Begin typing your search above and press return to search.

క్వాలిఫయర్‌ -2.. ఓ వాన పడితే.. ముందుకెళ్లేదెవరు? ఇంటికెళ్లేదెవరు?

క్వాలిఫయర్‌ 2లో ఆదివారం పంజాబ్‌ కింగ్స్‌ను ముంబై ఇండియన్స్‌ ఢీకొననుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియ ఆతిథ్యం ఇవ్వనుంది.

By:  Tupaki Desk   |   31 May 2025 11:45 PM IST
క్వాలిఫయర్‌ -2.. ఓ వాన పడితే.. ముందుకెళ్లేదెవరు? ఇంటికెళ్లేదెవరు?
X

వాస్తవానికి ఐపీఎల్‌కు ఎప్పుడూ పెద్దగా వర్షం ముప్పు ఉండదు. ఉన్నప్పటికీ.. ఒకటీ, అరా మ్యాచ్‌లకే. అవీ అకాల వర్షాల కారణంగానే. కానీ, ఈ సీజన్‌లో పలు మ్యాచ్‌లు వర్షాల బారినపడ్డాయి. కాలం ప్రభావమే దీనికి కారణం. మరోవైపు దేశంలోకి రుతుపవనాలు కూడా చాలా ముందుగా వచ్చేశాయి. 2009లో మాత్రమే మే నెలలో నైరుతి రుతుపవనాలు భారత్‌లోకి వచ్చాయి. చిత్రమేమంటే.. 2009లో దేశమంతా సార్వత్రిక ఎన్నికలు ఉండడం, అప్పటికి ఐపీఎల్‌కు రెండో ఏడాదే కావడంతో లీగ్‌ను దక్షిణాఫ్రికాకు తరలించారు. 2014లోనూ ఎన్నికలు ఉన్న సమయంలోనే లీగ్‌ జరిగినా.. అప్పటికే ఐపీఎల్‌ లాజిస్టిక్స్‌ పరంగా చాలా ముందంజ వేసింది. ఎన్నికలకు అడ్డంకి లేకుండా టోర్నీ నిర్వహణ జరిగిపోయింది. 2019, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఇదే విధంగా జరిగింది.

రికార్డు స్థాయిలో ఆటగాడి ధర (రిషభ్‌ పంత్‌కు రూ.10 కోట్లు) నుంచి ఈ ఏడాది 18వ సీజన్‌ ఐపీఎల్‌ ఎన్నో విశేషాలతో మొదలైంది. అత్యంత చిన్న వయసు (14 ఏళ్లు)లో సెంచరీ సాధించిన వాడిగా వైభవ్‌ సూర్యవంశీ రికార్డులకు ఎక్కాడు. మాంచి ఊపులో సాగుతుండగా భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు తలెత్తాయి. దీంతో టోర్నీ 8 రోజుల పాటు వాయిదా పడింది. అసలు లీగ్‌ మళ్లీ జరుగుతుందా? వేరే దేశానికి తరలిస్తారా..? అనే సంశయాలు నెలకొన్నాయి. చివరకు ఉద్రిక్తతలు చల్లారడంతో లీగ్‌ మళ్లీ మొదలైంది. ఇప్పుడు మరొక్క రెండు మ్యాచ్‌లు అయితే చాలు.. 18వ సీజన్‌ దిగ్విజయంగా ముగుస్తుంది. మరి ఆ రెండో మ్యాచ్‌కు వర్షం అడ్డుపడితే..?

క్వాలిఫయర్‌ 2లో ఆదివారం పంజాబ్‌ కింగ్స్‌ను ముంబై ఇండియన్స్‌ ఢీకొననుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియ ఆతిథ్యం ఇవ్వనుంది. షెడ్యూల్‌ ప్రకారం అయితే, మే 25కే ఐపీఎల్‌ అయిపోవాల్సింది. అంటే అప్పటికి రుతుపవనాల కూడా వచ్చి ఉండేవి కాదు. కానీ, ఇప్పుడు రుతుపవనాలు విస్తరించాయి. చాలా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముంబైని ఇప్పటికే రికార్డు స్థాయి వర్షం ముంచెత్తింది. రుతు పవనాల ప్రభావం గుజరాత్‌పైనా ఉంటుందని చెప్పొచ్చు. మరి.. ఆదివారం పంజాబ్‌-ముంబై మ్యాచ్‌ రద్దయితే?

రద్దు అయ్యే పరిస్థితే వస్తే ముంబై ఇండియన్స్‌కు తీవ్ర నిరాశే అని చెప్పాలి. ఎందుకంటే.. క్వాలిఫయర్‌2కు రిజర్వ్‌ డే లేదు. ఇక వర్షంతో మ్యాచ్‌ను కొనసాగించలేకపోతే.. లీగ్‌ దశలో మెరుగైన ప్రదర్శన కనబర్చినందుకు పంజాబ్‌ కింగ్స్‌ ఫైనల్‌ కు చేరుతుంది.

ఈ నెల 3న రాయల్‌ చాలెంజర్స్‌బెంగళూరును ఢీకొంటుంది. కాగా, లీగ్‌ దశలో పంజాబ్‌ 14 మ్యాచ్‌లలో 19 పాయింట్లతో టేబుల్‌ టాపర్‌గా నిలిచింది. ముంబై 16 పాయింట్లతో నాలుగో స్థానంంలో ఉంది. క్వాలిఫయర్‌ 1లో బెంగళూరు చేతిలో ఓడడంతో పంజాబ్‌ క్వాలిఫయర్‌ 2 ఆడాల్సి వస్తోంది. ఎలిమినేటర్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను చిత్తుచేసిన ముంబైని క్వాలిఫయర్‌2లో వర్షం కరుణిస‍్తుందా?