ఐపీఎల్ 18: ఆ నలుగురిలో ఆరెంజ్, పర్పుల్ టోపీలు ఎవరివో?
ఎలిమినేటర్ మ్యాచ్ తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో మరో అంకం ముగిసింది. ఇక మిగిలింది రెండే మ్యాచ్ లు. ఒకటి క్వాలిఫయర్-2, మరోటి ఫైనల్.
By: Tupaki Desk | 31 May 2025 6:00 PM ISTఎలిమినేటర్ మ్యాచ్ తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో మరో అంకం ముగిసింది. ఇక మిగిలింది రెండే మ్యాచ్ లు. ఒకటి క్వాలిఫయర్-2, మరోటి ఫైనల్. దీంతో 18వ సీజన్ కూడా ముగుస్తుంది. మరి టాప్ స్కోరర్ ఎవరు? టాప్ వికెట్ టేకర్ ఎవరు..? వీటికి సమాధానం.. నలుగురి పేర్లు.
మొదటి నుంచి పాయింట్ల టేబుల్ లో టాప్ లో ఉంటూ వచ్చిన గుజరాత్ టైటాన్స్ ఎలిమినేట్ అయింది. కానీ, ఆ జట్టు బ్యాట్స్ మన్ సాయి సుదర్శన్ మాత్రం టాప్ లోనే ఉన్నాడు. ఈ సీజన్ లో లీగ్ లో అద్భుత ఫామ్ తో ఇంగ్లండ్ టూర్ కు బెర్తు కొట్టేసిన సాయి.. భవిష్యత్ స్టార్ గా కనిపిస్తున్నాడు. మొత్తం 15 మ్యాచ్ లలో సాయి ఏకంగా 759 పరుగులు చేసి టాప్ లో ఉన్నాడు. ఒకవేళ గుజరాత్ గనుక ఎలిమినేటర్ లో గెలిచి.. క్వాలిఫయర్ 2, ఫైనల్ కూ చేరి ఉంటే సాయి కనీసం 800 పరుగులైనా చేసి ఉండేవాడు. కచ్చితంగా టాప్ స్కోరర్ కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ ను కొట్టేసేవాడు.
ఇక సాయి సుదర్శన్ తర్వాత ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 673 పరుగులతో రెండో స్థానంలో, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ (650), లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ మిచెల్ మార్ష్ (627), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (614) తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇప్పుడు గుజరాత్ ఎలిమినేట్ కావడంతో.. గిల్, సాయిలకు చాన్స్ లేదు. దగ్గరగా మిగిలింది సూర్య మాత్రమే. అయితే, సాయికి ఇతడు 86 పరుగుల దూరంలో ఉన్నాడు. ముంబై క్వాలిఫయర్ 2లో గెలిచి ఫైనల్ కు వెళ్తే, అక్కడ కూడా సూర్య రాణిస్తే సాయిని బీట్ చేసి ఆరెంజ్ క్యాప్ కొట్టేయగలడు. కోహ్లికి ఒక్క మ్యాచ్ (ఫైనల్) మాత్రమే మిగిలి ఉంది. అతడు టాప్ 3లో మాత్రమే ఉండగలడు. మార్ష్ కు ఎలాగూ అవకాశం లేదు.
ఇక బౌలర్లలోనూ గుజరాత్ టైటాన్స్ పేసర్ ప్రసిద్ధ్ క్రిష్ణ 25 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేస్ లో టాప్ లో ఉన్నాడు. ఈ సీజన్ లో గుజరాత్ ను బ్యాటింగ్ లో సాయి, బౌలింగ్ లో ప్రసిద్ధ్ ముందుండి నడిపించారు. తర్వాతి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ నూర్ అహ్మద్ (24 వికెట్లు) ఉన్నాడు. వీరి జట్లు ఇప్పటికే లీగ్ లో ఇంటి ముఖం పట్టాయి. అయితే, ఫైనల్ ఆడనున్న బెంగళూరు పేసర్ హేజిల్ వుడ్, మరో రెండు మ్యాచ్ ల చాన్స్ ఉన్న ముంబై పేసర్ ట్రెంట్ బౌల్ట్ 21 వికెట్లతో ప్రసిద్ధ్ కు దగ్గరగా ఉన్నారు. గుజరాత్ స్పిన్నర్ సాయి కిశోర్ (19 వికెట్లు)కు చాన్స్ లేదు. కానీ, ముంబై పేసర్ జస్ప్రీత్ బుమ్రా 18 వికెట్లతో రేసులో కనిపిస్తున్నాడు. ముంబై గనుక ఫైనల్ చేరితే.. ఈ రెండు మ్యాచ్ లలో బుమ్రా 8 వికెట్లు తీయగలిగితే పర్పుల్ క్యాప్ సొంతం చేసుకుంటాడు.
