్ణయాల్లో పారదర్శకత పెరుగుతుంది. ఇదే సమయంలో అంపైర్ తీసుకున్న నిర్ణయం ఎలా తీసుకున్నారనేది కూడా తెలుస్తుంది.

ఇలాంటి సరికొత్త నిబంధనలతో జరబోతున్న ఐపీఎల్-17 మరెంత రసవత్తరంగా జరగబోతుందనేది వేచి చూడాలి!