Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌లో ఐపీఎల్‌ ఫైనల్‌? లేదా ప్లేఆఫ్స్! 17 నుంచి రీస్టార్ట్‌

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఈ నెల 8న ఆగిపోయిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మళ్లీ ప్రారంభమయ్యేది ఎప్పుడో తేలింది.

By:  Tupaki Desk   |   13 May 2025 9:32 AM IST
హైదరాబాద్‌లో ఐపీఎల్‌ ఫైనల్‌? లేదా ప్లేఆఫ్స్! 17 నుంచి రీస్టార్ట్‌
X

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఈ నెల 8న ఆగిపోయిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మళ్లీ ప్రారంభమయ్యేది ఎప్పుడో తేలింది. గత గురువారం ధర్మశాలలో పంజాబ్‌ కింగ్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ను అర్థంతరంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అది లీగ్‌లో 58వ మ్యాచ్‌. శుక్రవారం నుంంచి లీగ్‌ను వాయిదా వేశారు. తొలుత మొత్తానికే వాయిదా అనుకున్నా, చివరకు వారం రోజులు మాత్రమే విరామం అని ప్రకటించారు.


భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు చల్లారడంతో శనివారమే లీగ్‌ పునఃప్రారంభంపై కథనాలు వచ్చాయి. ఆ మేరకు సోమవారం రాత్రి షెడ్యూల్‌ వెల్లడించారు.

ప్లేఆఫ్స్‌, ఫైనల్‌ సహా లీగ్‌లో ఇంకా 18 మ్యాచ్‌ లు జరగాల్సి ఉంది. ఈ నెల 17 నుంచి మ్యాచ్‌లు జరగనున్నాయి.అయితే, వీటిని కేవలం 6 వేదికల్లోనే నిర్వహించనున్నారు. మొదటినుంచి చెబుతున్నట్లే కేంద్ర ప్రభుత్వం సంప్రదించి కొత్త షెడ్యూల్‌ ప్రకటించారు.

బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, ముంబై, లక్నో, అహ్మదాబాద్‌లలో మాత్రమే మ్యాచ్‌లు జరుగుతాయి. ముందుగా అనుకున్న షెడ్యూ్‌ల్‌ ప్రకారం మార్చి 22న మొదలైన ఐపీఎల్‌ మే 25న ముగియాలి. మధ్యలో అనుకోని విరామంతో జూన్‌ 3న ముగియనుంది. ఇక ఈ నెల 29న క్వాలిఫయర్-1, 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫయర్-2, జూన్ 3న ఫైనల్ జరగనుంది.

13 లీగ్‌ మ్యాచ్‌ల వేదికలను ప్రకటించినా ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల వేదికలు ఖరారు కాలేదు. 18, 25 తేదీల్లో (రెండు ఆదివారాలు) డబుల్‌ హెడర్స్‌ ఉంటాయి. 8న ఆగిపోయిన పంజాబ్‌-ఢిల్లీ మ్యాచ్‌ను కూడా నిర్వహించనున్నా.. అది పూర్తిగానా, ఆగిపోయిన దగ్గరినుంచా? అన్నది తేలాల్సి ఉంది.

పునఃప్రారంభమూ వాటితోనే

ఈ ఏడాది లీగ్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో మొదలైంది. 17న పునఃప్రారంభం (బెంగళూరులో) కూడా వీటితోనే ఉండనుంది. 18న జైపూర్‌లో రాజస్థాన్-పంజాబ్, ఢిల్లీ-గుజరాత్ లు ఢిల్లీలో తలపడతాయి.

ఉప్పల్‌ లో పెద్ద మ్యాచ్‌లు

రివైజ్డ్‌ షెడ్యూల్‌లో హైదరాబాద్‌లో లీగ్‌ మ్యాచ్‌లు లేవు. అయితే, క్వాలిఫయర్‌ 1, ఎలిమినేటర్, క్వాలిఫయర్‌ 2లకు వేదికలు ఖరారు కాలేదు. ఫైనల్‌ వేదిక కూడా ఏదో చెప్పలేదు. దీంతో ఈ మ్యాచ్‌లలో ఒకటి లేదా రెండు ఉప్పల్‌లో జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే హైదరాబాద్‌ అభిమానులకు పండుగే. మరోవైపు లీగ్‌ మ్యాచ్‌లకు చెన్నైకీ అవకాశం ఇవ్వలేదు. ఉత్తరాదిన ఉన్న మైదానాల్లో మ్యాచ్‌లు నిర్వహించరు. కాబట్టి ప్లేఆఫ్స్‌, ఫైనల్‌ చాన్స్‌ చెన్నైకు దక్కినా దక్కొచ్చు.