ఐపీఎల్.. పోతూపోతూ ప్లేఆఫ్స్ జట్లను పడేసి పోతున్నాయి..
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో ప్లేఆఫ్స్ చేరని జట్లు.. ఇంటికి పోతూపోతూ.. ’ప్లేఆఫ్స్’ లెక్కలను మార్చేస్తున్నాయి.
By: Tupaki Desk | 24 May 2025 5:43 PM ISTప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో ప్లేఆఫ్స్ చేరని జట్లు.. ఇంటికి పోతూపోతూ.. ’ప్లేఆఫ్స్’ లెక్కలను మార్చేస్తున్నాయి. మొన్నటికి మొన్న గుజరాత్ టైటాన్స్ కు లక్నో సూపర్ జెయింట్స్ షాక్ ఇచ్చింది. దీంతో గుజరాత్ ’పాయింట్ల టేబుల్ టాప్’ ఆశలకు గండిపడింది. నిన్నటికి నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సన్ రైజర్స్ హైదరాబాద్ జలక్ ఇచ్చింది. వాస్తవానికి గుజరాత్, బెంగళూరు జట్లు పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్నాయి. తద్వారా వీటికి ప్లేఆఫ్స్ లో తొలి మ్యాచ్ ఓడినా మరో చాన్స్ ఉంటుంది. ఇప్పుడు చూస్తే 13 మ్యాచ్ లు పూర్తిచేసుకున్న గుజరాత్ 18, బెంగళూరు 17 పాయింట్లతోనే మిగిలాయి. వీటికి మరొక్క మ్యాచ్ మిగిలి ఉంది.
ఆర్సీబీకి ’ఆరెంజ్’ దెబ్బ.. ముంబైకి భలే చాన్స్
ఈ సీజన్ లో మంచి ఫామ్ లో ఉన్న బెంగళూరును శుక్రవారం నాటి మ్యాచ్ లో అసలు ఫామ్ లోనే లేని సన్ రైజర్స్ హైదరాబాద్ దెబ్బకొట్టింది. ఏకంగా 231 పరుగులు చేయడమే కాక.. 42 పరుగుల తేడాతో ఓడించడంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో 2వ స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. పంజాబ్ కింగ్స్ కు కూడా 17 పాయింట్లే ఉన్నప్పటికీ ఆ జట్టు రన్ రేట్ ప్రకారం రెండో స్థానంలోకి వెళ్లింది. ఈ జట్టు శనివారం ఢిల్లీతో ఆడనుంది. మరో మ్యాచ్ ముంబైతో 26న ఉంది.
గత 17 సీజన్లుగా కప్ కొట్టలేని బెంగళూరు 200 పైగా ఉన్న టార్గెట్ ను ఛేదించడంలో 18 సార్లు విఫలమైంది. ఢిల్లీ తర్వాత ఈ కోరుకోని రికార్డు ఆర్సీబీదే. బెంగళూరుపై గెలుపును సన్ రైజర్స్ అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ జట్టుపై విజయం ఎప్పుడూ మజా ఇస్తుందని అంటున్నారు.
ఇప్పుడు ఆర్సీబీకి గుజరాత్ కు షాకిచ్చిన లక్నోతో మ్యాచ్ మాత్రమే ఉంది. అందులోనూ ఓడితే టేబుల్ లో నాలుగో స్థానానికి పడిపోయే ప్రమాదం ఉంది.
మరోవైపు ముంబై 16 పాయింట్లతో తన చివరి లీగ్ మ్యాచ్ ను పంజాబ్ కింగ్స్ తో ఆడాల్సి ఉంది. ఇందులో గెలిస్తే ముంబై 18 పాయింట్లకు చేరుతుంది. పాయింట్ల పట్టికలో టాప్ 2లోకి వెళ్లే వీలుంది.
గుజరాత్ కు కూడా చివరి మ్యాచ్.. ప్లేఆఫ్స్ చేరని మరో జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తో ఉంది. అందులో గెలిస్తే 20 పాయింట్లతో టాప్ లోనే ఉంటుంది. ఓడితే 18 వద్దే ఆగిపోతుంది.
పంజాబ్ గనుక శనివారం ఢిల్లీపై గెలిస్తే 19 పాయింట్లతో టాప్ లోకి వెళ్తుంది. ఓడితే 17 పాయింట్లతో మిగులుతుంది. ముంబైపై గెలిచినా 19 పాయింట్లకు చేరుతుంది.
ఏదేమైనా భారత్-పాక్ యుద్ధం కారణంగా ఈ నెల 8న నిలిచిపోయిన ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్ శనివారం జరగనుంది. దీంతో ఓ స్పష్టత వస్తుంది.
