Begin typing your search above and press return to search.

ఐపీఎల్-18.. బాగా 'ఓవర్' అవుతోంది బాస్..

బుధవారం ఢిల్లీపై సందీప్ శర్మ 11 బంతులు వేశాడు. ఇందులో నాలుగు వైడ్లు, ఒక నోబాల్ ఉన్నాయి.

By:  Tupaki Desk   |   18 April 2025 8:30 PM
ఐపీఎల్-18.. బాగా ఓవర్ అవుతోంది బాస్..
X

క్రికెట్ లో ఓవర్ కు ఎన్ని బంతులు ఉంటాయి..? సహజంగా అయితే ఆరే కదా..? ఒకటీ అరా వైడ్ లు, నో బాల్స్ వేస్తే ఏడు లేదా ఎనిమిది పడతాయి.. కానీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మాత్రం ఓవర్ కు రెండు ఓవర్లు పడుతున్నాయి.. ఇది కూడా ఏ సాధారణ బౌలరో కాదు.. అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న బౌలర్లు కావడం గమనార్హం.

దేశవాళీల్లో అద్భుతంగా ఆడుతున్నప్పటికీ.. ఈ ఏడాది లీగ్ కు దూరం అవుతాడనుకున్న పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ అనూహ్యంగా లక్నో సూపర్ జెయింట్స్ కు ఆడుతున్నాడు. అయితే, కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో అతడు వరుసగా వైడ్లు వేశాడు. దీంతో ఒక ఓవర్ లో 10కి పైగా బంతులు వేశాడు.

గత బుధవారం రాజస్థాన్ రాయల్స్ బౌలర్ సందీప్ శర్మ బౌలింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ ఓవర్ ను వేశాడు అతడు.

ఐపీఎల్ సుదీర్ఘ ఓవర్ రికార్డు గత సీజన్ వరకు బెంగళూరుకు ఆడిన హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ పేరిట ఉండేది. 2023లో ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో సిరాజ్ లాంగెస్ట్ ఓవర్ వేశాడు. 2023లోనే చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ తుషార్ దేశ్ పాండే లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో సిరాజ్ తో సమానంగా లాంగెస్ట్ ఓవర్ వేశాడు. వీరిద్దరినీ ఇప్పుడు సందీప్ శర్మ అధిగమించాడు.

బుధవారం ఢిల్లీపై సందీప్ శర్మ 11 బంతులు వేశాడు. ఇందులో నాలుగు వైడ్లు, ఒక నోబాల్ ఉన్నాయి. అంతకుముందు మూడు ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చిన సందీప్ చివరి ఓవర్లో 19 పరుగులు ఇచ్చాడు. తొలి బంతిని ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ పై వేసి ఓవర్ ను ప్రారంభించిన సందీప్.. మరుసటి బంతిని డాట్ వేశాడు. అయితే తర్వాత హ్యాట్రిక్ వైడ్లు వేశాడు. చివరగా ఓవర్ స్టెప్పింగ్ తో నోబాల్ వేశాడు.

ఈ సీజన్ లో శార్దూల్ కూడా కోల్ కతా పై 11 బంతులు వేశాడు. కాగా, బౌలర్లు ఇలా బంతులు వేయడం వెనుక అసలు కారణం.. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేయాలనుకోవడమే. తద్వారా బ్యాట్స్ మెన్ దూకుడుకు అడ్డుకట్ట వేయొచ్చనేది వారి ఉద్దేశం. కానీ, ఆ ప్రయత్నంలో బంతి వికెట్ కు దూరంగా వెళ్తూ వైడ్ అవుతోంది. ఇదీ ఐపీఎల్ లో ఓవర్ ‘ఓవర్’ అవడానికి కారణం.