రోహిత్ పై పవర్ ప్లే కామెంట్స్.. ముంబైని ముంచేస్తున్న హార్దిక్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్టు అయిన ముంబై ఇండియన్స్ ప్రదర్శన నానాటికీ పడిపోతోంది.
By: Tupaki Desk | 30 March 2025 1:08 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్టు అయిన ముంబై ఇండియన్స్ ప్రదర్శన నానాటికీ పడిపోతోంది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో సమానంగా అత్యధికంగా ఐదు టైటిళ్ల విజేత అయిన ఆ జట్టు చివరిగా విజేతగా నిలిచింది 2020లో. అంటే నాలుగు సీజన్లు గడిచిపోయి ఐదో సీజన్ నడుస్తోంది. అయితే, ఈసారైన ముంబై టైటిల్ కొడుతుందా? అంటే చెప్పలేని పరిస్థితి.
టైటిళ్ల మీద టైటిల్స్ అందించిన రోహిత్ శర్మను నిరుడు అనూహ్యంగా తప్పించింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా వెళ్లిన తమ మాజీ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ఏరికోరి కెప్టెన్ గా తెచ్చుకుంది. కానీ, ఫలితాలు మాత్రం చాలా నిరుత్సాహకరంగా వచ్చాయి. రోహిత్ శర్మతో హార్దిక్ పాండ్యా యాటిట్యూడ్ తో వ్యవహరించిన తీరు అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. పాండ్యాపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.
ఇప్పుడు ఐపీఎల్ 18 సీజన్ లోనూ ముంబై ప్రదర్శన దారుణంగా ఉంది. వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడింది. తొలి మ్యాచ్ అంటే చెన్నై వంటి గట్టి జట్టుతో అనుకోవచ్చు. రెండో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమే ఇబ్బందికరం. రెండు పరాజయాలతో ఇప్పుడు ఆ జట్టు పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో ప్లేస్ లో ఉంది.
కాగా, చెన్నైపై డకౌట్ అయిన రోహిత్ గుజరాత్ పై 8 పరుగులే చేశాడు. సిరాజ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో హార్దిక్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
రోహిత్‌ను టార్గెట్ చేశాడా?
నిరుడు రోహిత్ పట్ల ఫీల్డ్ లో హార్దిక్ వ్యవహరించిన తీరును అభిమానులు తీవ్రంగా ఖండించారు. ఇపుడు మళ్లీ యువకులైన గుజరాత్ ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్ లతో పోలుస్తూ తమ జట్టులోనూ అదే చేయాల్సిందని అన్నాడు.
పవర్ ప్లే (మొదటి 6 ఓవర్లు)లో తమ బ్యాటర్లు బాధ్యత తీసుకోవాలని.. మున్ముందు రాణిస్తారని ఆశిస్తున్నానని చెప్పాడు. అంటే పరోక్షంగా ఓపెనర్ రోహిత్ ను ఉద్దేశించి అని అభిమానులు అంటున్నారు. పైగా స్లో బంతులతో గుజరాత్ బౌలర్లు తమను నిలువరించారని చెబుతూ.. తాను అదే చేశానంటూ హార్దిక్ సొంత డబ్బా కొట్టుకున్నాడు.
పాండ్యా నీ ఆట సంగతేంటి?
వరుసగా రెండో సీజన్ లోనూ హార్దిక్ సారథ్యంలోని ముంబై దారుణంగా ఆడుతోంది. మరోవైపు తన ముంబై కెప్టెన్సీ తొలగించాకే రోహిత్ దేశానికి టి20 ప్రపంచ కప్, వన్డే ఫార్మాట్ చాంపియన్స్ ట్రోఫీ సాధించిపెట్టాడు. అయితే, ఈ రెండు సార్లు టీమ్ ఇండియాలో హార్దిక్ ఉన్నాడు. ఐపీఎల్ కు వచ్చేసరికి మాత్రం పాండ్యా తేలిపోతున్నాడు. గత సీజన్ లోనూ పెద్దగా రాణించలేదు. ఈసారీ అతడి ప్రదర్శన అంతంతమాత్రమే.
ఐదుసార్లు టైటిల్ విజేత ముంబై.. నిరుడు హార్దిక్ సారథ్యంలోనే పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఇప్పుడు కూడా అదే విధంగా ఆడుతోంది.
ముంబైలో ఫైర్ పవర్ ఏది...?
ముంబై ఇండియన్స్ అంటే దమ్మున్న ఓపెనర్లు, దీటైన ఆల్ రౌండర్లు, మెరుపు బౌలర్లు.. దూకుడైన బ్యాటర్లు.. మలింగ నుంచి బుమ్రా వరకు, రోహిత్ నుంచి ఇషాన్ కిషన్ (గతంలో) దాక.. సూర్య నుంచి తిలక్ వర్మ వరకు.. ఇలా పవర్ ప్యాక్డ్ జట్టు అయిన ముంబై ఇప్పుడు పవర్ లేకుండా పోయింది. ఆ జట్టులో అసలు దూకుడే లేదు. ప్రత్యర్థిని తనదైన శైలిలో వేటాడే ముంబై అంటే మొనగాడు అని పేరుండేది.. ఇప్పుడది లోపించింది. మరీ ముఖ్యంగా హార్దిక్ కెప్టెన్సీలో.. దీనికి అతడు బాధ్యుడా? అంటే ఔనని చెప్పలేం.. కాదనీ చెప్పలేం..
కొసమెరుపు: హార్దిక్ పాండ్యా గత సీజన్ లో స్లో ఓవర్ రేట్ కు గాను ఈసారి చెన్నైతో తొలి మ్యాచ్ లో ఆడలేదు. గుజరాత్ తో రెండో మ్యాచ్ లోనూ స్లో ఓవర్ రేట్ కు గాను అతడిపై రూ.12 లక్షల ఫైన్ పడింది. ఈ ఏడాది ఫైన్ పడిన తొలి కెప్టెన్ హార్దిక్ కావడం గమనార్హం.