అభిమానులూ ఊపిరి పీల్చుకోండి.. ఐపీఎల్ మళ్లొచ్చింది?
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మళ్లీ ప్రాణం పోసుకుంది.
By: Tupaki Desk | 10 May 2025 7:26 PM ISTక్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మళ్లీ ప్రాణం పోసుకుంది. అత్యంత రసవత్తరంగా సాగుతున్న 18వ సీజన్.. పాకిస్థాన్ పై భారత్ తలపెట్టిన యుద్ధం కారణంగా అర‍్థంతరంగా ఆగిపోయింది.. దాదాపు 80 శాతం మ్యాచ్ లు పూర్తయిన సమయంలో.. గత గురువారం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ‍్య జరుగుతున్న మ్యాచ్ అర్థంతరంగా ఆగిపోయింది.
ధర‍్మశాల మైదానం జమ్మూ నగరానికి కేవలం 200 కిలోమీటర్లలోపే ఉండడంతో కొంత మ్యాచ్ జరిగాక నిలిపివేశారు. శుక్రవారం లక్నోలో లక్నోసూపర్ జెయింట్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ కు ముందే మొత్తం లీగ్‌ను ఆపివేశారు.
ఐపీఎల్-18ను మొత్తానికే వాయిదా వేస్తున్నట్లు ప్రచారం జరిగినా.. వారం రోజులు వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. పైకి వారం రోజులు అని చెప్పినా ఆ తర్వాత కూడా లీగ్ కొనసాగేది అనుమానమే అనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ,తాజాగా అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో ఐపీఎల్‌కు ఆటంకాలు తొలగినట్లు అయింది.
ఎప్పటినుంచి ప్రారంభిస్తారు?
ఐపీఎల్‌లో 58వ మ్యాచ్ గా మే 8న పంజాబ్-ఢిల్లీ మధ్య మ్యాచ్ మధ్యలో ఆగిపోయింది. ఇదిగాక మరో 16 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. మే 25న ఫైనల్ తో లీగ్ ముగియాల్సి ఉంది. గురు,శుక్ర, శనివారాల్లో ఆగిన మ్యాచ్‌లను మళ్లీ నిర్వహించాల్సి ఉంది. అలాగని ఆదివారం నుంచి వెంటనే లీగ్ ను పునరద్ధరిస్తారని కూడా చెప్పలేం.
శనివారం మ్యాచ్ సన్ రైజర్స్-హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ‍్య ఉప్పల్ లో జరగాల్సి ఉంది. ఆదివారం పంజాబ్ -ముంబై ఇండియన్స్ అహ్మదాబాద్ లో (మార్చిన వేదిక) తలపడాల్సి ఉంది. కానీ, ఆదివారం నుంచే లీగ్ పునరుద్ధరణ అంటే కష్టమేనేమో? యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినా వీలు కాదు. ఎందుకంటే.. పంజాబ్ ఆటగాళ్లు ధర్మశాల నుంచి రైల్లో ఢిల్లీకి వచ్చారు. సోమవారం ఢిల్లీ-గుజరాత్ టైటాన్స్ ఢిల్లీలో ఆడాల్సి ఉంది. ఏమైనా అసాధారణ ఏర్పాట్లు చేస్తే తప్ప ఈ మ్యాచ్ నుంచి నిర్వహణ సాధ్యం అవుతుందేమో?
మొత్తానికి వచ్చేవారం నుంచి రీ షెడ్యూల్ చేసినా.. ఇప్పటికే కొందరు విదేశీ ఆటగాళ్లు ప్రయాణ ఏర్పాట్లలో ఉన్నారు. వీరందరినీ ఆపాల్సి ఉంటుంది. బీసీసీఐ నుంచి ఏం అప్‌డేట్ వస్తుందో చూద్దాం.
