Begin typing your search above and press return to search.

ఐపీఎల్-18.. ఓనమాలు నేర్చిన గడ్డపై సొంతవారే ఓడిస్తున్నారు

అటు సిరాజ్, ఇటు రాహుల్ తాము ఎంతోకాలం ఆడిన సొంత రాష్ట్రంలోని స్టేడియాల్లో చెలరేగి తమతమ (ప్రస్తుతం ఆడుతున్న) జట్లను గెలిపించారు.

By:  Tupaki Desk   |   12 April 2025 6:00 AM IST
ఐపీఎల్-18.. ఓనమాలు నేర్చిన గడ్డపై సొంతవారే ఓడిస్తున్నారు
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ అంచనాలకు అందకుండా సాగుతోంది. చాంపియన్ జట్లు అనుకున్నవి కాస్త వెనక్కు పోతున్నాయి. అంచనాలు లేని జట్లు ముందుకు దూసుకొస్తున్నాయి. పెద్ద పెద్ద స్టార్లు పరుగులు సాధించలేకపోతున్నారు.. కొత్త కుర్రాళ్లు మెరుపులు మెరిపిస్తున్నారు..

ఇప్పుడు మరో కొత్త పాయింట్ ఏమంటే.. ఐపీఎల్ -18లో సొంత జట్లనే ఓడిస్తున్నారు కొందరు ఆటగాళ్లు. ఇక్కడ సొంత జట్లు అంటే వారు ఆడుతున్న జట్టు కాదు. మెగా లీగ్ లో ఆటగాళ్లను వేర్వేరు ఫ్రాంచైజీలు కొనుక్కునే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక రాష్ట్రానికి చెందినవారు వేరేకొ రాష్ట్రం ఫ్రాంచైజీకి ఆడుతుంటారు.

హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ 2018 నుంచి 2024 వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఆడిన సంగతి తెలిసిందే. 2017లో మాత్రమే అతడు సొంత రాష్ట్రం జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించాడు. అది అతడికి తొలి ఐపీఎల్ సీజన్. ఇక ఈ సీజన్ కు ముందు జరిగిన వేలంలో సిరాజ్ ను బెంగళూరు రిటైన్ చేసుకోలేదు. వేలంలో కొనుగోలు చేయలేదు. మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ సిరాజ్ ను రూ.11 కోట్లకు దక్కించుకుంది.

తనకు పెట్టిన ధరకు సిరాజ్ న్యాయం చేస్తున్నాడు. తొలి మ్యాచ్ లో మాత్రమే అతడు విఫలమయ్యాడు. రెండో మ్యాచ్ లో ముంబై (2/34), మూడో మ్యాచ్ లో బెంగళూరు (3/19)పై అద్భుతంగా రాణించాడు. ఇక నాలుగో మ్యాచ్ లో తన సొంత నగరానికి చెందిన సన్ రైజర్స్ హైదరాబాద్ పై మరింత చెలరేగాడు. ఉప్పల్ లో జరిగిన ఈ మ్యాచ్ లో 17 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు

రాహులో రాహులా..

గురువారం జరిగిన మరో మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ను ఓడించింది కేఎల్ రాహుల్ (93 నాటౌట్) అన్న సంగతి తెలిసిందే. 163 పరుగుల చేజింగ్ లో కేవలం 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ను రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్ తో గెలిపించాడు. ఇక కేఎల్ రాహుల్ స్వస్థలం బెంగళూరు. అందుకే గురువారం మ్యాచ్ అనంతరం అతడు ఇది నా అడ్డా అంటూ బ్యాట్ ను గ్రౌండ్ లో పాతాడు.

అటు సిరాజ్, ఇటు రాహుల్ తాము ఎంతోకాలం ఆడిన సొంత రాష్ట్రంలోని స్టేడియాల్లో చెలరేగి తమతమ (ప్రస్తుతం ఆడుతున్న) జట్లను గెలిపించారు.