అమ్మకానికి చాంపియన్ ఆర్సీబీ..? వారంలోనే సంచలనం
ఆర్సీబీ మొన్నటివరకు చాంపియన్ కాకపోవచ్చు.. కానీ, ఈ జట్టుకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉంది. ఐపీఎల్ టైటిల్ ను ఐదుసార్లు సాధించిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కు ఏమాత్రం తక్కువ కాని జట్టు ఆర్సీబీ.
By: Tupaki Desk | 10 Jun 2025 3:35 PM IST17 సీజన్ల తర్వాత.. ఎట్టకేలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విజేతగా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఆ వెంటనే చేదు అనుభవం ఎదురైంది. టైటిల్ కొట్టి 24 గంటలు గడవకముందే సొంత నగరం బెంగళూరులో తలపెట్టిన విజయోత్సవం విషాదానికి దారితీసింది. గత బుధవారం బెంగళూరులోని ప్రఖ్యాత చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 50 మంది వరకు గాయపడిన ఈ ఘటనపై పెద్ద దుమారమే రేగింది. అది చల్లబడుతోందని భావిస్తున్న సమయంలో తాజాగా ఏకంగా ఆర్సీబీ అమ్మకానికి ఉందనే కథనాలు, ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి.
ఆర్సీబీ మొన్నటివరకు చాంపియన్ కాకపోవచ్చు.. కానీ, ఈ జట్టుకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉంది. ఐపీఎల్ టైటిల్ ను ఐదుసార్లు సాధించిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కు ఏమాత్రం తక్కువ కాని జట్టు ఆర్సీబీ. అలాంటి ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టడం అంటే పెద్ద సంచలనమే. విరాట్ కోహ్లి వంటి స్టార్ బ్యాట్స్ మన్ మరో రెండు, మూడేళ్లయినా ఆర్సీబీకి ఆడతాడు. కాబట్టి ఆర్సీబీకి కనీసం మూడేళ్లు క్రేజ్ ఉంటుందని భావించాలి. ఇక మొత్తం ఫ్రాంచైజీని కాని.. కొంత వాటాను కాని అమ్మేందుకు యాజమాన్యం నిర్ణయించిందట. ఈ ప్రకారం ఫ్రాంచైజీ విలువను రూ.16 వేల కోట్లుగా నిర్ణయించారు.
ఆర్సీబీ ప్రస్తుతం బ్రిటిష్ డిస్టిలర్, యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ మదర్ కంపెనీ డియోజియో పీఎల్సీ చేతిలో ఉంది. కాగా, ఒకప్పుడు ఆర్సీబీ పరారీలో ఉన్న బడా వ్యాపారి విజయ్ మాల్యాకు చెందినదనే సంగతి తెలిసిందే. తన రాయల్ చాలెంజర్స్ బ్రాండ్ ను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లే ఉద్దేశంలో మాల్యా క్రికెట్ లోకి ప్రవేశించినట్లు చెబుతారు. మరి అలాంటి మాల్యా వివిధ కారణాలతో బ్యాంకులకు రూ.9 వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారు. ఆ అప్పులను తీర్చేశానని.. స్వదేశానికి వచ్చేందుకు అనుమతించాలని ఇప్పుడు కోరుతున్నారు.
మాల్యా నుంచి ఆర్సీబీ ఫ్రాంచైజీ డియోజియో పీఎల్సీకి మారింది. ఇప్పుడు 16 వేలకోట్లు వెచ్చించి కొనేదెవరు..? అసలు ఆర్సీబీ అమ్మకం వార్తలు నిజమేనా? మొత్తం అమ్ముతున్నారా? కొంత భాగమా..? ఇవన్నీ నిర్ధారణ కావాలంటే స్పష్టమైన ప్రకటన రావాల్సిందే.