Begin typing your search above and press return to search.

ఐపీఎల్ అసలు మజా అప్పుడే.. అప్పటిదాక 'టాప్' కోసం కొట్లాటలే

వాస్తవానికి ఐపీఎల్ లో గతంలో 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరిన జట్లు ఉన్నాయి. ఈసారి మాత్రం మూడు జట్లు గుజరాత్ టైటాన్స్ (18), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (17), పంజాబ్ కింగ్స్ (17)లు

By:  Tupaki Desk   |   23 May 2025 4:51 PM IST
ఐపీఎల్ అసలు మజా అప్పుడే.. అప్పటిదాక టాప్ కోసం కొట్లాటలే
X

మంచి జోష్ తో మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్.. అదే స్థాయిలో ఊపుతెచ్చింది.. మధ్యలో అనుకోని విధంగా భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలతో చరిత్రలో తొలిసారిగా వాయిదా పడింది. మళ్లీ ప్రారంభం అవుతుందా? అనే అనుమానాలు ముసురుకున్న వేళ.. అంతా సాఫీగా సాగుతోంది. వాస్తవానికి ఐపీఎల్ లో గతంలో 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరిన జట్లు ఉన్నాయి. ఈసారి మాత్రం మూడు జట్లు గుజరాత్ టైటాన్స్ (18), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (17), పంజాబ్ కింగ్స్ (17)లు

ఈ మార్క్ ను ముందే దాటేశాయి. గుజరాత్ కు మరొక మ్యాచ్ ఉండగా.. బెంగళూరు, పంజాబ్ కు రెండేసి మ్యాచ్ లు ఉన్నాయి. ఇక ముంబై ఇండియన్స్ (16) మరొక మ్యాచ్ ఉండగానే ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం చేసుకుంది.

ప్రస్తుతానికి అయితే గుజరాత్ టాప్ లో ఉన్నా.. లీగ్ దశ ముగిసేసరికి మాత్రమే ఎవరు నంబర్ వన్ అనేది చెప్పగలం. గుజరాత్, పంజాబ్, బెంగళూరు మూడింటికీ టాప్ లోకి వచ్చే చాన్సుంది. బెంగళూరు, పంజాబ్ కు మరింత ఎక్కువ అవకాశం ఉంది.

వారం ముందే ప్లేఆఫ్స్ జట్లు తేలిపోవడం ఈ సీజన్ ప్రత్యేకత. దీంతో ఇతర మ్యాచ్ లు పెద్దగా ప్రభావితం చేయనివిగా మిగిలాయి. వీటితో తేలేది 1,2 స్థానాలు ఎవరివి అనేదే?

వచ్చే వారం (మే 29) నుంచి ప్లేఆఫ్స్ మొదలవనున్నాయి. మే 30, జూన్ 1 తేదీల్లో ఇవి నిర్వహిస్తారు. జూన్ 3న ఫైనల్ ఉంటుంది. ఇక్కడ గమనార్హం ఏమంటే.. ఎప్పుడూ ఆదివారం జరిగే ఫైనల్ ఈసారి మంగళవారం జరుగుతోంది. లీగ్ లో ఇప్పటికే ఓ మ్యాచ్ ను ఎన్నడూ లేనివిధంగా మంగళవారం నిర్వహించారు. శ్రీరామనవమి కారణంగా మ్యాచ్ ను ఆ రోజుకు మార్చారు.

టాప్-2లో ఉంటేనే..

ఐపీఎల్ పాయింట్ల టేబుల్ లో టాప్-2లో ఉండడం జట్లకు ఉపయోగకరం. ఈ జట్ల మధ్య మ్యాచ్ లో ఓడినా మరో మ్యాచ్ (ప్లేఆఫ్స్-2)కు అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ విజేతతో తలపడేందుకు వీలుంటుంది.

-ఇప్పుడు గుజరాత్ 18 పాయింట్లతో టాప్ లో ఉంది. గురువారం లక్నోపై గెలిచి ఉంటే 20 పాయింట్లకు చేరేది. తదుపరి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో ఉంది. గెలిస్తే 20 పాయింట్లతో ఉంటుంది. ఓడితే 18 వద్దే ఆగిపోతుంది. అప్పుడు టాప్-2 ప్లేస్ కూడా కష్టమే.

-బెంగళూరుకు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నోతో రెండు మ్యాచ్ లు ఉన్నాయి. ఈ రెండూ గెలిస్తే 21 పాయింట్లతో టాప్ లేపేస్తుంది. ఒక్కటే గెలిస్తే 19 వద్దనే ఆగిపోతుంది. రెండూ ఓడితే 17తో సరిపెట్టుకోవాలి.

-11 ఏళ్లకు ప్లేఆఫ్స్ చేరిన పంజాబ్.. ఢిల్లీ, ముంబైతో ఆడాల్సి ఉంది. ఈ రెండూ గెలిస్తే 21 పాయింట్లతో టాపర్ అవుతుంది. ఇప్పుడున్న మూడో స్థానం నుంచి జంప్ చేస్తుంది. ఒకదాంట్లో ఓడితే మాత్రం 19 పాయింట్లతో ఆగిపోయి.. గుజరాత్, బెంగళూరు వైపు చూడాల్సి ఉంటుంది.

-ముంబైకి ఉన్నది 16 పాయింట్లే. ఆడాల్సింది ఒక్కటే మ్యాచ్. అదీ పంజాబ్ తోనే. గెలిచినా 18 పాయింట్లు అవుతాయి. మిగతా మూడు జట్లు తమ మ్యాచ్ లలో ఓడితేనే టాప్-2లోకి వెళ్తుంది.

-శుక్రవారం లక్నోలో జరిగే బెంగళూరు-సన్ రైజర్స్ మ్యాచ్ తర్వాత కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.