ఐపీఎల్ టైటిల్ కొట్టని జట్ల మధ్య రేపే క్వాలిఫయర్స్.. చరిత్ర ఎవరివైపు?
మొదటి నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతూ ఇప్పటివరకు టైటిల్ కొట్టని జట్లు పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.
By: Tupaki Desk | 28 May 2025 6:48 PM ISTమొదటి నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతూ ఇప్పటివరకు టైటిల్ కొట్టని జట్లు పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఈ సారి మాత్రం లీగ్ దశలో టాప్-2లో వచ్చి చాంపియన్ గా నిలిచే ఊపులో కనిపిస్తున్నాయి. గురువారం ఈ రెండు జట్ల మధ్య క్వాలిఫయర్-1 జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్తుంది. ఓడిన జట్టుకు ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్-2 ఆడుతుంది.
ఇప్పటివరకు 18 సీజన్లలో బెంగళూరు-పంజాబ్ 35 సార్లు తలపడ్డాయి. ఎవరు గెలిచారు అని చూస్తే.. సమఉజ్జీలే అనిపిస్తుంది. బెంగళూరు 17 సార్లు నెగ్గగా, పంజాబ్ 18 సార్లు గెలిచింది. పంజాబ్ పై ఆర్సీబీ అత్యధిక స్కోరు 241 కాగా.. ఆర్సీబీపై పంజాబ్ హయ్యస్ట్ స్కోర్ 232 కావడం గమనార్హం. పంజాబ్ పై ఆర్సీబీ అత్యల్ప స్కోరు 84 అయితే.. ఆర్సీబీపై పంజాబ్ లోయస్ట్ స్కోర్ 88.
ప్రస్తుత సీజన్ లో రెండు జట్లూ మంచి ఫామ్ లో ఉండగా.. రెండూ కొత్త కెప్టెన్లు (బెంగళూరుకు రజత్ పటీదార్, పంజాబ్ కు శ్రేయస్ అయ్యర్)తోనే బరిలో దిగడం విశేషం. ఇక ఈ సీజన్ లో రెండుసార్లు తలపడిన ఈ జట్లు చెరో మ్యాచ్ నెగగ్యి. అది కూడా ప్రత్యర్థి వేదికలో కావడం మరో చిత్రం. బెంగళూరు సొంతగడ్డ చిన్నస్వామి మైదానంలో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. పంజాబ్ సొంత మైదానం ముల్లాన్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు ఏడు వికెట్లతో విజయం సాధించింది.
ఈ సీజన్ లో ముచ్చటగా మూడోసారి గురువారం జరగబోయే క్వాలిఫయర్-1లో బెంగళూరు-పంజాబ్ తలపడుతున్నాయి. మరి ఇందులో విజేత ఎవరో? తెలియాలంటే గురువారం రాత్రి వరకు ఆగాల్సిందే.
కొసమెరుపు: పంజాబ్ చివరిసారిగా పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచి 2014లో ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చేరింది. అదే ఏడాది ఫైనల్స్ కూ వెళ్లింది. కానీ, కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడింది.
