Begin typing your search above and press return to search.

రోజూ మజా మజా.. ఐపీఎల్ పీక్స్ కు.. మరి సన్ రైజర్స్ ఏం చేస్తుందో?

కానీ, వరుసగా నాలుగు రోజుల నుంచి ఐపీఎల్ మజా మజా అందిస్తోంది.

By:  Tupaki Desk   |   17 April 2025 4:27 PM IST
Thrilling Matches In IPL2025
X

చాంపియన్ జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ విఫలం అవుతుండడంతో ఇండియన్ ప్రీమియర్ లీ (ఐపీఎల్) 18వ సీజన్ చాలా డల్ గా అనిపించింది..

300 కొట్టేస్తుంది అనుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ 200 కూడా దాటకపోతుండడంతో ఈసారి సీజన్ ఇక ఇంతేనేమో అని భావించారు..

చాప కింద నీరులా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ దూసుకొస్తుంటే ఈసారి పాత చాంపియన్లు తోక ముడిచినట్లే అనుకున్నారు.

కానీ, వరుసగా నాలుగు రోజుల నుంచి ఐపీఎల్ మజా మజా అందిస్తోంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ ను హ్యాట్రిక్ రనౌట్లతో ఓడించింది ముంబై. అసలు గెలుపునకు అవకాశం లేని స్థితిలో ఆ జట్టు పుంజుకుని పాత ముంబైని తలపించింది.

సోమవారం చెన్నై సూపర్ కింగ్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ లో ఒకప్పటి ఫినిషర్ ధోనీ బయటకు వచ్చాడు. చెన్నై ఓటమి బాటలో ఉండగా ధోనీ తనదైన స్టయిల్ లో సిక్స్ లు, ఫోర్లు బాది గెలిపించాడు.

మంగళవారం మరింత మజా వచ్చింది. కేవలం 111 పరుగుల లక్యాన్ని కాపాడుకుంది పంజాబ్ కింగ్స్. ప్రత్యర్థి కోల్ కతాను 95 పరుగుల కే ఆలౌట్ చేసి 16 పరుగుల తేడాతో గెలిచింది. ఐపీఎల్ లో అతి తక్కువ స్కోర్ ను కాపాడుకున్న జట్టగా రికార్డుల్లోకి ఎక్కింది.

బుధవారం మరో ‘సూపర్’ మ్యాచ్ జరిగింది. బౌలింగ్ తో ఢిల్లీ క్యాపిటల్స్ ను కట్టడి చేసినట్లే కనిపించి, బ్యాటింగ్ లోనూ మెరుగ్గా ఉన్నట్లే కనిపించిన రాజస్థాన్ రాయల్స్ అనూహ్యంగా బోల్తా కొట్టింది. నాలుగు సీజన్ల తర్వాత మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది. ఢిల్లీ సులువుగా గెలిచింది.

మరి హైదరాబాద్ ఏం చేస్తుందో?

గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ముంబైలో జరగనుంది. ఇప్పుడిప్పుడే పుంజుకొంటున్న ఈ రెండు జట్లూ ఎలా ఆడతాయో? చూడాలి.