Begin typing your search above and press return to search.

ఒక్క మ్యాచ్.. 3 బెర్తులు పక్కా.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లెక్క తేలింది

ఆదివారం ఒకే ఒక్క మ్యాచ్ తో మూడు ప్లేఆఫ్స్ బెర్తులు ఖాయం అయిపోయాయి.

By:  Tupaki Desk   |   19 May 2025 9:35 AM IST
ఒక్క మ్యాచ్.. 3 బెర్తులు పక్కా.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లెక్క తేలింది
X

అనేక మార్పులతో మొదలై.. సంచలనాలతో సాగి.. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలతో నిలిచిపోయి.. మళ్లీ మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ ప్లే ఆఫ్స్ సమరానికి దగ్గరైంది.

ఆదివారం ఒకే ఒక్క మ్యాచ్ తో మూడు ప్లేఆఫ్స్ బెర్తులు ఖాయం అయిపోయాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడిన గుజరాత్ టైటాన్స్ 200 పరుగుల టార్గెట్ ను వికెట్ కూడా కోల్పోకుండా కొట్టేసింది. దీంతో 12 మ్యాచ్ లలో 9 నెగ్గి 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరింది. తనతో పాటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (12 మ్యాచ్ లలో 8 విజయాలు, ఒక నో రిజల్ట్-17 పాయింట్లు), పంజాబ్ కింగ్స్ (12 మ్యాచ్ లలో 8 విజయాలు, ఒక నో రిజల్ట్-17 పాయింట్లు)ను కూడా ప్లేఆఫ్స్ చేర్చింది.

టోర్నీలో తొలి నుంచి మంచి జోష్ తో ఉన్న గుజరాత్ టైటాన్స్ పున: ప్రారంభం తర్వాత కూడా దానిని కొనసాగించింది. ఆదివారం ఢిల్లీని చితక్కొట్టింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (61 బంతుల్లో 108 నాటౌట్, 12 ఫోర్లు, నాలుగు సిక్స్ లు) సూపర్ సెంచరీకి, కెప్టెన్ శుబ్ మన్ గిల్ (53 బంతుల్లో 93, ఏడు సిక్స్ లు, 3 ఫోర్లు) చక్కటి బ్యాటింగ్ తోడవంతో.. మరో ఓవర్ ఉండగానే 200 పరుగుల టార్గెట్ ను పూర్తి చేసింది. అంతకుముందు ఓపెనర్ గా వచ్చిన కేఎల్ రాహుల్ (65 బంతుల్లో 112 నాటౌట్, 14 ఫోర్లు, 4 సిక్సులు) చెలరేగడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 199 పరుగులు చేసింది. కానీ, జోరుమీదున్న గుజరాత్ కు ఈ టార్గెట్ ఓ మూలకు కూడా రాలేదు. టైటాన్స్ ఓపెనర్లే మొత్తం కొట్టేశారు. దీంతో 10 వికెట్లతో గెలిచిన గుజరాత్ మొత్తం 18 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచింది.

మరి నాలుగో స్థానం ఎవరిది?

ఐపీఎల్ 18 ప్లేఆఫ్స్ రేసులో మిగిలింది మరొక్క స్థానమే. దీనికోసం ముంబై ఇండియన్స్ (12 మ్యాచ్ లలో 7 విజయాలు, 14 పాయింట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (12 మ్యాచ్ లలో 6 విజయాలు, ఒక నో రిజల్ట్- 13 పాయింట్లు) ముందున్నాయి. ఈ రెండు జట్లకు రెండేసి మ్యాచ్ లు ఉన్నాయి. ముంబై-ఢిల్లీ మధ్య బుధవారం కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత పంజాబ్ తో తలపడనుంది. ఇక ఢిల్లీ.. ముంబైతో పాటు పంజాబ్ తో ఈ నెల 8న ఆగిపోయిన (యుద్ధం కారణంగా) మ్యాచ్ ఆడాల్సి ఉంది. ముంబై బుధవారం ఢిల్లీపై గెలిస్తే 16 పాయింట్లతో ముందుకెళ్తుంది. అప్పుడు ఢిల్లీ తన తర్వాతి మ్యాచ్ లో పంజాబ్ పై నెగ్గినా 15 పాయింట్ల వద్దే ఆగిపోతుంది. లేదా.. ఢిల్లీ ముంబై, పంజాబ్ రెండింటిపైన గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్ చేరుతుంది.

లక్నోకూ లక్ ఉంది..

ఢిల్లీ, ముంబై మాత్రమే కాదు.. ప్లేఆఫ్స్ రేసులో మరో జట్టు కూడా ఉంది. అది లక్నో సూపర్ జెయింట్స్. ఈ జట్టుకు ఇంకా మూడు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. 11 మ్యాచ్ లు ఆడి ఐదు విజయాలతో 10 పాయింట్లతో ఉన్న లక్నో.. సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఓడితే లక్నో దాదాపు ఇంటికెళ్లినట్లే. గెలిస్తే 12 పాయింట్లకు చేరి.. తర్వాత గుజరాత్, బెంగళూరులతో ఆడాల్సి ఉంటుంది. ఈ మూడు మ్యాచ్ లు గెలిచినా.. 16 పాయింట్లతో లక్నో ప్లేఆఫ్స్ చేరుతుందని చెప్పలేం. ఎందుకంటే.. రన్ రేట్ లో బాగా వెనుకబడి ఉంది కాబట్టి.

ఇక రన్ రేట్ విషయానికి వస్తే ముంబై (1.156), ఢిల్లీ (0.260), లక్నో (-0.469)తో ఉన్నాయి. ముంబై ఒక్క మ్యాచ్ నెగ్గినా (వీటిలో ఒకటి ఢిల్లీపై) చాలు దాదాపు ప్లేఆఫ్స్ చేరుతుంది. ఢిల్లీకి రెండు మ్యాచ్ లూ గెలిస్తేనే 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్తు దక్కుతుంది. అప్పుడు లక్నో మూడు మ్యాచ్ లు గెలిచినా 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్తుకు బెత్తెడు దూరంలో ఆగిపోతుంది.

ఆదివారం మధ్యాహ్నం మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 10 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరింది. 2014 తర్వాత ఆ జట్లు ప్లేఆఫ్స్ నకు రావడం ఇదే మొదటి సారి. అదే సీజన్ లో పంజాబ్ రన్నరప్ గా నిలవడం గమనార్హం.