ఐపీఎల్ 2026 : బీసీసీఐ కొత్త నిబంధనల ఉచ్చు.. ఫ్రాంచైజీల్లో మొదలైన వణుకు!
ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో అట్టహాసంగా ప్రారంభం కానుంది.
By: A.N.Kumar | 25 March 2026 4:00 AM ISTప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో అట్టహాసంగా ప్రారంభం కానుంది. అయితే ఈసారి టోర్నీ కేవలం ఫోర్లు, సిక్సర్ల హోరుతోనే కాదు.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) విధించిన కఠిన నిబంధనలతోనూ వార్తల్లో నిలుస్తోంది. మార్చి 28న బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగనున్న ఆరంభ పోరుకు ముందే బోర్డు కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇది జట్ల వ్యూహాలపై , ఆటగాళ్ల అలవాట్లపై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తోంది.
విడతల వారీగా షెడ్యూల్.. కారణం అదేనా?
సాధారణంగా ఐపీఎల్ అంటే పూర్తి షెడ్యూల్ ఒకేసారి విడుదలవుతుంది. కానీ ఈసారి బీసీసీఐ కేవలం మొదటి 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను (మార్చి 28 నుండి ఏప్రిల్ 12 వరకు) మాత్రమే ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం వంటి రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా 2026 టీ20 వరల్డ్ కప్ తర్వాత పిచ్‌లకు విశ్రాంతి అవసరమని భావించి, మ్యాచ్‌ల నిర్వహణలో అత్యంత జాగ్రత్తలు వహిస్తున్నారు.
ప్రాక్టీస్ సెషన్లపై ఆంక్షల పర్వం
ఈ సీజన్‌లో జట్లకు ప్రాక్టీస్ చేయడం అంత సులభం కాకపోవచ్చు. గ్రౌండ్ కండిషన్స్ దెబ్బతినకుండా ఉండేందుకు బీసీసీఐ పలు పరిమితులు విధించింది. మ్యాచ్ రోజున పూర్తి స్థాయి ప్రాక్టీస్ సెషన్లకు అనుమతి లేదు. ప్రతి జట్టుకు కేవలం రెండు నెట్లను మాత్రమే కేటాయిస్తారు. ప్రధాన పిచ్‌పై కేవలం నిర్దిష్ట ప్రాంతాల్లోనే హిట్టింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఒక జట్టు వాడిన ప్రాక్టీస్ పిచ్‌ను మరో జట్టు వాడటానికి వీల్లేదు.
క్రమశిక్షణే పరమావధి: ప్రయాణం, డ్రెస్ కోడ్
ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండేందుకు బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ఆటగాళ్లు తమ వ్యక్తిగత వాహనాల్లో కాకుండా తప్పనిసరిగా జట్టు బస్సులోనే ప్రయాణించాల్సి ఉంటుంది. అత్యంత చర్చనీయాంశమైన విషయం ఏమిటంటే ప్రయాణ సమయాల్లో కుటుంబ సభ్యులకు అనుమతి నిరాకరించడం. వారు కేవలం స్టేడియంలోని హాస్పిటాలిటీ ఏరియాలో మాత్రమే ఉండాలి. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సమయంలో కూడా ప్రొఫెషనలిజం ఉండాలని బోర్డు స్పష్టం చేసింది. ఆటగాళ్లు స్లీవ్‌లెస్ జెర్సీలు లేదా ఫ్లిప్ ఫ్లాప్స్ (స్లిప్పర్స్) ధరించి వేదికపైకి రాకూడదు. నిబంధనలు ఉల్లంఘిస్తే తొలుత హెచ్చరిక ఆపై భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించింది.
టెక్నికల్ – బ్రాడ్కాస్ట్ నిబంధనలు
ప్రసార నాణ్యతను పెంచేందుకు ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ హోల్డర్లు మ్యాచ్ మొదలైన మొదటి రెండు ఓవర్ల వరకు తప్పనిసరిగా ఆ క్యాప్‌లను ధరించాలి. మైదానంలోని ఎల్ఈడి బోర్డులు దెబ్బతినకుండా ఉండేందుకు ఆ దిశగా బంతులు కొట్టడంపై కూడా ఆంక్షలు ఉన్నాయి. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లు , సపోర్ట్ స్టాఫ్ కూర్చునే విధానంలో కూడా మార్పులు చేశారు.
బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాలు ఐపీఎల్ స్థాయిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. అయితే, ఏళ్ల తరబడి అలవాటైన స్వేచ్ఛకు ఈ కొత్త నిబంధనలు అడ్డుకట్ట వేస్తాయేమోనని ఫ్రాంచైజీలు ఆందోళన చెందుతున్నాయి. ఈ కఠిన నిబంధనల మధ్య 2026 టైటిల్ రేసులో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో వేచి చూడాలి.
