36/72.. సగం ఐపీఎల్ పూర్తి.. రన్స్, సిక్స్, వికెట్ల స్టార్లు ఎవరంటే?
మార్చి 22న మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) శనివారంతో సగం మ్యాచ్ లు పూర్తి చేసుకుంది.
By: Tupaki Desk | 20 April 2025 7:03 PM ISTమార్చి 22న మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) శనివారంతో సగం మ్యాచ్ లు పూర్తి చేసుకుంది. ఫైనల్స్ తో కలిపి 72 మ్యాచ్ లు కాగా.. ఇందులో 36 పూర్తయ్యాయి. మరొక్క రెండు రోజుల్లో నెల రోజులు పూర్తి కానున్నాయి.
ఇప్పటివరకు ప్రతి జట్టు కనీసం ఏడేసి మ్యాచ్ లు ఆడింది. లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ అయితే 8 మ్యాచ్ లు ఆడాయి. ఈ నెల 19 నాటికి పరుగులు, వికెట్లు, సిక్సులు, బౌండరీలలో ఎవరు టాప్ -3లో ఉన్నారంటే..?
ముగ్గురిలో ఇద్దరు గుజరాతీలే
ఈ సీజన్ లో తిరిగి బలంగా పుంజుకొంది గుజరాత్ టైటాన్స్. 2022లో ఆడిన తొలి సీజన్ లోనే విజేతగా, రెండో సీజన్ లో రన్నరప్ గా నిలిచింది ఈ జట్టు. మూడో సీజన్ 2024లో మాత్రం విఫలమైంది. ఇప్పుడు మాత్రం దూసుకెళ్తోంది. జట్టు ఓపెనర్ సాయి సుదర్శన్ 365 పరుగులతో, వన్ డౌన్ లో వస్తున్న జాస్ బట్లర్ 315 పరుగులతో జట్టు విజయాల్లో భాగం అవుతున్నారు. అయితే, వీరిద్దరినీ మించి ఆడుతున్నాడు లక్నో సూపర్ జెయింట్స్ బ్యాట్స్ మన్ నికొలస్ పూరన్. 368 పరుగులతో టాప్ లో ఉన్నాడు.
ఇక గుజరాత్ విజయాల్లో కీలకంగా నిలుస్తున్నాడు పేస్ బౌలర్ ప్రసిద్ధ్ క్రిష్ణ. మంచి ఎత్తులో బంతిని బలంగా పిచ్ పై వేసే క్రిష్ణ.. 14 వికెట్లు పడగొట్టాడు.
ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడు మీద ఉంది. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 12 వికెట్లతో జట్టుకు వెన్నెముకగా ఉన్నాడు.
మాజీ చాంపియన్, దిగ్గజ జట్టు అయిన చెన్నై సూపర్ కింగ్స్ కేవలం రెండు విజయాలే సాధించినా ఆ జట్టు స్పిన్నర్ నూర్ అహ్మద్ మాత్రం 12 వికెట్లతో తన ప్రతిభ చాటుతున్నాడు.
సిక్సర్లలోనూ పూరన్ (31)దే టాప్ ప్లేస్. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (20), రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (17) తర్వాతి స్థానాలో ఉన్నారు.
పరుగుల్లో పూరన్ ను వెంటాడుతున్న సాయి సుదర్శన్ (36) బౌండరీల్లో అతడిని అధిగమించాడు. ట్రావిస్ హెడ్ (33), బట్లర్ (32) అతడి వెనుక ఉన్నారు.
