Begin typing your search above and press return to search.

ఐపీఎల్ విచిత్రం.. ప్రారంభం.. పున:ప్రారంభం.. అదే జట్లతో

2008 ఏప్రిల్ 18.. క్రికెట్ చరిత్రలో ఇదో చెరిగిపోని రోజు.. కారణం.. అప్పటివరకు ఉన్న క్రికెట్ తీరునే మార్చేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొదలైన రోజు.

By:  Tupaki Desk   |   17 May 2025 4:29 PM IST
ఐపీఎల్ విచిత్రం.. ప్రారంభం.. పున:ప్రారంభం.. అదే జట్లతో
X

2008 ఏప్రిల్ 18.. క్రికెట్ చరిత్రలో ఇదో చెరిగిపోని రోజు.. కారణం.. అప్పటివరకు ఉన్న క్రికెట్ తీరునే మార్చేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొదలైన రోజు. ఆనాటి మ్యాచ్ లో 13 సిక్స్ లు, 10 ఫోర్లతో 73 బంతుల్లోనే 158 పరుగులు చేసి ఏ ముహూర్తాన విధ్వంసక బ్యాటర్ బ్రెండన్ మెకల్లమ్ పునాది వేశాడో కానీ.. ఐపీఎల్ ఇక వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకపోయింది. ఎన్నికలు అడ్డుపడినా, కొవిడ్ వచ్చినా 17 సీజన్ల పాటు లీగ్ అప్రతిహతంగా సాగిపోయింది. కానీ, ప్రస్తుత 18వ సీజన్ లో మాత్రం భారత్-పాక్ ఉద్రిక్తతలు ఐపీఎల్ కు అడ్డుకట్ట వేశాయి. దీంతో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా లీగ్ 10 రోజుల పాటు వాయిదా పడింది.

ఇక అనేక మార్పులతో ఈ ఏడాది మార్చి 22న మొదలైన ఐపీఎల్ మే 8వ తేదీ అద్భుతంగా అలరించింది. భారత్-పాక్ యుద్ధంతో పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మధ్యలోనే ముగించాల్సి వచ్చింది. పరిస్థితులు చక్కబడడంతో శనివారం నుంచి తిరిగి మొదలుకానుంది.

ఈ ఏడాది లీగ్ మొదటి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. దీంట్లో బెంగళూరు సునాయాసంగా గెలిచింది. శనివారం రీ స్టార్ట్ మ్యాచ్ కూడా ఈ రెండు జట్ల మధ్యే జరగనుంది.

అయితే, తొలి మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్ హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ లో జరగ్గా.. శనివారం మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి వేదిగా జరగనుంది. ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్నాయి.

పెద్ద వర్షమే కురవనుందని.. మ్యాచ్ తుడిచిపెట్టుకుపోతుందని చెబుతున్నారు. అదే జరిగితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ చేరినట్లే. ఇప్పటికే 11 మ్యాచ్ లలో 8 గెలిచిన ఈ జట్టు 16 పాయింట్లతో ఉంది. కోల్ కతాతో మ్యాచ్ రద్దయితే ఒక పాయింట్ దక్కుతుంది. మరోవైపు కోల్ కతా 12 మ్యాచ్ లలో 11 పాయింట్లతో ఉంది. శనివారం మ్యాచ్ రద్దయితే 12 పాయింట్లకు చేరుతుంది. చివరి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై గెలిచినా ప్లేఆఫ్స్ చేరుతుందనే నమ్మకం లేదు.

మెగా వేలంలో ఆటగాడికి అత్యధిక ధర (రూ.27 కోట్లు-రిషభ్ పంత్) నుంచి 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సెంచరీ వరకు ఎన్నో సంచలనాలకు వేదికైన ఐపీఎల్-18 తిరిగి ప్రారంభం కానుండడం అభిమానులందరికీ పండుగే.