సంక్షోభాల్లోనూ ఐపీఎల్ సూపర్ హిట్.. కానీ, ఈ ఆటగాళ్లు సూపర్ ఫ్లాప్
అందులో రికార్డు స్థాయి ధర రూ.27 కోట్లు వెచ్చించి టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
By: Tupaki Desk | 4 Jun 2025 6:46 PM ISTఐపీఎల్ లో రికార్డు ధర పలికిన ఆటగాడు విఫలం అవుతుంటాడు అనే పేరుంది. చాలా సీజన్లలో ఇది నిరూపితం అయింది. ఈసారి కూడా..
బహుశా ఇప్పటివరకు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్లు అన్నింటిలోనూ 18వ సీజన్ చాలా స్పెషల్ అని చెప్పాలేమో? మెగా వేలం నుంచే రికార్డుల మోతతో.. సీజన్ జరుగుతుండగా అనేక సంచలనాలతో.. మధ్యలో భారత్-పాక్ యుద్ధంతో.. చివర్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజేతగా నిలవడంతో ఐపీఎల్ 18 అదరగొట్టేసింది. 17 ఏళ్లుగా ఎన్నికలు, కొవిడ్ మహమ్మారి ఎదురైనా ఎన్నడూ లీగ్ మధ్యలో ఆగింది లేదు. కానీ, ఈసారి మాత్రం పెహల్గాంలో పర్యటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేయడం ఐపీఎల్ పై ప్రభావం చూపింది. పాకిస్థాన్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్దింది. దీంతో ఐపీఎల్ అనూహ్యంగా 8 రోజులు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమయ్యాక.. కొందరు విదేశీ ఆటగాళ్లు రాకున్నా, లీగ్ దిగ్విజయంగా ముగిసింది.
తాజాగా ఆర్సీబీ విజేతగా నిలవడంతో సీజన్ సూపర్ సక్సెస్ అయింది.
అయితే, సీజన్ 18కి సంబంధించి గత ఏడాది నవంబరులో మెగా వేలం జరిగింది. అందులో రికార్డు స్థాయి ధర రూ.27 కోట్లు వెచ్చించి టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. గత సీజన్ లో కెప్టెన్ గా వ్యవహరించిన మరో టీమ్ ఇండియా స్టార్ కేఎల్ రాహుల్ ను వద్దనుకుని మరీ పంత్ ను తెచ్చుకుని కెప్టెన్ ను చేసింది లక్నో. కానీ, పంత్ ఘోరంగా విఫలమయ్యాడు. చివరి మ్యాచ్ లో సెంచరీ మినహా అతడు మంచి ఇన్నింగ్స్ ఆడలేదు. దీంతో లక్నో ప్లేఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది.
-గత సీజన్ లోనూ మిచెల్ స్టార్క్ ను రూ.24.75 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది కోల్ కతా. అతడు మోస్తరు ప్రదర్శనే చేశాడు.
-2023లో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ శామ్ కరన్ ను రూ.18.50 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది. కానీ, కరన్ విఫలమయ్యాడు.
-2022లో ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కు రూ.15.25 కోట్లు పెట్టింది. అతడూ తీవ్రంగా నిరాశపరిచాడు.
-2021లో దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ పై రూ.16.25 కోట్లు పెట్టగా.. ప్చ్ అనిపించాడు.
-ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్ ను 2020లో కోల్ కతా నైట్ రైడర్స్ రూ.15.50 కోట్లకు కొనుగోలు చేస్తే మోస్తరుగా అయినా రాణించలేదు.
-2019లో పేసర్ జైదేవ్ ఉనద్కత్ ను రాజస్థాన్ రాయల్స్ రూ.8.40 కోట్లకు తీసుకుంది. కానీ, ఈ పేసర్ తుస్ అనిపించాడు.
-2017లో స్టోక్స్ (రూ.14.50 కోట్లు), 2016లో వాట్సన్ (రూ.9.50 కోట్లు), 2015లో యువరాజ్ సింగ్ (రూ.16 కోట్లు) ఇలానే రికార్డు ధర పలికినా విఫలమయ్యారు.
