ఐపీఎల్ ప్లేఆఫ్స్.. ఒకే రోజు 2 జట్లు ఔట్..? ఆ జట్టుదే బాగా బ్యాడ్ లక్
ఈ సీజన్ లో 300 కొట్టేస్తుంది అనుకున్న నిరుటి ఫైనలిస్టు సన్ రైజర్స్ హైదరాబాద్ కథ కూడా దాదాపు ముగిసినట్లే.
By: Tupaki Desk | 5 May 2025 9:29 AM ISTప్లేఆఫ్స్, ఫైనల్ సహా మొత్తం 74 మ్యాచ్ ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 54 మ్యాచ్ లు ముగిశాయి.. ప్లేఆఫ్స్ చేరేది ఎవరో ఇప్పటికే ఓ స్పష్టత వచ్చింది.
మొదటి ఐదు మ్యాచ్ లలో కేవలం ఒక్కటే నెగ్గి బాగా వెనుకబడిపోయిన ఐదుసార్లు టైటిల్ విజేత ముంబై అద్భుతంగా పుంజుకుని వరుసగా ఆరు మ్యాచ్ లు నెగ్గి ఔరా అనిపించింది. ఆ జట్టు ప్రస్తుత రిథమ్ చూస్తే ప్లేఆఫ్స్ చేరకుండా ఆపడం కష్టమే.
మొదటినుంచి బాగా దూకుడుగా ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. ఈ సాలా కప్ నమదే (ఈసారి కప్ మనదే) అనే నమ్మకాన్ని నిజం చేసేలా కనిపిస్తోంది.
ఐదుసార్లు టైటిల్ కొట్టి.. ఐదుసార్లు ఫైనల్ చేరిన మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్ లకు 2 మాత్రమే నెగ్గి ప్లేఆఫ్స్ రేసు నుంచి ఔట్ అయింది.
ఈ సీజన్ లో 300 కొట్టేస్తుంది అనుకున్న నిరుటి ఫైనలిస్టు సన్ రైజర్స్ హైదరాబాద్ కథ కూడా దాదాపు ముగిసినట్లే. 10 మ్యాచ్ లలో మూడు గెలిచి మరో నాలుగు ఆడాల్సి ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ -1.192 మాత్రమే కావడంతో ప్లే ఆఫ్స్ పై ఆశలు వదులుకోవాల్సిందే.
ఇక ఆదివారం ఒకేసారి రెండు జట్లు ప్లేఆఫ్స్ రేసు నుంచి ఔట్ అయ్యాయి. తొలుత కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ కు ప్లేఆఫ్స్ దారులు మూసుకుపోయాయి. 12 మ్యాచ్ లు ఆడి మూడే గెలిచిన రాజస్థాన్ ఆరు పాయింట్లతో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్ లు గెలిచినా పది పాయింట్లే అవుతాయి.
మ్యాచ్ లు ఓడినా మనసులు గెలిచింది
జైశ్వాల్, బట్లర్, కెప్టెన్ శాంసన్ వంటి మేటి బ్యాటర్ల ప్రతితో రాజస్థాన్ నిరుడు ప్లేఆఫ్స్ చేరింది. ఈ ఏడాది బట్లర్ ను వదులుకుని, శాంసన్ గాయం దెబ్బతో వెనుకబడిపోయింది. వాస్తవానికి రాజస్థాన్ ఈ సీజన్ లో నాలుగు మ్యాచ్ లను త్రుటిలో ఓడింది. లక్నో సూపర్ జెయింట్స్ పై 2 పరుగులు, ఆర్సీబీపై 11 పరుగులు, కోల్ కతాపై ఒక పరుగు తేడాతో పరాజయం పాలైంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో ఓడింది. వీటిలో రెండు మ్యాచ్ లు గెలిచినా ప్లేఆఫ్స్ ఆశలు ఉండేవి.
ఆదివారం పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఓడిపోయిన లక్నో సూపర్ జెయింట్స్ కూ ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. 11 మ్యాచ్ లకు ఆరింట్లో పరాజయం పాలైన లక్నో మిగతా మూడు మ్యాచ్ లనూ గెలిచినా ప్లేఆఫ్స్ కష్టమే. రన్ రేట్ -0.325లో బాగా వెనుకబడి ఉండడం కూడా చూడాల్సి ఉంది.
మొత్తమ్మీద ఆదివారం నాటికి చెన్నై, హైదరాబాద్, రాజస్థాన్ కచ్చితంగా, లక్నో దాదాపుగా ప్లేఆఫ్స్ కు వెళ్లవని తేలిపోయింది. వీటిలో రాజస్థాన్ పరిస్థితే కాస్త జాలి చూపేలా ఉంది.
