Begin typing your search above and press return to search.

ఐపీఎల్ స్పెషల్..7 సిక్సుల బ్యాటింగ్ వీరుడు..6.8 అడుగుల బౌలింగ్ ధీరుడు!

ఇక తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దక్షిణాఫ్రికా పేసర్ లుంగీ ఎంగిడి స్థానంలో ఓ బౌలర్ ను తీసుకుంది. ఇతడు ఏకంగా 6.8 అడుగుల పొడగరి. పేరు బ్లెస్సింగ్ ముజరబ్బానీ.

By:  Tupaki Desk   |   27 May 2025 2:00 AM IST
ఐపీఎల్ స్పెషల్..7 సిక్సుల బ్యాటింగ్ వీరుడు..6.8 అడుగుల బౌలింగ్ ధీరుడు!
X

భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా ఉండి.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సజావుగా సాగి ఉంటే గనుక వారిద్దరూ అసలు లీగ్ లో ఆడి ఉండేవారు కాదేమో..? పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టడంతో లీగ్ వాయిదా పడడం.. తిరిగి పది రోజుల తర్వాత మొదలైనా కొందరు విదేశీ ఆటగాళ్లు తిరిగి రాలేకపోవడంతో రీప్లేస్ మెంట్లను చూడాల్సి వచ్చింది. ఇది కొందరు ఆటగాళ్లకు అనుకోని వరమే అయింది. మరీ ముఖ్యంగా ఇద్దరు స్పెషల్ ఆటగాళ్లకు.

ఓవర్ కు ఆరు సిక్సులు కొట్టడమే చాలా అరుదు.. అంతర్జాతీయ స్థాయిలో అయినా లీగ్ లలో అయినా అది కష్టం కూడా.. ఓ యువరాజ్ సింగ్, ఓ గిబ్స్ లాంటి వాళ్లకు మాత్రమే సాధ్యమైన ఫీట్ ఇది. కానీ, ఓ అఫ్ఘాన్ బ్యాటర్ ఓవర్ లో ఏడు సిక్సులు కొట్టాడు. అతడి పేరు సిద్ధిఖ్ ఉల్లా అటల్. కాబూల్ ప్రీమియర్ లీగ్ లో అతడు సిద్ధిఖ్ ఈ రికార్డు సాధించాడు. గత శనివారం ఇతడు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు. పంజాబ్ కింగ్స్ పై తన తొలి మ్యాచ్ లో 23 ఏళ్ల అటల్ 22 పరుగులు చేశాడు. ఎడమ చేతివాటం ఓపెనర్ అయిన అటల్.. అఫ్ఘాన్ తరఫున 9 చొప్పున వన్డేలు, టి20లు ఆడాడు. ఓ టెస్టు మ్యాచ్ లోనూ ప్రాతినిధ్యం వహించాడు. పైగా ఇతడిని ఢిల్లీ ఎవరి ప్లేస్ లో తీసుకున్నట్లు చూపిందో తెలుసా...? ఇంగ్లండ్ హార్డ్ హిట్టర్ హ్యారీ బ్రూక్ స్థానంలో. వ్యక్తిగత కారణాలు చెప్పి బ్రూక్ ఈ సీజన్ నుంచి తప్పుకొన్నాడు. అతడిపై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అటల్ ఆటను చూసే అవకాశం పెద్దగా లేనట్లే. ఎందుకంటే ఢిల్లీ ప్లేఆఫ్స్ చేరలేదు కాబట్టి.

ఇక తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దక్షిణాఫ్రికా పేసర్ లుంగీ ఎంగిడి స్థానంలో ఓ బౌలర్ ను తీసుకుంది. ఇతడు ఏకంగా 6.8 అడుగుల పొడగరి. పేరు బ్లెస్సింగ్ ముజరబ్బానీ. జింబాబ్వే రాజధాని హరారేలో పుట్టిన ముజరబ్బానీ.. 2017 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. మూడు ఫార్మాట్లలో 201 వికెట్లు తీశాడు. 28 ఏళ్ల ఈ పేసర్ 70 టి20లు, 55 వన్డేలు, 13 టెస్టులు ఆడాడు. వాస్తవానికి జింబాబ్వే ప్లేయర్లు ఎవరికీ ఐపీఎల్ లో పాల్గొనే అవకాశం రావడం లేదు. అంతర్జాతీయంగానూ ఆ జట్టు ప్రమాణాలు పడిపోవడంతో ఐసీసీ టోర్నీలకు అర్హత సాధించడం లేదు. 20 ఏళ్ల కిందట మంచి జట్టుగా ఎదుగుతున్న జింబాబ్వే ఆ దేశ పాలకుల కారణంగా వెనుకబడిపోయింది. అప్పుడప్పుడు కొన్ని మెరుపు విజయాలు తప్ప ప్రస్తుతం సెకండ్ గ్రేడ్ జట్టుగా మిగిలింది. అందుకే ఐపీఎల్ లో ఆ దేశ ఆటగాళ్లకు పాల్గొనే వీలు దొరకడం లేదు. ఈ దేశం నుంచే సికిందర్ రజా అనే ఆటగాడు ఐపీఎల్ కు ఎంపికవుతున్నా.. రజా పాకిస్థాన్ మూలాలు ఉన్నవాడు. నిరుడు పంజాబ్ కింగ్స్ ఆడినా.. ఈ ఏడాది అతడిని ఎవరూ తీసుకోలేదు.

బ్లెస్సింగ్ ముజరబ్బానీ 6.8 అడుగుల ఎత్తుతో దక్షిణాఫ్రికా పేస్ ఆల్ రౌండర్ మార్కొ యాన్సెన్ కు పోటీ వస్తున్నాడు. యాన్సెన్ 6.76 అడుగుల పొడగరి. అంటే.. ముజరబ్బానీనే కాస్త ఎత్తు అన్నమాట.