Begin typing your search above and press return to search.

44 ఏళ్ల ధోనీ vs 15 ఏళ్ల వైభవ్.. ఐపీఎల్ సమరంలో ఆసక్తికర వయసు అంతరం

మార్చి 28 నుంచి ప్రారంభమయ్యే ఈ సీజన్‌లో యువ ఆటగాళ్లపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

By:  A.N.Kumar   |   25 March 2026 4:00 PM IST
44 ఏళ్ల ధోనీ vs 15 ఏళ్ల వైభవ్.. ఐపీఎల్ సమరంలో ఆసక్తికర వయసు అంతరం
X

ఐపీఎల్ 2026 సీజన్ మరోసారి క్రికెట్ అభిమానుల్లో అపారమైన ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ టోర్నీకి ప్రత్యేకత ఏమిటంటే ఒకే వేదికపై అనుభవజ్ఞులైన దిగ్గజాలు.. కొత్తగా వెలుగులోకి వస్తున్న యువ ఆటగాళ్లు పోటీపడటం. ఈసారి మాత్రం ఆ తేడా మరింత స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ నుంచి 44 ఏళ్ల ఎంఎస్ ధోనీ వరకు ఉన్న 29 ఏళ్ల వయస్సు వ్యత్యాసం ఈ సీజన్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

మార్చి 28 నుంచి ప్రారంభమయ్యే ఈ సీజన్‌లో యువ ఆటగాళ్లపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. 2011లో జన్మించిన ఈ యువ ఆటగాడు, ఇప్పటికే తన ప్రతిభతో గుర్తింపు పొందాడు. గత సీజన్‌లో సెంచరీతో చెలరేగిన అతను.. ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని కసితో ఉన్నాడు. ఇటీవల అండర్-19 వరల్డ్ కప్ విజయంతో వచ్చిన ఆత్మవిశ్వాసం కూడా అతనికి బలంగా మారింది. అదే విధంగా సీఎస్‌కేకు చెందిన ఆయుష్ మాత్రే, ఆర్సీబీకి చెందిన సాత్విక్ దేశ్వాల్ వంటి యువ ఆటగాళ్లు కూడా ఈ సీజన్‌లో తమ ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఇక సీనియర్ల విషయానికి వస్తే వయసు కేవలం సంఖ్య మాత్రమే అని నిరూపిస్తున్న వారు ఇంకా మైదానంలో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా 44 ఏళ్ల వయసులోనూ ఎంఎస్ ధోనీ చూపిస్తున్న ఫిట్‌నెస్, నాయకత్వం అభిమానులను ఆకట్టుకుంటోంది. 2008 నుంచి ప్రతి ఐపీఎల్ సీజన్‌లో పాల్గొంటూ వస్తున్న ధోనీ ఈసారి కూడా తన అనుభవంతో జట్టుకు దిశానిర్దేశం చేయనున్నాడు. అతనికి ఇది చివరి సీజన్ కావొచ్చనే ప్రచారం నేపథ్యంలో అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తోంది.

అలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్లు కూడా తమ అనుభవంతో జట్లను ముందుకు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా కోహ్లీకి ఈ సీజన్ ఎంతో కీలకం. 2025లో ఆర్సీబీకి తొలి ఐపీఎల్ టైటిల్ అందించిన తరువాత డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన కోహ్లీ మరోసారి తన బ్యాటింగ్ ప్రతిభను నిరూపించేందుకు సిద్ధమయ్యాడు.

ఇంకా కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే, గుజరాత్ టైటాన్స్ పేసర్ ఇషాంత్ శర్మ వంటి అనుభవజ్ఞులు కూడా తమ సత్తా చాటాలని చూస్తున్నారు. సునీల్ నరైన్ వంటి మిస్టరీ స్పిన్నర్లు కీలక వికెట్లు తీసేందుకు సిద్ధంగా ఉన్నారు.

మొత్తానికి ఐపీఎల్ అనేది వయసుతో సంబంధం లేని టోర్నీ. ఇక్కడ ప్రతిభ, ఫామ్, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడే సామర్థ్యం మాత్రమే ముఖ్యం. ఒకవైపు యువత ఉత్సాహం, మరోవైపు సీనియర్ల అనుభవం కలిసిన ఈ ఐపీఎల్ 2026 సీజన్ క్రికెట్ అభిమానులకు మరపురాని అనుభవాన్ని అందించబోతుంది.